Kaleshwaram Barrage: బ్యారేజీల పునరుద్ధరణ ఖర్చు నిర్మాణ సంస్థలదే
ABN, Publish Date - Jun 21 , 2025 | 04:02 AM
కాళేశ్వరం బ్యారేజీల మరమ్మతులు, పునరుద్ధరణ ఖర్చంతా నిర్మాణ సంస్థలే భరించాల్సి ఉంటుందని ప్రభుత్వం తేల్చిచెప్పింది.
పరీక్షలు, మరమ్మతుల వ్యయాన్ని భరించాల్సిందే
కాళేశ్వరం ఆనకట్టలపై రామగుండం సీఈకి సర్కారు లేఖ
రిపేర్ల డిజైన్లు ఇవ్వలేమన్న సీఈ సీడీవోపై గుర్రు
హైదరాబాద్, జూన్ 20 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం బ్యారేజీల మరమ్మతులు, పునరుద్ధరణ ఖర్చంతా నిర్మాణ సంస్థలే భరించాల్సి ఉంటుందని ప్రభుత్వం తేల్చిచెప్పింది. జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ(ఎన్‌డీఎ్‌సఏ) నిపుణుల కమిటీ నివేదిక ప్రకారం ఆ బాధ్యతను నిర్మాణ సంస్థలే తీసుకోవాలని గుర్తుచేసింది. మూడు బ్యారేజీలకు కేంద్ర నీటి, విద్యుత్ పరిశోధన కేంద్రం(సీడబ్ల్యూపీఆర్‌ఎ్‌స-పుణే)తో భూసాంకేతిక, భూభౌతిక పరీక్షలు చేయడానికి, ఇతరత్రా పనుల కోసం రూ.6.54 కోట్లు, అన్నారం బ్యారేజీ కోసం రూ.6.44 కోట్లు, సుందిళ్ల బ్యారేజీ కోసం రూ.6.42 కోట్లు కలిపి రూ.19.4 కోట్లు అవుతాయని లెక్కగట్టి, ఈ నిధులను మంజూరు చేయాలని కోరుతూ మే 29న రామగుండం చీఫ్ ఇంజనీర్ సుధాకర్‌రెడ్డి ప్రొసీడింగ్స్ జారీ చేశారు. దీనిపై ఆరా తీసిన ప్రభుత్వం సదరు సీఈతో పాటు బ్యారేజీల పునరుద్ధరణ కోసం డిజైన్లు జారీ చేసే విషయంలో చేతులెత్తేసిన సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్(సీడీవో) సీఈపై భగ్గుమంది.
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం 2019 మేలో పూర్తికాగా.. అనుబంధ పనులు ఇంకా మిగిలి ఉండగానే 2019 నవంబరులో వరదల వల్ల ప్రాజెక్టు దిగువ భాగంలోని రక్షణ వ్యవస్థలు చెల్లాచెదురయ్యాయని, అయినా ఆ పనులు చేయకుండా సర్కారుకు లేఖ రాసి నిర్మాణ సంస్థలు మౌనంగా ఉన్నాయని ప్రభుత్వం గుర్తించింది. ‘‘బ్యారేజీలు డిఫెక్ట్ లయబిలిటీ కాలం(డీఎల్‌ఎ్‌ఫ)లోనే దెబ్బతిన్నందున వాటి పునరుద్ధరణ కోసం చేయాల్సిన పరీక్షలు, పునరుద్ధరణ పనుల బాధ్యత నిర్మాణ సంస్థలదే. ఈ విషయం మీకు తెలియదా..?’’ అని చీఫ్ ఇంజనీర్‌కు స్పష్టం చేస్తూ ప్రభుత్వం లేఖ రాసింది. ప్రధానంగా మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యానికి డిజైన్ల లోపమే కారణమని నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ ఐఐటీ రూర్కీతో నివేదిక ఇప్పించిన విషయం విదితమే. అయితే సీఈ సీడీవోతో డిజైన్ల విషయంలో ఎల్ అండ్ టీ ఈ-మెయిల్ రూపంలో జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ ప్రభుత్వం కమిషన్‌కు అందించింది. మేడిగడ్డ డిజైన్లకు సీఈ సీడీవోతో పాటు ఎల్ అండ్ టీలోని డిజైన్ల విభాగం ఆమోదం తెలిపిన విషయాలు తెరమీదికి వచ్చాయి. దాంతో డిజైన్లు/డ్రాయింగ్‌ల లోపంలో ఎల్‌అండ్‌టీకి బాధ్యత ఉందని తేలింది. అయితే నిర్మాణ సంస్థ దారికి రాకపోతే క్రిమినల్ కేసుల దిశగా ప్రభుత్వం అడుగులు వేసే అవకాశాలున్నాయి. ఇక, ఎన్‌డీఎ్‌సఏ నివేదిక ప్రకారం బ్యారేజీల పునరుద్ధరణ కోసం డిజైన్లు ఇవ్వాలని ప్రభుత్వం సీఈ సీడీవోను కోరగా.. తామేం చేయలేమని, తమకు ఆ సామర్థ్యాలు లేవని బదులివ్వడంతో సీఈ సీడీవోపై ప్రభుత్వం గుర్రుగా ఉన్నట్లు తెలిసింది.
పరువు హత్య బాధితురాలికి రక్షణ కల్పించండి
హైకోర్టు ఆదేశాలు
హైదరాబాద్, జూన్ 20 (ఆంధ్రజ్యోతి): పరువు హత్యకు గురైన వడ్లకొండ కృష్ణ భార్యకు రక్షణ కల్పించనందుకు పోలీసులపై శుక్రవారం హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. దరఖాస్తు ఇచ్చి రెండు నెలలయినా చర్యలు తీసుకోకపోవడాన్ని ప్రశ్నించింది. కులాంతర వివాహం చేసుకున్నందుకు కృష్ణను భార్య పుట్టింటివారు హత్య చేశారు. ప్రస్తుతం నిందితులు జైలులో ఉన్నా ఆమెకు మాత్రం బెదిరింపులు వస్తున్నాయి. రక్షణ కల్పించాలని పోలీసులను కోరినా తగిన స్పందన లేకపోవడంతో ఆమె హైకోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న ధర్మాసనం తగిన భద్రత కల్పించాలని ఆదేశాలు జారీచేసింది.
Updated Date - Jun 21 , 2025 | 04:02 AM