Nirmal: వరకట్న వేధింపులకు నవ వధువు బలి
ABN, Publish Date - Jun 15 , 2025 | 04:32 AM
భవిష్యత్‌పై ఎన్నో కలలుకంటూ అత్తారింట్లోకి అడుగుపెట్టిన ఓ నవ వధువు పెళ్లయిన మూడు నెలలకే తనువు చాలించింది.
పెళ్లయిన 3 నెలలకే ఆత్మహత్య
నిర్మల్ జిల్లాలో విషాదం..
భర్త, అత్త సహా ఆరుగురిపై కేసు
ఖానాపూర్, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): భవిష్యత్‌పై ఎన్నో కలలుకంటూ అత్తారింట్లోకి అడుగుపెట్టిన ఓ నవ వధువు పెళ్లయిన మూడు నెలలకే తనువు చాలించింది. అదనపు కట్నం వేధింపులకు మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నిర్మల్ జిల్లాలో చోటు చేసుకుంది. ఖానాపూర్ మండలం మస్తాన్ ఎల్లాపూర్ గ్రామానికి చెందిన దండగుల శైలజ(20)కి పాత ఎల్లాపూర్ గ్రామానికి చెందిన అల్లెపు రాజే్‌షతో వివాహం జరిగింది. పెళ్లి అయిన కొద్ది రోజులకే అదనపు కట్నం తీసుకు రావాలంటూ శైలజకు అత్తింటి వారి వేధింపులు మొదలయ్యాయి.
ఈ విషయమై ఇటీవల ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో పంచాయితీ కూడా జరిగింది. అయితే వేధింపులు రోజురోజుకూ ఎక్కువ కావడంతో.. శనివారం మధ్యాహ్నం ఇంట్లోనే ఉరేసుకుని శైలజ మృతిచెందింది. తమ కూతురి ఆత్మహత్యకు అత్తింటి వేధింపులే కారణమని మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు శైలజ భర్త, అత్త సహా ఆరుగురు కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసినట్టు ఖానాపూర్ ఎస్సై రాహుల్ తెలిపారు.
Updated Date - Jun 15 , 2025 | 04:32 AM