Kavita: ముంపు గ్రామాల్ని తిరిగి తెలంగాణకు ఇవ్వాలి
ABN, Publish Date - Jun 21 , 2025 | 03:53 AM
పోలవరం ప్రాజెక్టు కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో కలిపిన ఐదు ముంపు గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు.
కేంద్రంపై సీఎం రేవంత్‌రెడ్డి ఒత్తిడి తేవాలి: ఎమ్మెల్సీ కవిత
పంజాగుట్ట, జూన్ 20 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో కలిపిన ఐదు ముంపు గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. 25న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీ్‌సగఢ్, ఒడిసా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రగతి ఎజెండా పేరిట ప్రధాని మోదీ నిర్వహించబోయే సమావేశంలో ఈ అంశంపై చర్చించాలని కోరారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ‘పోలవరం తెలంగాణపై జలఖడ్గం.. ముంపు గోడు’పై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సీపీఐ ఎంఎల్ (న్యూడెమోక్రసీ) నేత గోవర్ధన్, భద్రాచలం డెవల్‌పమెంట్ ఫోరం, ఐదు గ్రామ పంచాయతీల హక్కుల సాధన సమితి, వివిధ ప్రజాసంఘాల నాయకులు పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ఏపీలో కలిపిన ఫురుషోత్తపట్నం, గుండాల, ఎట్టపాక, కన్నాయగూడెం, పిచ్చుకలపాడు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. వారు రెండు రాష్ట్రాల మధ్య వివక్షకు గురవుతున్నారని, ఏ ప్రభుత్వమూ పట్టించుకోవడం లేదన్నారు. పోలవరం వల్ల భద్రాచలం ప్రాంతానికి శాశ్వత ముంపు ఏర్పడిందని తెలిపారు. పోలవరం స్పిల్‌వే సామర్థ్యాన్ని 50లక్షల క్యూసెక్కులకు పెంచుకోవడం వల్ల తెలంగాణకు బ్యాక్ వాటర్ సమస్య ఏర్పడుతుందని, దాంతో భద్రాచలం రామాలయం మునిగిపోయే ప్రమాదం ఉందని చెప్పారు. పోలవరం ముంపుపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు సంయుక్త సర్వే నిర్వహించాలన్నారు. ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపడానికి సీఎం రేవంత్ కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఆమె డిమాండ్ చేశారు.
Updated Date - Jun 21 , 2025 | 03:53 AM