Hyderabad: బస్తర్‌లో కాల్పుల విరమణ అత్యవసరం
ABN, Publish Date - Apr 19 , 2025 | 05:56 AM
బస్తర్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, మావోయిస్టు పార్టీల మధ్య కాల్పుల విరమణ జరగాలని, ఆదివాసీలను కాపాడుకోవాల్సిన బాధ్యత పౌర సమాజానిదేనని పలువురు మేధావులు, రాజకీయ నేతలు పిలుపునిచ్చారు.
భారత్ బచావో సభలో మేధావులు, రాజకీయ నేతలు
రాంనగర్, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): బస్తర్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, మావోయిస్టు పార్టీల మధ్య కాల్పుల విరమణ జరగాలని, ఆదివాసీలను కాపాడుకోవాల్సిన బాధ్యత పౌర సమాజానిదేనని పలువురు మేధావులు, రాజకీయ నేతలు పిలుపునిచ్చారు. బస్తర్‌లో కాల్పుల విరమణకు మద్దతుగా భారత్ బచావో ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శనివారం జరిగిన సదస్సులో తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సభలో ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ రాజ్యాంగంలోని షెడ్యూల్ 5, 6 లను ప్రభుత్వాలు కఠినంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆదివాసీల పట్ల మాననీయంగా వ్యవహరించాలని, మావోయిస్టు పార్టీతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపి బస్తర్‌లో కాల్పుల విరమణ ప్రకటించాలని కోరారు.
ఆదివాసీ నాయకురాలు సోనిసోరి మాట్లాడుతూ బస్తర్‌లో సల్వా జూడుం పేరుతో విపరీతమైన హింస జరుగుతుందని, ఆదివాసులను అరెస్ట్ చేసి జైలులో పెట్టి చంపేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీ కోదండరాం మాట్లాడుతూ మావోయిస్టు పార్టీతో చర్చలకు ప్రభుత్వాలు కూడా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్, సీనియర్ సంపాదకులు కె.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Apr 19 , 2025 | 05:56 AM