Kondapur Drug Party: మత్తు అలవాటు చేసి.. జల్సాలు
ABN, Publish Date - Jul 29 , 2025 | 04:27 AM
కొండాపూర్‌లోని సర్వీస్ అపార్టుమెంట్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ఏపీకి చెందిన ముఠాను ఎక్సైజ్ పోలీసులు ఆదివారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
డ్రగ్స్ కోసం హైదరాబాద్‌కు వచ్చి ఎంజాయ్
ప్రధాన సూత్రధారితో వచ్చిన స్నేహితులు
ఎంపీ స్టిక్కర్ ఉన్న కారులో షికార్లు
కొండాపూర్ డ్రగ్స్ కేసులో విస్తుపోయే విషయాలు
హైదరాబాద్ సిటీ, జూలై 28 (ఆంధ్రజ్యోతి): కొండాపూర్‌లోని సర్వీస్ అపార్టుమెంట్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ఏపీకి చెందిన ముఠాను ఎక్సైజ్ పోలీసులు ఆదివారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రధాన నిందితుడు అశోక్ నాయుడు అలియాస్ వాసు, డ్రగ్ పెడ్లర్లు రాహుల్, ఇమ్మాన్యుయేల్‌తో పాటు సమ్మెల సాయికృష్ణ, నాగెళ్ల లీలామణికంఠ, హిల్టన్ జోసఫ్ రోల్ఫ్, అడపా యశ్వంత్ శ్రీదత్త, తోట కుమారస్వామి, నందం సుమంత్ తేజలు పోలీసుల అదుపులో ఉన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజాకు చెందిన అప్పికట్ల అశోక్ కుమార్ నాయుడుగా పోలీసులు గుర్తించారు. డ్రగ్స్‌కు అలవాటుపడిన అతడు.. కెంగర్ రాహుల్, ఉన్నాటి ఇమ్మాన్యుయేల్ అలియాస్ అనిల్ అలియాస్ ప్రవీణ్ కుమార్ అలియాస్ మన్నేల నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నాడు. స్నేహితులతో పాటు పలువురు యువతులకు మత్తు పదార్థాలను అలవాటు చేస్తున్నాడు. స్నేహితులను తీసుకొని వారాంతాల్లో నగరానికి వచ్చి సర్వీస్ అపార్టుమెంట్లలో గదులు అద్దెకు తీసుకొని జల్సాలు చేస్తున్నట్లు తేలింది. ఇటీవల తనకున్న భూమిలో కొంత అమ్మేసిన నిందితుడికి సుమారు రూ.20 కోట్ల వరకు వచ్చినట్లు తెలిసింది. దాంతో అతడి జల్సాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. మాదక ద్రవ్యాలకు అలవాటుపడి అతడి వలలో చిక్కిన యువతులు, స్నేహితులు ఆ బలహీనతలో భాగంగా అతడి వెంట నగరానికి వచ్చి పార్టీలు చేసుకుంటున్నట్లు సమాచారం. ఇటీవల ఒక యువతిని ప్రేమ పేరుతో వంచించిన యువకుడు.. ఆమెకు భారీగా డబ్బులు ముట్టజెప్పి వదిలించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
బలహీనతగా మారిన మత్తు..
ఈ ముఠాలో ఇద్దరు యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఓ యువతి ఈవెంట్స్‌లో భాగంగా నిందితులకు పరిచయం కాగా.. మరొకరు తల్లి మృతి చెందడంతో మత్తుకు అలవాటుపడినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఆమె ప్రధాన నిందితుడితో కలిసి డ్రగ్స్ పార్టీ కోసం నగరానికి వచ్చిందని పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. ఆ యువతి బలహీనతను నిందితులు అవకాశంగా మార్చుకున్నట్లు పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం.
ఎంపీ కారు దుర్వినియోగం..
నిందితులు వినియోగించిన రెండు కార్లలో ఎంపీ స్టిక్కర్ ఉన్న వాహనం(ఏపీ39ఎ్‌సఆర్0001) ఏపీకి చెందిన ఎంపీదిగా పోలీసులు గుర్తించారు. ప్రధాన నిందితుడికి ఎంపీ కుటుంబంతో సత్సంబంధాలు ఉండటంతో అవసరమైనప్పుడు ఓ కారును వినియోగిస్తున్నట్లు తెలిసింది. కేసు వివరాలు బయటకు పొక్కకుండా పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు.
ఇవి కూడా చదవండి..
కాల్పుల విరమణలో అమెరికా పాత్ర లేదు, మోదీకి ఫోన్ కాల్ రాలేదు
22 నిమిషాల్లో ఆపరేషన్ సిందూర్ పూర్తి చేశాం: రాజ్‌నాథ్
For More National News and Telugu News..
Updated Date - Jul 29 , 2025 | 04:27 AM