KTR: రేవంత్‌రెడ్డీ.. చెరువుల్లో కట్టిన మీ నేతల ఇళ్లు కనబడటం లేదా?
ABN, Publish Date - Jul 02 , 2025 | 04:54 AM
చెరువుల పరిసరాల్లో ఇళ్లు కట్టారంటూ పేదల ఇళ్లు కూలుస్తున్న నీకు.. అదే చెరువుల్లో మీ పార్టీ నేతలు అక్రమంగా కట్టిన భవంతులు కనబడటం లేదా.. మిస్టర్ రేవంత్‌రెడ్డి..
తెలంగాణలో అప్రకటిత ఎమర్జెన్సీ రాహుల్ గాంధీకి కనబడటం లేదా?: కేటీఆర్
హైదరాబాద్, జూలై 1 (ఆంధ్రజ్యోతి): ‘‘చెరువుల పరిసరాల్లో ఇళ్లు కట్టారంటూ పేదల ఇళ్లు కూలుస్తున్న నీకు.. అదే చెరువుల్లో మీ పార్టీ నేతలు అక్రమంగా కట్టిన భవంతులు కనబడటం లేదా.. మిస్టర్ రేవంత్‌రెడ్డి..’’ అంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంగళవారం ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. ‘‘కొడంగల్‌లో రెడ్డికుంటని పూడ్చేసి.. నువ్ మహల్ కట్టొచ్చు.. మీ అన్న తిరుపతిరెడ్డికి దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్‌లో ఇల్లు ఉండొచ్చు.. మీ రెవెన్యూ మంత్రి హిమాయత్ సాగర్‌లో ప్యాలె్‌సలు కట్టొచ్చు.. మీ చీఫ్‌విప్ మహేందర్‌రెడ్డి చెరువు నడుమ గెస్ట్‌హౌస్, బఫర్ జోన్‌లో కేవీపీలాంటి పెద్దలు గెస్ట్ హౌసులు కట్టుకుంటే కనబడటం లేదా? పెద్ద బిల్డర్లు మీకు లంచం ఇచ్చి మూసి నదిలోనే అపార్ట్‌మెంట్లు కట్టుకుంటే.. అవి మీకు కనబడవు.. తమ ఇళ్లు కూల్చొద్దని, హైకోర్టు స్టే ఆర్డర్ ఉందని నిరుపేదలు నెత్తినోరు మొత్తుకున్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కనికరం చూపకపోవడం దుర్మార్గం’’ అని కేటీఆర్ మండిపడ్డారు.
రాజ్యాంగం చేతిలో పట్టుకొని ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే రాహుల్‌గాంధీకి తెలంగాణలో అమలవుతున్న అప్రకటిత ఎమర్జెన్సీ కనబడటం లేదా? అని ప్రశ్నించారు. ప్రజల తరఫున ప్రశ్నిస్తామని, కాంగ్రెస్ హామీల అమలుకు నిలదీస్తూనే ఉంటామని కేటీఆర్ హెచ్చరించారు. ప్రజలను అయోమయంలో పడేసేందుకు కేసీఆర్‌ను తిట్టాలి.. చంద్రబాబును కాపాడాలి.. ఇదే సీఎం రేవంత్‌రెడ్డి వ్యూహమని మాజీ మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ అన్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్నపుడు బనకచర్ల ప్రతిపాదనే లేదని, కేంద్రం బనకచర్లకు పర్యావరణ అనుమతులు నిరాకరించడం బీఆర్‌ఎస్ సాధించిన విజయమని పేర్కొన్నారు.
Updated Date - Jul 02 , 2025 | 04:54 AM