MLC Kavitha: ఏకలవ్య భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలి
ABN, Publish Date - Jul 07 , 2025 | 02:49 AM
ఏకలవ్య భవన నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఏకలవ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి:ఎమ్మెల్సీ కవిత
కవాడిగూడ, జూలై 6 (ఆంధ్రజ్యోతి): ఏకలవ్య భవన నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మాజీ సీఎం కేసీఆర్ మొదలుపెట్టిన ఏకలవ్య భవన నిర్మాణాన్ని పూర్తిచేయలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని విమర్శించారు. తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోకిని రాజు, ఎరుకల ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ట్యాంక్‌బండ్‌పై ఉన్న కొమురంభీం విగ్రహం వద్ద ఏకలవ్య జయంతి ఉత్సవాలను నిర్వహించారు. కార్యక్రమానికి కవిత హాజరై ఏకలవ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడిన తరువాత నాటి సీఎం కేసీఆర్ ఎరుకల కులస్థుల అభివృద్ధి కోసం ఎంపవర్మెంట్ స్కీంను ప్రవేశపెట్టారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పథకాన్ని తుంగలో తొక్కిందన్నారు. తాను శాసనమండలిలో ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చలనం లేదని విమర్శించారు. 50వేల ఎరుకుల కుటుంబాలకు రూ.60కోట్ల మేర లబ్ధి చేకూర్చే పథకాన్ని మెరుగుపరిచి ప్రభుత్వం యధాతథంగా అమలు చేయాలన్నారు. రూ.500 కోట్లతో ఎరుకుల కార్పొరేషన్‌నూ ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు.
Updated Date - Jul 07 , 2025 | 02:49 AM