ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Farmers Protest: పసుపు రైతు పరేషాన్‌!

ABN, Publish Date - Mar 15 , 2025 | 03:52 AM

ప్రస్తుత సీజన్‌లో ధర లేక పసుపు రైతు ఆగమాగమవుతున్నాడు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిజామాబాద్‌ కేంద్రంగా జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేసినా మద్దతు ధర రాకపోవడంతో విలవిల్లాడుతున్నాడు.

మద్దతు ధర లేక విలవిల.. మార్కెట్లో వ్యాపారులు చెప్పిందే ధర

  • క్వింటాలుకు రూ.9,200 లోపే.. బోర్డు వచ్చినా మారని పరిస్థితి

  • భారీ వర్షాలతో తగ్గిన దిగుబడి.. పంటను దెబ్బతీసిన ‘దుంపకుళ్లు’

  • ప్రభుత్వం ఆదుకోవాలి: రైతులు

జగిత్యాల, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుత సీజన్‌లో ధర లేక పసుపు రైతు ఆగమాగమవుతున్నాడు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిజామాబాద్‌ కేంద్రంగా జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేసినా మద్దతు ధర రాకపోవడంతో విలవిల్లాడుతున్నాడు. మార్కెట్‌లో వ్యాపారులు చెప్పిన రేటే చలామణీ అవుతుండడంతో పెట్టుబడి సైతం రాని దుస్థితిలో పడ్డాడు. ఈ క్రమంలో ఇటీవల పసుపునకు క్వింటాలుకు రూ.15 వేల మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ నిజామాబాద్‌, మెట్‌పల్లిలలో రైతు ఐక్యవేదికల ఆధ్వర్యంలో రైతులు రోడ్డెక్కి ఆందోళన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.20 లక్షల ఎకరాల్లో పసుపు సాగవుతుండగా జగిత్యాల, నిజామాబాద్‌, నిర్మల్‌ జిల్లాల్లో సుమారు 80 వేల ఎకరాల్లో రైతులు పసుపు పండిస్తున్నారు. ఇక్కడి నేలలు పసుపు పంటకు అనుకూలంగా ఉండడం వల్ల దిగుబడులు బాగా వస్తున్నాయి. అయితే, ప్రస్తుత సీజన్‌లో వర్షాలు ఎక్కువగా కురవడం వల్ల పంట దెబ్బతిని కొద్దిగా దిగుబడులు తగ్గాయి. దీనికి తోడు పసుపునకు దుంపకుళ్లు రోగం పలు ప్రాంతాల్లో సోకి దిగుబడిపై ప్రభావం చూపింది. సాధారణంగా ఎకరాకు 35 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందనుకుంటే 20 నుంచి 25 క్వింటాళ్లకు దిగుబడి పడిపోయిందని రైతులు అంటున్నారు. ఒక్కో రైతు ఎరువులు, కలుపుతీత, పంట తవ్వకం, కొమ్ములు విరవడం, ఉడకబెట్టేందుకు ఎకరాకు సుమారు రూ.లక్ష వరకు వ్యయం చేశారు. అయితే ఆ స్థాయిలో దిగుబడి రాకపోవడం, ధరలు లేకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు.


గతేడాది ధరలో సగమే ఈసారి

గతేుడాది పసుపు క్వింటాలుకు రూ.17 వేల నుంచి రూ.18 వేల వరకు ధర పలికింది. దీంతో ఈ యేడాది సైతం ధరలు బాగుంటాయని రైతులు ఆశించారు. ఇటీవల నిజామాబాద్‌లో కేంద్ర ప్రభుత్వం జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేసి, బోర్డుకు చైర్మన్‌ను, కార్యదర్శిని నియమించింది. దీంతో తమకు మంచి రోజులు వచ్చాయని అన్నదాతలు భావించారు. అయినా, వారం రోజులుగా జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మార్కెట్‌లో పసుపు క్వింటాలుకు రూ.8,500 నుంచి రూ.9,200 లోపే పలుకుతోంది. ఫలితంగా పెట్టుబడులు సైతం రావడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు.


రూ.15 వేలు మద్దతు ధర ప్రకటించాలి

పసుపు బోర్డు ఏర్పాటు చేయడం సంతోషకరమే. పసుపు క్వింటాలుకు రూ.15 వేల మద్దతు ధరను ప్రకటించాలి. మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ స్కీం (ఎంఐఎస్‌) కింద పసుపును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేయాలి. మార్కెట్‌లో ధరలు లేకపోవడం వల్ల రైతులు నష్టాల పాలవుతున్నారు. పసుపు రైతులను ప్రభుత్వాలు ఆదుకోవాలి.

- పన్నాల తిరుపతి రెడ్డి, రైతు ఐక్య వేదిక నాయకులు, జగిత్యాల జిల్లా

Updated Date - Mar 15 , 2025 | 03:52 AM