Meenakshi Natarajan: ఆర్‌ఎస్‌ఎస్ తరహాలో.. ప్రజల్ని కలవండి
ABN, Publish Date - Apr 19 , 2025 | 05:49 AM
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎ్‌సఎస్) సభ్యులు మనిషి మనిషినీ కలుస్తుంటారని.. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు కూడా అదే తరహాలో ప్రజలను కలవాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ సూచించారు.
ప్రతి ఒక్కరితో నేరుగా మాట్లాడండి.. ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయుకి తీసుకెళ్లండి
కేవలం మీడియా, సోషల్ మీడియాను నమ్ముకుంటే సరిపోదు
బూత్ స్థాయి నుంచీ పార్టీని నిర్మించుకుందాం
పాత, కొత్త నేతల సమస్యపై సీఎం వచ్చాక చర్చిస్తా
చేవెళ్ల, జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గ నేతల సమావేశంలో.. మీనాక్షీ నటరాజన్ దిశానిర్దేశం
హైదరాబాద్, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎ్‌సఎస్) సభ్యులు మనిషి మనిషినీ కలుస్తుంటారని.. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు కూడా అదే తరహాలో ప్రజలను కలవాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ సూచించారు. ప్రభుత్వ పథకాలు, పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కేవలం మీడియానో, సోషల్ మీడియానో నమ్ముకుంటే సరిపోదని స్పష్టం చేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రజల వద్దకు వెళ్లి ముఖాముఖిగా మాట్లాడాలని.. అప్పుడే ప్రజలు నాయకులకు, పార్టీకి, ప్రభుత్వానికి దగ్గరవుతారని చెప్పారు. శుక్రవారం గాంధీభవన్‌లో చేవెళ్ల, జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గాల నేతలతో సమీక్షా సమావేశం జరిగింది. టీపీసీసీ చీఫ్ మహే్‌షకుమార్‌గౌడ్, మంత్రి దామోదర రాజనర్సింహ, మాజీ మంత్రులు గీతారెడ్డి, షబ్బీర్ అలీ, పార్టీ నేతలు కేఎల్‌ఆర్, ఎ.చంద్రశేఖర్ తదితరులు కూడా పాల్గొన్న ఈ సమావేశంలో మీనాక్షి పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు.
పార్టీని బతికించుకున్న నేతలకు ప్రాధాన్యత ఏదీ?
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి ఎందుకు తీసుకెళ్లలేక పోతున్నారని సమీక్ష సందర్భంగా పార్టీ నేతలను మీనాక్షి ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్న పదేళ్లు పార్టీని బతికించుకున్న నేతలకు క్షేత్రస్థాయిలో ప్రాధాన్యత లేకుండా పోయిందని.. అధికారాలన్నీ కొత్తగా పార్టీలోకి వచ్చిన వారి వద్దే ఉన్నాయని పలువురు సీనియర్లు బదులిచ్చారు. ప్రభుత్వ, పార్టీ పదవుల్లో పాత నేతలకు ప్రాధాన్యత ఇవ్వకుంటే కష్టమేనని పేర్కొన్నారు. ప్రజల్లోకి చొచ్చుకుపోవాలంటే నేతలు, కార్యకర్తలకు ప్రభుత్వ పదవులో, పార్టీ పదవులో ఉండాలని.. అలాంటివేమీ లేకపోవడం సమస్యగా మారిందని కొందరు నేతలు పేర్కొన్నారు. వీలైనంత త్వరగా స్థానిక ఎన్నికలు నిర్వహించాలని కోరారు. పాత, కొత్త నేతల మధ్య సమన్వయం కోసం ఒక పరిష్కార మార్గాన్ని ఆలోచించాలని సూచించారు.
దీనిపై మీనాక్షీ నటరాజన్ స్పందిస్తూ.. సీఎం రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటన నుంచి వచ్చాక ఆయనతో మాట్లాడి ఈ సమస్యకు పరిష్కార మార్గాన్ని ఆలోచిస్తామని తెలిపారు. పార్టీని నమ్ముకుని ఉన్న వారికి పదవుల్లో ప్రాధాన్యత ఉంటుందని హామీ ఇచ్చారు. ఎన్నికలప్పుడు హడావుడిగా బూత్ కమిటీలు వేయడం కాకుండా.. ఇప్పుడే గ్రామస్థాయి నుంచీ పార్టీ నిర్మాణం చేపడతామని, దీనితో స్థానిక ఎన్నికల్లో కూడా ప్రయోజనం ఉంటుందని చెప్పారు. కాగా, చేవెళ్ల లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ ఓటమికి కారణాలను మీనాక్షి ఆరా తీశారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పని చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. టీపీసీసీ చీఫ్ మహే్‌షగౌడ్ మాట్లాడుతూ... నాయకులు పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల ప్రచారంలో వెనుకబడి పోతున్నామని పేర్కొన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి.. అభివృద్ధి.. సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు.
Updated Date - Apr 19 , 2025 | 05:49 AM