Hyderabad: అందరూ ఉన్నా.. అనాథలుగానే మిగిలిపోతున్నారు..
ABN, Publish Date - Jun 05 , 2025 | 11:42 AM
మానవ సంబంధాలు రానురాను ఎలా దిగజారిపోతున్నాయో ఇక్కడ జరుగుతున్న విషయాలను చూసి అర్ధం చేసుకోవచ్చు. ఆరోగ్యంగా ఉండి డబ్బు సంపాదిస్తే సరి.. లేకుంటే అందరూ ఉన్నా అనాథలుగా మిగులిపోవాల్సి్దే. ఇటువంటి విషయమే ఇక్కడ జరిగింది. నగరంలోని ఎర్రగడ్డలోగల మానసిక ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చిన వారిని వారి కుటుంబ సభ్యులు అలాగే వదిలేసి వెళ్తున్నారు. ఇక వివరాల్లోకి వెళితే..
- రోగం నయమైనా ఇంటికి తీసుకెళ్లరే..
- మానసిక సమస్యలతో వచ్చి అనాథలుగా మిగులుతున్న అభాగ్యులు
- రోగులను ఆస్పత్రిలో చేర్చించి చేతులు దులుపుకుంటున్న కుటుంబసభ్యులు
- తమవారి కోసం ఎర్రగడ్డ ఆస్పత్రి డీసీ వార్డులో 80 మంది దాకా ఎదురుచూపు
- ఇటీవల మరణించిన కరుణ్ ఆ వార్డులోని వ్యక్తే
హైదరాబాద్ సిటీ: మానసిక అనారోగ్యంతో ఆస్పత్రి పాలైన చాలామంది అనాథలుగా మారిపోతున్నారు. రోగులను ఆస్పత్రుల్లో చేర్పించిన తర్వాత కుటుంబసభ్యులు చేతులు దులుపేసుకుంటున్న ఘటనలు చాలా ఉంటున్నాయి. కొందరు రోగుల విషయంలో.. చికిత్స ఎలా జరుగుతుంది ? తమ వారి ఆరోగ్యం ఎలా ఉంది ? అని కనీస వాకబు చేసే వారు కూడా ఉండరు. అంతేకాదు. చికిత్స పూర్తయి, రోగం నయమై మామూలు మనిషిగా మారిన వారిని ఇంటికి తీసుకెళ్లే వారూ ఉండరు.
దీంతో మానసిక అనారోగ్యంతో ఆస్పత్రి పాలైన చాలామంది చివరికి ఎవరూ లేని అనాథలుగా మిగులుతున్నారు. ఇలా అనాథలుగా మారిన వారు హైదరాబాద్, ఎర్రగడ్డ ప్రభుత్వ మానసిక వైద్యశాలలోనూ చాలా మందే ఉన్నారు. ఎర్రగడ్డ ఆస్పత్రిలో చేరిన రోగుల్లో చికిత్స అనంతరం మామూలు మనుషులుగా మారిన వారిని ఆస్పత్రిలోని డిశ్చార్జి కమిటీ(డీసీ) వార్డులోకి మారుస్తారు. డీసీ వార్డులో ఉన్న వారిని.. కుటుంబసభ్యులు, బంధువులకు అప్పజెప్పి డిశ్చార్జి చేస్తుంటారు. ఎవరూ రాకపోతే రోగం నయం అయినా సరే వారు ఆ వార్డులో ఉండాల్సిందే.
ఏడాదిగా డీసీ వార్డులోనే..
ఎర్రగడ్డ ఆస్పత్రి డీసీ వార్డులో ప్రస్తుతం 80 మందికి పైగా రోగులు ఉన్నారు. ఫుడ్‌పాయిజన్ ఘటనలో సోమవారం మరణించిన కరుణ్ కూడా ఏడాదిగా డీసీ వార్డులోనే ఉంటున్నాడు. 2023లో ఆస్పత్రిలో చేరిన కరుణ్‌ను చికిత్స అనంతరం డీసీ వార్డుకు మార్చారు. కానీ, కుటుంబసభ్యుల ఆచూకీ లేకపోవడంతో కరుణ్ ఆస్పత్రిలోనే ఉండిపోయి చివరికి కన్నుమూశాడు. డీసీ వార్డులో ఉన్నవారిని వారి స్వస్థలాలకు, అయినవారి దగ్గరకు చేర్చడానికి ఆస్పత్రి వర్గాలు కూడా నానా తంటాలు పడుతున్నాయి. రోగుల కుటుంబసభ్యులకు లేఖలు రాసి, వారి ఆచూకీ కోసం ప్రయత్నించి విసిగిపోతున్నాయి.
డీసీ వార్డులో ఉన్నవారి సంఖ్య పెరిగిపోతుండడం కూడా ఆస్పత్రి వర్గాలకు సమస్యగా మారుతుంది. చివరికి కొందరిని అనాథ ఆశ్రమాలకు తరలిస్తున్నారు. కాగా, ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రిలో మౌలిక వసతులు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి. రోగులకు రక్త, మూత్ర వంటి పరీక్షలతో అత్యవసర వైద్య పరీక్షలు చేసేందుకు ఆస్పత్రిలో ల్యాబ్ లేదు. అలాగని రోగులను బయటికి తరలించాలంటే అంబులెన్స్ కూడా లేదు. ప్రైవేటు అంబులెన్స్‌లే దిక్కుగా ఉన్నాయి. ఇక, రోగులకు అందించే ఆహారం విషయంలో తగిన పర్యవేక్షణ కూడా లేదు. రోగులకు భోజనంతో పాటు రెండు గుడ్లు వడ్డించాలి.
కానీ, ఒక గుడ్డును రెండు ముక్కలు చేసి వడ్డిస్తున్నారంటే.. ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. మరోపక్క, ఎర్రగడ్డ ఆస్పత్రికి కట్టుదిట్టమైన ప్రహారీ గోడ లేకపోవడంతో బయటి వ్యక్తులు ఆవరణలో తిష్ట వేసి అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. దీంతో రోగుల భద్రత ఆందోళనకరంగా మారింది. ఆస్పత్రిలో వసతుల లేమీ, సిబ్బంది కొరత, వారి పని తీరుపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో జాతీయ మానవ హక్కుల సంఘం బృందం 2010 జూలైలో ఆస్పత్రిలో పర్యటించింది. ఆస్పత్రిలోని పరిస్థితులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిక ఇచ్చినా ఇప్పటిదాకా ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.
ఈ వార్తలు కూడా చదవండి.
Read Latest Telangana News and National News
Updated Date - Jun 05 , 2025 | 11:42 AM