ప్రభుత్వ బడుల్లో ఏఐ బోధన
ABN, Publish Date - Jun 12 , 2025 | 04:38 AM
రాష్ట్రం లో పాఠశాలలకు వేసవి సెలవులు ముగిశాయి. గురువారం నుంచే బడులు మళ్లీ తెరుచుకుంటున్నాయి. 2025-26 విద్యా సంవత్సరం ప్రారంభమవుతోంది.
1 నుంచి 9 తరగతులకు కృత్రిమ మేధ పాఠాలు.. 5,651 ప్రాథమిక పాఠశాలల్లో బోధన
తెలుగు, ఇంగ్లిషు, గణితంలో.. వెనకబడిన విద్యార్థులపై వ్యక్తిగత శ్రద్ధ
ప్రత్యేక అవసరాల విద్యార్థులకు 602 భవిత కేంద్రాల్లో బోధన
9,10 తరగతులకు నీట్, ఎప్‌సెట్ శిక్షణ
నేటి నుంచే బడుల పునః ప్రారంభం
హైదరాబాద్, జూన్ 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రం లో పాఠశాలలకు వేసవి సెలవులు ముగిశాయి. గురువారం నుంచే బడులు మళ్లీ తెరుచుకుంటున్నాయి. 2025-26 విద్యా సంవత్సరం ప్రారంభమవుతోంది. ఈ క్రమంలో గతంలో ఎన్న డూ లేనివిధంగా కీలక సంస్కరణలకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. విద్యాశాఖ బాధ్యతలు కూడా పర్యవేక్షిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల్లో కొత్తగా అనేక కార్యక్రమాలు అమల్లోకి రానున్నాయి. కృత్రిమ మేధ (ఏఐ)పాఠ్యాంశాలు, బాలికల విద్యకు ప్రోత్సా హం, ప్రత్యేక అవసరాల విద్యార్థులకు ప్రత్యేక కేం ద్రాలు, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ సహా ఎన్నో మార్పులు జరగనున్నాయి.
కృత్రిమ మేధ ఆధారిత బోధన..
ఏఐ సాంకేతికతకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 1-9 తరగతులకు ప్రాథమిక పాఠాలను బోధించేందుకు ప్రత్యేక పాఠ్యాంశాలు సిద్ధం చేశారు. మెషీన్‌లెర్నింగ్, డేటా, బాఽధ్యతాయుత ఏఐ వినియోగంపై పాఠాలుంటాయి. ఇక ప్రభు త్వ పాఠశాలల్లో అనేకమంది మాతృభాష తెలుగుతోపాటు ఇంగ్లిషు, గణితంలో వెనకబడినట్టు పలు అధ్యయనాలు తేల్చాయి. ఈ నేపథ్యంలో ఇకపై ఏఐ టెక్నాలజీ ఆధారంగా ఈ మూడు సబ్జెక్టులను బోధించనున్నారు. ఇప్పటికే ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. బెంగళూరు కేంద్రం గా ఉన్న ఏక్‌స్టెప్ ఫౌండేషన్ దీనికి సహకారం అందించనుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5,651 ప్రాథమిక పాఠశాలల్లో ఏఐ ఆధారిత బోధనకు ఏర్పాట్లు చేశారు.
కేజీబీవీల్లో 12వ తరగతి వరకు బోధన
బాలికల విద్యలో జాతీయ సగటు కంటే రాష్ట్రం వెనుకబడి ఉంది. ఈ క్రమంలో బాలికల విద్యను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని 120 కస్తూర్బా (కేజీబీవీ) పాఠశాలల్లో ఇప్పటివరకు 6-10 తరగతి వరకు బోధిస్తుండగా.. ఇప్పుడు 12వ తరగతి వరకు ఉన్నతీకరించారు. దీనితో 11, 12వ తరగతుల్లో కొత్తగా 7,680 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. ఇక, రాష్ట్రంలోని 602 భవిత కేంద్రాలను ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల బడులుగా వినియోగించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. కొత్త పాఠశాలల ఏర్పాటు వరకు వీటిని కొనసాగించనున్నారు.
తెలంగాణ-స్టెమ్ ల్యాబ్స్
సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ (స్టెమ్) సబ్జెక్టులపై విద్యార్థులకు మరింత అవగాహన కల్పించేందుకు.. రాష్ట్రంలోని అన్ని ఉన్నత పాఠశాలల్లో టీ-స్టెమ్ ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. వాటిని 6 నుంచి 10 తరగతి ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు సైతం ఉపయోగించుకోవచ్చు. దీనికోసం ఖాన్ అకాడమీ సహకారం అందించనుంది. అలాగే చదువులో వెనుకబడిన విద్యార్థులపై మరింత శ్రద్ధ పెట్టేందుకు పీజీ కాంట్రాక్టు టీచర్లను నియమించనున్నారు. అలాగే ఇప్పటికే జూనియర్ లెక్చరర్లుగా విధులు నిర్వర్తిస్తున్న వారి సేవలనూ పాఠశాలల్లో వినియోగించనున్నారు.
తొలిరోజే పుస్తకాలు, యూనిఫామ్..
ఈసారి విద్యా సంవత్సరం ప్రారంభమైన తొలిరోజే ఉచిత పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్‌లు అందించేందుకు ఏర్పాట్లు చేసినట్టు విద్యాశాఖ తెలిపింది. తొలిసారి ఈసారి 1-5 తరగతుల విద్యార్థులకు నోటు పుస్తకాలనూ ఉచితంగా అందిస్తున్నారు. బోధనలో నాణ్యతను పెంచే లక్ష్యంతో ఇటీవలే రాష్ట్రవ్యాప్తంగా 1.12 లక్షల మంది ఉపాధ్యాయులకు 5రోజుల పాటు ప్రత్యేక శిక్షణ అందించారు. ఇక కేజీబీవీలు, గురుకులాలు, మోడల్ స్కూళ్లలో అందించే భోజనం నాణ్యత, పరిశుభ్రత లక్ష్యంగా 51,500 వంటమనుషులకు.. ప్రభుత్వ బడుల్లో పరిశుభ్రత కోసం 48,292 శానిటేషన్ వర్కర్లకు ప్రత్యేక శిక్షణ అందించారు.
Updated Date - Jun 12 , 2025 | 04:39 AM