Labour Unions: కదం తొక్కిన కార్మిక లోకం..
ABN, Publish Date - Jul 10 , 2025 | 03:49 AM
రాష్ట్రవ్యాప్తంగా కార్మిక, ఉద్యోగ సంఘాలు కదం తొక్కాయి. కేంద్రం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్‌లను తక్షణమే రద్దు చేయాలంటూ నిరసనలు చేపట్టాయి.
రాష్ట్రవ్యాప్తంగా కార్మిక సంఘాల ఆందోళనలు
కేంద్రం ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్‌ల రద్దుకు డిమాండ్
సమ్మెతో బోసిపోయిన సింగరేణి బొగ్గు బావులు
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్): రాష్ట్రవ్యాప్తంగా కార్మిక, ఉద్యోగ సంఘాలు కదం తొక్కాయి. కేంద్రం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్‌లను తక్షణమే రద్దు చేయాలంటూ నిరసనలు చేపట్టాయి. మానవహారాలు, రాస్తారోకోలు, బైక్ ర్యాలీలు, సభలు, సమావేశాలతో హోరెత్తించాయి. కేంద్రానికి వ్యతిరేకంగా కార్మికులు చేసిన నినాదాలతో మండల, జిల్లా కేంద్రాలు పిక్కటిల్లాయి. నిరసనలకు పలు పార్టీలతో ప్రజా సంఘాలు మద్దతు పలికాయి. బీడీ, హమాలీ కార్మికుల నుంచి ఆర్టీసీ, సింగరేణి కార్మికుల వరకు ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు. సింగరేణి వ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా ఉత్పత్తికి నష్టం వాటిల్లినట్లు సమాచారం. కేంద్రం వ్యవహరిస్తున్న కార్మిక వ్యతిరేక వైఖరికి నిరసనగా దేశవ్యాప్తంగా 10 కేంద్ర కార్మిక సంఘాలు ఒక్కరోజు సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.. ఈ నేపథ్యంలోనే బుధవారం ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వరకు కార్మిక, ఉద్యోగ సంఘాలు సమ్మెలో పాల్గొని నిరసనలు నిర్వహించాయి. హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్ర నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ మీదుగా ఇందిరా పార్కు వరకు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఏఐటీయూసీ, సీఐటీయూ, సీఐటీయూ, ఐఎన్‌టీయూసీ, హెచ్‌ఎంఎ్‌స, టీయూసీయూ, ఐఎ్‌ఫటీయూ తదితర సంఘాల కార్మికులు ఇందులో పాల్గొన్నారు. దీనికి హాజరైన సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కార్మిక వర్గాలు సరైన ఆలోచన చేస్తే గద్దె మీద ఎర్ర జెండా పార్టీలు ఉంటాయని.. అప్పుడే మేలు జరుగుతుందని అన్నారు. సీఐటీయూ ఆఽధ్వర్యంలో కాటేదాన్ రాంచరణ్ ఆయిల్ మిల్ వద్ద బైక్ ర్యాలీని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ జెండా ఊపి ప్రారంభించారు. తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిరసనలు చేపట్టారు.
జిల్లా కేంద్రాల్లో భారీ ర్యాలీలు..
సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, నల్లగొండ జిలా ్లకేంద్రాల్లో భారీ ప్రదర్శనలు నిర్వహించి, కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమ్మె కారణంగా మెదక్ జిల్లాలోని పారిశ్రామిక ప్రాంతాలైన చిన్న శంకరంపేట, చేగుంట, తూప్రాన్, మనోహరాబాద్‌లలో అనేక పరిశ్రమలు పనిచేయలేదు. మెదక్ జిల్లాలో సుమారు 220 పరిశ్రమలు సమ్మె కారణంగా మూతపడ్డాయి. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో సీపీఐ, సీపీఎంలతో పాటు పలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చేవెళ్లలోని హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై భారీగా ర్యాలీ నిర్వహించారు. మేడ్చల్ జిల్లా కుషాయిగూడ, నాచారం మల్లాపూర్ ప్రాంతాల్లోని పారిశ్రామిక వాడలోని కార్మికులు తమ విధులను బహిష్కరించారు. సమ్మెలో భాగంగా పెద్దపల్లి జిల్లాలో సింగరేణిలో కార్మికులెవరూ విధులకు హాజరు కాలేదు. సింగరేణిలో పనిచేసే 36 వేల మంది రెగ్యులర్ కార్మికులతో పాటు మరో 30 వేల మంది కాంట్రాక్టు కార్మికులు సైతం సమ్మెలో పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
వాట్సాప్‌లో రెండు కొత్త ఫీచర్స్.. వీటి స్పెషల్ ఏంటంటే..
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jul 10 , 2025 | 03:49 AM