Kaleshwaram: ‘కాళేశ్వరం’ ప్రయోజనాలు వివరిద్దాం!
ABN, Publish Date - May 31 , 2025 | 04:33 AM
కాళేశ్వరంపై విచారణ కమిషన్ ఎదుట హాజరయ్యేందుకు మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సమాయత్తమవుతున్నారు.
కమిషన్ ఎదుట చెప్పేందుకు కేసీఆర్ సన్నద్ధం
మరోసారి బీఆర్‌ఎస్ చీఫ్‌తో హరీశ్ భేటీ
ఫామ్‌హౌజ్‌లో ఐదుగంటల పాటు చర్చ
తెలంగాణ భవన్‌లో కాళేశ్వరంపై పవర్
పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్న హరీశ్
కవిత పరిణామాలపైనా కేసీఆర్ ఆరా!
సంగారెడ్డి ప్రతినిధి/హైదరాబాద్, మే 30(ఆంధ్రజ్యోతి): కాళేశ్వరంపై విచారణ కమిషన్ ఎదుట హాజరయ్యేందుకు మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సమాయత్తమవుతున్నారు. ఇదే విషయమై ఇప్పటికే మాజీ మంత్రి, ఆ పార్టీ ఎమ్మెల్యే హరీశ్‌రావుతో మూడుసార్లు చర్చించిన విషయం తెలిసిందే. తాజాగా శుక్రవారం మరోసారి సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్‌హౌజ్‌లో కేసీఆర్‌ను హరీశ్ కలిశారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అనేక విషయాలు చర్చించారు. ఇటీవల జరిగిన భేటీలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన వివరాల గురించి కేసీఆర్ అడిగారు. ఆరోజు నుంచి హరీశ్‌రావు అదేపనిపై దృష్టి సారించారు. అప్పటి ఇంజనీర్లతో చర్చించి పూర్తి వివరాలతో కూడిన ఒక నివేదికను తయారు చేసి తాజాగా కేసీఆర్ చేతికి ఇచ్చినట్లు తెలిసింది. జూన్ 5న కమిషన్ ముందుకు కేసీఆర్ వెళ్తున్న నేపథ్యంలో ముందుగా తెలంగాణ భవన్‌లో కాళేశ్వరం ప్రాజెక్టు గురించి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు తెలిసింది. పార్టీ నేతలతోపాటు మీడియాకు కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితాలపై అవగాహన కల్పించేలా హరీశ్‌రావు అన్నీతానై వ్యవహరించనున్నారు. కాళేశ్వరం విచారణ కమిషన్ ముందు అనూహ్య రీతిలో కేసీఆర్ హాజరుకావడానికి సిద్ధమవుతున్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించకముందు ఉన్న కరువు గాథలు, అప్పటి ఫొటోలను కమిషన్ సభ్యులకు ఇవ్వడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పలు పత్రికలు, టీవీల్లో వచ్చిన కథనాలు, కాళేశ్వరం విజయగాథలను వివరించడానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. కమిషన్ ఎదుట తడబాటుకు గురికాకుండా పూర్తి సమాచారాన్ని ముందుంచాలనే కోణంలో కేసీఆర్ సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
కవిత ఎపిసోడ్‌పై ఆరా..!
ఎమ్మెల్సీ కవిత వైఖరితో తలెత్తిన పరిణామాలపై కేసీఆర్ పార్టీ నేతలతో ఆరా తీస్తున్నట్లు తెలిసింది. కాళేశ్వరం కమిషన్ విచారణ, జూన్ 2 తెలంగాణ అవతరణ దినోత్సవం ఉన్నందున.. ఆ తర్వాతే కవిత విషయంలో ఒక నిర్ణయం తీసుకునే పరిస్థితి కనిపిస్తోంది. దూతలకు కవిత పలు షరతులు పెట్టడంతో వాటి సాధ్యాసాధ్యాలపైనా కేసీఆర్ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. అందుకే కేటీఆర్ అమెరికా నుంచి వచ్చాకనే ఒక అంచనాకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఇవి కూడా చదవండి
ఆర్సీబీ ఓడిపోతే భర్తకు విడాకులు ఇస్తుందట.. ఇదేం పిచ్చి..
ఐఎన్ఎస్ విక్రాంత్ పైనుంచి పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ వార్నింగ్
Updated Date - May 31 , 2025 | 04:33 AM