Kishan Reddy: గనుల లీజ్ మరింత సులభతరం
ABN, Publish Date - Jul 05 , 2025 | 04:29 AM
గనుల లీజ్, రెన్యూవల్స్‌ను మరింత సులభతరం చేస్తామని, ఇందుకోసం సింగిల్ విండో విధానం అమల్లోకి తెచ్చామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి చెప్పారు.
సుస్థిర మైనింగ్ విధానాలపై ప్రత్యేక దృష్టి
పర్యావరణ పరిరక్షణే తొలి ప్రాధాన్యం
మైనింగ్ సదస్సులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్, జూలై 4(ఆంధ్రజ్యోతి): గనుల లీజ్, రెన్యూవల్స్‌ను మరింత సులభతరం చేస్తామని, ఇందుకోసం సింగిల్ విండో విధానం అమల్లోకి తెచ్చామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి చెప్పారు. సుస్థిర మైనింగ్ విధానాల అమలుపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హోటల్‌లో మైనింగ్ కాంగ్రెస్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ స్థాయి మైనింగ్ సదస్సులో ఆయన మాట్లాడారు. మైనింగ్ సంస్థలు ప్రజలను, ప్రకృతిని దృష్టిలో ఉంచుకుని బాధ్యతాయుతంగా మైనింగ్ కార్యకలాపాలు నిర్వహించాలని సూచించారు. ఇందుకోసం నిబంధనలను మరింత సరళీకృతం చేయడంతో పాటు సాంకేతికతకు పెద్దపీట వేస్తామన్నారు. పర్యావరణ పరిరక్షణకే ప్రభుత్వ ప్రాధాన్యత ఉంటుందన్నారు.
మైనింగ్ తరువాత కూడా క్వారీలను వదిలేయకుండా పూర్వపుస్థితి ఏర్పడేలాప్రణాళికలు అమలు చేస్తామన్నారు. దేశ అవసరాలకు అనుగుణంగా తగినంత బొగ్గు, అల్యూమినియం, రాగి తదితర ఖనిజాలను ఉత్పత్తి చేసి, ఈ రంగంలో దేశాన్ని స్వయం సమృద్ధి దిశగా నడపాల్సిన బాధ్యత పరిశ్రమలపై ఉందని చెప్పారు. కాగా, పర్యావరణానికి నష్టం కలగకుండా, సమీప ప్రజలకు ప్రయోజనకరంగా ఉండేలా సింగరేణి బొగ్గు తవ్వకాలను జరుపుతోందని సంస్థ సీఎండీ బలరాం పేర్కొన్నారు. పర్యావరణానికి హానికలగకుండా నూతన సాంకేతికతతో మైనింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే 245.5 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ విద్యుత్‌ప్లాంట్లను ఏర్పాటు చేశామని, ఓపెన్ కాస్ట్ గనుల ఓవర్‌బర్డెన్ డంప్‌లపైనా సోలార్‌ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
కీలక అంశాలపై చర్చ
దేశంలోని మైనింగ్ సంస్థలు, అంతర్జాతీయ మైనింగ్ సంస్థల నుంచి 300 మంది ప్రతినిధులు హాజరైన ఈ సదస్సులో పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు. బొగ్గుగనులు, లైమ్‌స్టోన్, ఐరన్‌ఓర్ వంటి ఖనిజాల అన్వేషణ పూర్తయ్యాక శాస్ర్తీయ పద్దతిలో మైన్‌క్లోజర్ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరంపై చర్చించారు. మైనింగ్ పూర్తయిన భూముల్లో ఫిషరీస్ అభివృద్ధి చేయాలని సూచించారు. పర్యావరణహిత మైనింగ్ విధానాలపై రూపొందించిన మిషన్ గ్రీన్ బుక్, రిక్లెయిమ్ అనే పుస్తకాలను కిషన్‌రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం సింగిల్ విండో విధానానికి సంబంధించిన పోర్టల్‌ను, 24వ నైవేలి బుక్ ఫెయిర్‌ను ప్రారంభించారు.
ఇవి కూడా చదవండి
స్టాక్ మార్కెట్‌లో భారీ కుంభకోణం..జేన్ స్ట్రీట్‌పై సెబీ చర్యలు
రూ.15 వేల పెట్టుబడితో రూ.12 కోట్ల రాబడి.. ఎలాగో తెలుసా..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jul 05 , 2025 | 04:29 AM