KTR : నేడు ఏసీబీ ముందుకు కేటీఆర్
ABN, Publish Date - Jun 16 , 2025 | 03:51 AM
ఫార్ములా ఈ-కారు రేసు కేసుకు సంబంధించి మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం మరోసారి ఏసీబీ విచారణకు హాజరు కానున్నారు.
ఫార్ములా ఈ-కారు రేసు కేసులో విచారణకు హాజరు
తెలంగాణ భవన్ నుంచి ఏసీబీ ఆఫీసుకు మాజీ మంత్రి
కేటీఆర్ వెంట పెద్దసంఖ్యలో వెళ్లనున్న బీఆర్‌ఎస్ శ్రేణులు!
హైదరాబాద్, జూన్ 15 (ఆంధ్రజ్యోతి): ఫార్ములా ఈ-కారు రేసు కేసుకు సంబంధించి మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం మరోసారి ఏసీబీ విచారణకు హాజరు కానున్నారు. ఈ కేసులో కేటీఆర్‌ను ఏసీబీ, ఈడీ అధికారులు ఇప్పటికే పలుమార్లు విచారించారు. ఫార్ములా ఈ-ఆపరేషన్స్ సంస్ధ ప్రతినిధులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రశ్నించారు. మరోవైపు.. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నాటి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్, హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్ రెడ్డి.. విచారణలో తెలిపిన వివరాల మేరకు నిధుల మళ్లింపు, క్యాబినెట్ అనుమతి లేకుండా నిర్ణయం, సచివాలం బిజినెస్ రూల్స్ ఉల్లంఘనకు సంబంధించి ఏసీబీ అధికారులు కేటీఆర్‌ను ప్రశ్నించవచ్చని తెలుస్తోంది.
కేటీఆర్ విచారణ పూర్తయిన తర్వాతే ఈ కేసులో చార్జిషీట్ దాఖలు చేయడానికి ఏసీబీ అధికారులు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. కాగా, కేటీఆర్ సోమవారం ఉదయం 9గంటలకు తెలంగాణ భవన్‌కు చేరుకుని.. అక్కడి నుంచి ఏసీబీ విచారణకు వెళ్లనున్నట్లు సమాచారం. ఆయన వెంట బీఆర్‌ఎస్ శ్రేణులు పెద్దసంఖ్యలో వెళ్లే అవకాశాలు కన్పిస్తుండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేపట్టారు.
Updated Date - Jun 16 , 2025 | 03:51 AM