Warangal: 25,000 కొలువులు
ABN, Publish Date - Apr 08 , 2025 | 04:41 AM
వరంగల్‌లోని అతిపెద్ద టెక్స్‌టైల్ పార్కులో ఉత్పత్తులు తయారు చేస్తున్న కిటెక్స్ కంపెనీ 25 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి ప్రకటన ఇచ్చింది. మంగళవారం నుంచే ఇంటర్వ్యూలు కూడా నిర్వహించనుంది.
మెగా టైక్స్‌టైల్ పార్కులో భర్తీకి కిటెక్స్ ప్రకటన.. నేటి నుంచే ఇంటర్వ్యూలు
విడతల వారీగా భర్తీ చేయనున్న కంపెనీ
త్వరలో వరంగల్ టెక్స్‌టైల్ పార్కులో మరిన్ని కంపెనీల పెట్టుబడులు
విమానాశ్రయం వస్తుండడంతో ఆసక్తి
పార్కు విస్తరణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి
పీఎం మిత్ర పథకం కింద గుర్తించాలని కేంద్రానికి సర్కారు విజ్ఞప్తి
వరంగల్, ఏప్రిల్ 7(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): వరంగల్‌లోని అతిపెద్ద టెక్స్‌టైల్ పార్కులో ఉత్పత్తులు తయారు చేస్తున్న కిటెక్స్ కంపెనీ 25 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి ప్రకటన ఇచ్చింది. మంగళవారం నుంచే ఇంటర్వ్యూలు కూడా నిర్వహించనుంది. పలు విభాగాల్లో వైస్ ప్రెసిడెంట్స్/జనరల్ మేనేజర్స్, మేనేజర్స్/ అసిస్టెంట్ మేనేజర్స్, సీనియర్ ఎగ్జిక్యూటివ్స్/ ఎగ్జిక్యూటివ్స్, ఇంజనీర్స్-సివిల్/ఎలక్ట్రికల్/ మెకానికల్, ఇన్‌చార్జిలు/సూపర్‌మైజర్లు సహా పలు పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన నిరుద్యోగులు కంపెనీ ప్రకటించిన నియమావళికి అనుగుణంగా జుజ్ట్ఛ్ఠీజ్చటఝ్ఛుఽ్టట.ఛిౌఝ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పలు దశలలో ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపికలు చేపడతామని కంపెనీ మేనేజర్ మనోజ్ తెలిపారు. ప్రస్తుతం కంపెనీలో ట్రయల్ రన్ జరుగుతోందని యాజమాన్యం తెలిపింది. వరంగల్‌కు విమానాశ్రయ సౌకర్యం అందుబాటులోకి వస్తుండడంతో ఈ పార్క్‌లో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఈ టెక్స్‌టైల్ పార్కును పీఎం మిత్రలో చేర్చేందుకు కేంద్రం సానుకూలంగా ఉండడంతో మరిన్ని పెట్టుబడులు వచ్చేందుకు అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
22 కంపెనీలతో ఒప్పందం.. పెట్టుబడి పెట్టింది మాత్రం మూడే
‘ఫామ్ టు ఫ్యాషన్.. ఫైబర్ టు ఫ్యాబ్రిక్’ నినాదంతో వరంగల్ జిల్లా గీసుకొండ మండలం శాయంపేట హవేలీలో 2017లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కును ఏర్పాటు చేసింది. రూ.1,350 కోట్లతో 1,150 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఈ పార్కుతో పెద్దసంఖ్యలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు వస్తాయని అంతా భావించారు. ఈ పార్కులో పెట్టుబడులకు గత ప్రభుత్వం 2017లో 22 కంపెనీలతో రూ.3,900 కోట్లకు ఒప్పందం చేసుకోగా ఏడేళ్లలో కేవలం మూడు కంపెనీలు మాత్రమే ఇందులో అడుగు పెట్టాయి. ఇందులో కేరళకు చెందిన కిటెక్స్ సంస్థ 2021 జూలై 7న ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుని రూ.1,200కోట్ల వ్యయంతో 187 ఎకరాల్లో పిల్లల దుస్తుల తయారీ యూనిట్‌ను నెలకొల్పింది. అలాగే గణేషా ఎకోపెట్, ఎకోటెక్ కంపెనీలు రూ.588 కోట్ల వ్యయంతో సుమారు 50ఎకరాల్లో రెండు యూనిట్లను ప్రారంభించాయి. గతేడాది దక్షిణ కొరియాకు చెందిన యంగాన్ కంపెనీ ఎనిమిది ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది కానీ ఇప్పటి వరకు ఉత్పత్తి ప్రారంభించలేదు.
ప్రభుత్వం చొరవ.. కంపెనీల ఆసక్తి..
గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా టెక్స్‌టైల్ పార్కును ఏర్పాటు చేసినా ఆశించిన స్థాయిలో కంపెనీల నుంచి పెట్టుబడులను ఆకర్షించలేకపోయింది. దాంతో 2023 డిసెంబరులో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పార్కుపై దృష్టి పెట్టింది. గతేడాది జూన్ 29న సీఎం రేవంత్ టెక్స్‌టైల్ పార్కులో పర్యటించి పరిశ్రమలు రాకపోవడానికి గల కారణాలపై ఆరా తీశారు. ఆగస్టులో సీఎం దక్షిణ కొరియా పర్యటనకు వెళ్లినప్పుడు టెక్స్‌టైల్ పార్కులో పెట్టుబడులు పెట్టిన యంగాన్ కంపెనీతో పాటు కొరియా ఫెడరేషన్ ఆఫ్ టెక్స్‌టైల్ ఇండస్ట్రీ, మరో 25 అగ్రశ్రేణి కంపెనీలతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించి పెట్టుబడులకు ఆహ్వనించారు. దాంతో జనవరి, ఫిబ్రవరి నెలల్లో అమెరికా, దక్షిణ కొరియా, కేరళ, ఢిల్లీకి చెందిన పలు కంపెనీల ప్రతినిధులు వరంగల్ కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కును సందర్శించారు. ఇక్కడున్న సౌకర్యాలు, రవాణా, ముడి సరుకు లభ్యత తదితర అంశాలను పరిశీలించారు. వాతావారణం అనుకూలంగా ఉన్నా రవాణాకు కొంత సమస్య ఉందని గుర్తించారు. అయితే వరంగల్‌కు త్వరలోనే విమానాశ్రయం వస్తున్న విషయాన్ని వారికి అధికారులు గుర్తు చేశారు. దాంతో ఆగస్టులో మరో రెండు కంపెనీలు టెక్స్‌టైల్ పార్కుకు వచ్చేందుకు ముందుకొచ్చాయి. ఈ నెల 18నుంచి జపాన్‌లో జరుగనున్న వ్యాపారవేత్తల సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం మెగా టెక్స్‌టైల్ పార్కులోకి పెట్టుబడులను ఆహ్వానించనుంది. ప్రస్తుతం పెట్టుబడులకు రవాణా సౌక ర్యం అడ్డంకిగా ఉంది. అయితే త్వరలో విమానాశ్రయం వస్తున్న నేపథ్యంలో మరిన్ని పెట్టబడులు ఆకర్షించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
అభయాంజనేయస్వామిని దర్శించుకున్న మంత్రి లోకేష్
దొంగల్లా సభకు వచ్చి సంతకాలు పెట్టి వెళుతున్నారు..
మరో ఆరుగురికి నోటీసులు.. విచారణ...
For More AP News and Telugu News
Updated Date - Apr 08 , 2025 | 04:41 AM