COVID-19: కొవిడ్‌పై నిరంతర నిఘా
ABN, Publish Date - May 27 , 2025 | 04:53 AM
కొవిడ్‌పై నిరంతరం నిఘా కొనసాగించాలని, ప్రజలకు ఈ అంశంపై నిపుణులు అవగాహన కల్పించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.
సీజనల్ వ్యాధుల కట్టడికి చర్యలు
అవసరమైతే కేంద్ర వైద్య సంస్థల సహకారం తీసుకోవాలని నిర్ణయం
కొవిడ్ జీనోమ్ సీక్వెన్సీకి నమూనాలు
ప్రతి జిల్లాకూ ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలు
సీసీఎంబీ, ఐసీఎంఆర్, సీడీఎఫ్‌డీ, ఎయిమ్స్ డైరెక్టర్లతో మంత్రి దామోదర భేటీ
కొవిడ్‌తో ప్రస్తుతానికి ప్రమాదమేమీ లేదు
ప్రజల్లో ఇప్పటికే ఇమ్యూనిటీ: నిపుణులు
హైదరాబాద్, మే 26 (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌పై నిరంతరం నిఘా కొనసాగించాలని, ప్రజలకు ఈ అంశంపై నిపుణులు అవగాహన కల్పించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సీజనల్ వ్యాధుల కట్టడికి తగిన చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. అవసరమైతే కేంద్ర ప్రభుత్వ వైద్యసంస్థల సహకారం తీసుకోవాలని సూచించారు. దేశవ్యాప్తంగా పెరుగుతున్న కొవిడ్ కేసులు, సీజనల్ వ్యాఽధుల కట్టడికి ముందస్తు ప్రణాళికల్లో భాగంగా తొలిసారి కేంద్ర సంస్థల కీలక ప్రతినిధులతో మంత్రి సమావేశమయ్యారు. సోమవారం సచివాలయంలో జరిగిన ఈ సమావేశానికి సీసీఎంబీ డైరెక్టర్ వినయ్ నందికూరి, బీబీనగర్ ఎయిమ్స్ డైరెక్టర్ అభిషేక్ అరోరా, సెంటర్ ఫర్ డీఎన్‌ఏ, ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నస్టిక్స్ డైరెక్టర్ ఉల్లాస్ కొల్తూర్ సీతారాం, ఐసీఎంఆర్ ఎన్‌ఐఎన్ శాస్త్రవేత్త సుదీప్ ఘోష్ హాజరయ్యారు. నిపుణులంతా భారత్ సహా ఇతర దేశాల్లో ఉన్న పరిస్థితులను మంత్రికి వివరించారు. ఇప్పటివరకు ఉన్న సమాచారం, పరిశోధనల ప్రకారం కొవిడ్‌తో ప్రస్తుతానికైతే ప్రమాదమేమీ లేదన్నారు. వివిధ దేశాల్లో అక్కడక్కడా కేసులు పెరుగుతున్నా.. ఆస్పత్రిలో చేరికలు లేవని తెలిపారు. మన రాష్ట్రంలో, దేశంలో ప్రజల్లో ఇప్పటికే హెర్డ్ ఇమ్యునిటీ వచ్చినందున.. పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదని నిపుణులు వివరించారు. పరిస్థితి సాధారణంగా ఉన్నందునే కేంద్ర ఆరోగ్యశాఖ కూడా ఇప్పటివరకూ ఎటువంటి అడ్వైజరీ, గైడ్‌లైన్స్ విడుదల చేయలేదని బీబీనగర్ ఎయిమ్స్ డైరెక్టర్ అభిషేక్ అరోరా చెప్పారు.
జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం నమూనాలు..
కొవిడ్ జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం నమూనాలు పంపించాలని సీసీఎంబీ, సీడీఎ్‌ఫడీ డైరెక్టర్లు విజ్ఞప్తి చేయగా.. మంత్రి దామోదర సానుకూలంగా స్పందించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు సీసీఎంబీ, సీడీఎ్‌ఫడీ, బీబీనగర్ ఎయిమ్స్, నిమ్స్ తదితర సంస్థలతో కలిసి చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి జిల్లాలోనూ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పంచాయతీరాజ్, మునిసిపల్, ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ, ప్రతి గ్రామంలో, పట్టణంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. డెంగీ, మలేరియా కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాలను గుర్తించి, ఆయా ప్రాంతాల్లో పంచాయతీరాజ్, మునిసిపల్ శాఖలను అప్రమత్తం చేయాలని, ఆరోగ్య శాఖ నుంచి బృందాలను పంపించి అవగాహన శిబిరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో వర్షాలు మొదలయ్యాయని, సీజనల్ వ్యాధులతో ఆస్పత్రుల్లో ఓపీ, ఐపీ పెరిగే అవకాశం ఉన్నందున.. అన్ని విధాలుగా సిద్ధంగా ఉండాలని అన్నారు.
ఎప్పటికప్పుడు నీటి నమూనాల పరీక్షలు..
రాష్ట్రంలో వాటర్‌బోర్న్ (డయేరియా, టైఫాయిడ్), వెక్టార్ బోర్న్ (డెంగీ, మలేరియా) జబ్బుల నివారణ, నియంత్రణకు సూచనలు ఇవ్వాలని నిపుణులను మంత్రి దామోదర కోరారు. వెక్టార్‌బోర్న్ వ్యాధుల నియంత్రణ కోసం ఎప్పటికప్పుడు నీటి నమూనాలను పరీక్షించి నివేదికలు అందించాలన్నారు. ఇందుకు సీసీఎంబీ, సీడీఎ్‌ఫడీ డైరెక్టర్లు సానుకూలంగా స్పందించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నీటి నమూనాలను ేసకరించి సీసీఎంబీ, సీడీఎ్‌ఫడీ తదితర ల్యాబ్‌లకు పంపించాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను మంత్రి ఆదేశించారు ఆస్పత్రుల్లో పాముకాటు, తేలుకాటు ఔషధాలు, ఇంజక్షన్లను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఈ సమీక్షలో ఆరోగ్యశాఖ కార్యదర్శి, నిమ్స్ డైరెక్టర్ బీరప్ప, ప్రజారోగ్య సంచాలకులు రవిందర్ నాయక్, వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Also Read:
సైంటిస్టులు అద్భుత ఆవిష్కరణ.. 'సూపర్-విజన్' లెన్స్‌తో చీకట్లోనూ చూసేయచ్చు..
సన్నగా, బలహీనంగా ఉన్నారా? ఫిట్‌నెస్ మంత్ర ఇదే..
For More Health News and Telugu News..
Updated Date - May 27 , 2025 | 04:53 AM