Police Suspension: ఇల్లెందు సీఐ సస్పెన్షన్
ABN, Publish Date - Jun 26 , 2025 | 04:42 AM
ఓ ఎన్నారై పెళ్లి వివాదం ఇల్లెందు సీఐ సస్పెన్షన్‌కు దారి తీసింది. మల్టీజోన్-1 ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి, ఇరువర్గాల కథనం ప్రకారం.. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి ఠాణా పరిధిలోని చెంగిచర్లకు చెందిన దుబ్బాక వేణుగోపాల్‌రెడ్డి కుమార్తె శ్రావ్యను..
ఎన్నారై పెళ్లి వివాదంలో విచారణ
ఎన్నారై భార్య శ్రావ్య ఫిర్యాదుతో కౌన్సెలింగ్‌లు
కౌన్సెలింగ్ పేరుతో.. గంటల తరబడి ఠాణాలోనే ఎన్నారై తల్లిదండ్రులు
అక్రమ నిర్బంధమంటూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు
సస్పెండ్ చేసి, విచారణకు ఆదేశం
హైదరాబాద్/ఇల్లెందు, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): ఓ ఎన్నారై పెళ్లి వివాదం ఇల్లెందు సీఐ సస్పెన్షన్‌కు దారి తీసింది. మల్టీజోన్-1 ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి, ఇరువర్గాల కథనం ప్రకారం.. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి ఠాణా పరిధిలోని చెంగిచర్లకు చెందిన దుబ్బాక వేణుగోపాల్‌రెడ్డి కుమార్తె శ్రావ్యను.. భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం లలితాపురానికి చెందిన ఎన్నారై పెండ్లి నవీన్‌రెడ్డికి ఇచ్చి, 2023 జూన్ 8న వివాహం జరిపించారు. నవీన్‌రెడ్డి అమెరికాలో టెకీ కాగా.. బీటెక్ చదివిన శ్రావ్య కూడా పెళ్లయ్యాక ఆయనతో కలిసి డాలస్ వెళ్లారు. గత ఏడాది అక్టోబరు 24న శ్రావ్య భారత్‌కు తిరిగి రాగా.. తనను భర్త నవీన్‌రెడ్డి ఉద్దేశపూర్వకంగా పంపారని ఆమె ఆరోపించారు. అమెరికాలో వేధింపులకు గురి చేసినా.. లక్షలు కట్నమిచ్చి పెళ్లి చేసిన తల్లిదండ్రులు బాధపడతారనే కారణంతో తాను ఎవరికీ విషయం చెప్పలేదన్నారు. తనను అమెరికాకు తిరిగి వెళ్లకుండా నవీన్‌రెడ్డి అడ్డుకున్నారని, అత్తింటి వారు కూడా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ ఈ నెల 19న ఇల్లెందు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దర్యాప్తు ప్రారంభించిన సీఐ బత్తుల సత్యనారాయణ.. శ్రావ్య, ఆమె తల్లిదండ్రులు, అత్తింటి వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. అయితే.. కౌన్సెలింగ్ పేరుతో తమను నిర్బంధిస్తున్నారంటూ శ్రావ్య అత్తమామలు పెండ్లి పద్మజ, పెండ్లి ఉపేందర్‌రెడ్డి ఆరోపించారు. కౌన్సెలింగ్ పేరుతో పోలీ్‌సస్టేషన్‌లో 12 గంటల పాటు అక్రమంగా నిర్బంధించారని, కనీసం ఆహారం కూడా తీసుకునే అవకాశం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పద్మజ సొమ్మసిల్లడంతో.. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన సీఐ సత్యనారాయణను సస్పెండ్ చేసినట్లు ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి ఓ ప్రకటనను విడుదల చేశారు. ఈ వ్యవహారంపై విచారణకు భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా అదనపు ఎస్పీ(పరిపాలన) ప్రసాదరావును ఆదేశించినట్లు తెలిపారు. ఐజీ ఆదేశాలతో ప్రసాదరావు బుధవారం మధ్యాహ్నం ఇల్లెందు పోలీ్‌సస్టేషన్‌కు చేరుకుని, విచారణ ప్రారంభించారు.
ఈ క్రమంలో ఈఎస్పీ ఎన్.చంద్రభానుతోపాటు.. కౌన్సెలింగ్‌లో పాల్గొన్న షీటీమ్స్, ఇతర పోలీసు సిబ్బందిని ప్రశ్నించారు. శ్రావ్య ఫిర్యాదు చేసిన నాటి నుంచి ఠాణాలోని సీసీటీవీ ఫుటేజీని ఆయన పరిశీలించినట్లు తెలిసింది. కాగా.. బుధవారం కౌన్సెలింగ్ జరగాల్సి ఉండడంతో శ్రావ్య, ఆమె కుటుంబ సభ్యులు పోలీ్‌సస్టేషన్‌కు చేరుకున్నారు. ఆమె అత్తింటి వారు మాత్రం రాలేదు. ఈ సందర్భంగా శ్రావ్య మీడియాతో మాట్లాడుతూ.. నవీన్‌రెడ్డికి బట్టతల ఉన్న విషయాన్ని దాచి, విగ్గుతో ఏమార్చాడని ఆరోపించారు. అమెరికాలో తనను మానసిక క్షోభకు గురిచేశాడని.. ఇండియాలో వీసా స్టాంపింగ్ ఉందనే వంకతో 15 రోజుల ముందే తనను పంపాడని చెప్పారు. ఆ తర్వాత నవీన్‌రెడ్డి రాకపోగా.. తన తిరుగుప్రయాణం టికెట్‌ను రద్దు చేశారని వాపోయారు. తనను అత్తింటి వారు పట్టించుకోవడం లేదని, వారి ఇంటి ముందు ఆందోళన జరిపినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు శ్రావ్య చెప్పారు.
Updated Date - Jun 26 , 2025 | 04:42 AM