Kaleshwaram: బ్యారేజీల పునరుద్ధరణకు డిజైన్లు ఇవ్వాల్సింది మీరే
ABN, Publish Date - Jul 17 , 2025 | 05:22 AM
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణకు అవసరమైన డిజైన్ల తయారీ నైపుణ్యం, సామర్థ్యాలు తమకు లేవని సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీవో) చీఫ్ ఇంజనీర్(సీఈ) చెప్పడాన్ని నీటిపారుదల శాఖ తీవ్రంగా పరిగణించింది.
ఆ బాధ్యత నుంచి తప్పించుకోలేరు
నీటిపారుదల శాఖలో సీడీవో అంతర్భాగం
మీదేమీ కన్సల్టెంట్ సంస్థ కాదు
సీడీవో చీఫ్ ఇంజనీర్‌కు ప్రభుత్వం స్పష్టీకరణ
హైదరాబాద్, జూలై 16 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణకు అవసరమైన డిజైన్ల తయారీ నైపుణ్యం, సామర్థ్యాలు తమకు లేవని సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీవో) చీఫ్ ఇంజనీర్(సీఈ) చెప్పడాన్ని నీటిపారుదల శాఖ తీవ్రంగా పరిగణించింది. బ్యారేజీల నిర్మాణానికి డిజైన్లు/డ్రాయింగ్‌లు తయారు చేసింది సీఈ(సీడీవో)నే అని, ఆ బ్యారేజీలు వైఫల్యం చెందినప్పుడు పునరుద్ధరణకు అవసరమైన డిజైన్లు/డ్రాయింగ్‌లు అందించాల్సిన బాధ్యతా వాళ్లదేనని తేల్చిచెప్పింది. డిజైన్లపై కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ) సీడీవోకు అక్రిడేషన్ ఇచ్చిందని గుర్తు చేసింది. జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ(ఎన్‌డీఎ్‌సఏ) సిఫారసుల మేరకు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్థరణకు డిజైన్లను తయారు చేసే బాధ్యత సీఈ(సీడీవో)దే అని పేర్కొంది. శాఖలో డిజైన్ల తయారీకి నోడల్ ఏజెన్సీ కావడంతో ఈ బాధ్యతల నుంచి సీడీవో తప్పించుకోలేదని స్పష్టం చేసింది.
అవసరమైతే నిపుణులు, సాంకేతిక సంస్థలను సంప్రదించి, బ్యారేజీల పునరుద్ధరణ కోసం డిజైన్లు సరిగ్గానే ఉన్నట్టు ధ్రువీకరించుకోవచ్చని సూచించింది. ఇతర సంస్థలపై బాధ్యతను తోసేయడానికి సీడీవో విభాగం కన్సల్టెంట్ కాదని, నీటిపారుదల శాఖలో అంతర్భాగమని గుర్తు చేసింది. ఈ మేరకు నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ(జనరల్) సీఈ(సీడీవో)కి లేఖ రాశారు. మేడిగడ్డ పునరుద్ధరణకు అవసరమైన డిజైన్ల కోసం నిర్దిష్ట గడువులు విధించుకుని పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. డిజైన్ల తయారీకి సాంకేతిక సహాయం కోసం జాప్యం చేయకుండా తక్షణమే ఆసక్తి వ్యక్తీకరణ(ఈవోఐ) ను ఆహ్వానించాలని స్పష్టం చేశారు. మేడిగడ్డ బ్యారేజీ 2023 అక్టోబర్ 21న కుంగిపోగా, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో భారీగా సీపేజీలు బయటపడ్డాయి. బ్యారేజీల పునరుద్ధరణ కోసం తగిన చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వం అప్పుడే సీడీవోకు లేఖ రాసింది. తర్వాత ఎన్‌డీఎ్‌సఏ నివేదికను కూడా పంపించింది. ఈ అంశానికి సంబంధించి ఇప్పటివరకు మొత్తం 9 లేఖలు రాసింది.
Updated Date - Jul 17 , 2025 | 05:22 AM