Indiramma Housing: పట్టణాల్లోనూ ఇందిరమ్మ ఇళ్లు!
ABN, Publish Date - Jul 23 , 2025 | 03:34 AM
రాష్ట్రవ్యాప్తంగా పట్టణాల్లో కూడా ఇందిరమ్మ ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది
తొలి దశలో జీహెచ్‌ఎంసీ పరిధిలో అమలు
పేదలు నివసిస్తున్న చోటే జీ+3 పద్ధతిలో నిర్మాణం
4 జిల్లాల కలెక్టర్లతో మంత్రి పొంగులేటి సమీక్ష
అవసరమైన స్థలాలను గుర్తించాలని ఆదేశం
గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే పథకం తొలిదశ కొలిక్కి
హైదరాబాద్, జూలై 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా పట్టణాల్లో కూడా ఇందిరమ్మ ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాల్లో మొదటి దశ కింద ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియ కొలిక్కి రావడంతో తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. పట్టణాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు సంబంధించిన కార్యాచరణపై మంగళవారం సచివాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై దృష్టి సారించామన్నారు. పేదల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా వారు నివసిస్తున్న చోటే జీ+3 విధానంలో ఇళ్లను నిర్మించి ఇచ్చేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకు అవసరమైన స్థలాలను గుర్తించాలని కలెక్టర్లకు సూచించారు. ప్రభుత్వ స్థలాలతో పాటు ప్రైవేటు వ్యక్తులకు చెంది.. పేదల ఆధీనంలో ఉన్న స్థలాలు, కబ్జాకు గురైన ప్రాంతాలను కూడా గుర్తించాలన్నారు. సాధ్యమైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఇందుకోసం ప్రతి జిల్లా కలెక్టర్ ఒక ప్రత్యేక అధికారిని నియమించుకోవాలని సూచించారు. పట్టణాల్లోని అసెంబ్లీ స్థానాల పరిధిలో ఉన్న జనాభాను దృష్టిలో ఉంచుకుని అదనంగా ఇళ్లను మంజూరు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు.
జీహెచ్‌ఎంసీ పరిఽధిలోని 166 మురికివాడల్లో సుమారు 42,432 మంది నివసిస్తున్నారని వెల్లడించారు. హైదరాబాద్ జిల్లాలో 106, సంగారెడ్డిలో 5, మేడ్చల్ మల్కాజిగిరిలో 12, రంగారెడ్డిలో 26 మురికివాడల్లో సర్వే నిర్వహించి.. పేదలు 25,501 కచ్చా ఇళ్లలో ఉంటున్నట్లు గుర్తించామని తెలిపారు. ఈ నేపథ్యంలో ఎన్ని మురికివాడల్లో ఎంత భూమి అందుబాటులో ఉంది? జీ+3 విధానంలో ఎన్ని ఇళ్లను నిర్మించవచ్చు? అనే అంశాలపై ఈ నెలాఖరులోగా పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని కలెక్టర్లకు సూచించారు. అలాగే ఈ 4 జిల్లాల్లో పరిధిలో కేటాయించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలోకి హైదరాబాద్ పరిధిలో ఉంటున్నవారెవరూ వెళ్లడం లేదని, ఫలితంగా 30 వేల ఇళ్లు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఇల్లు దక్కినా, అక్కడికి వెళ్లని వారికి నోటీసులు జారీ చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. అలాగే అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూం ఇళ్లను పూర్తిచేయాలని, అన్ని మౌలిక వసతులూ కల్పించి, మిగిలిపోయిన ఇళ్ల కేటాయింపులను ఆగస్టు నెలాఖరులోగా పూర్తిచేయాలని ఆదేశించారు. అనంతరం హౌసింగ్ కాలనీల తనిఖీ కోసం రూపొందించిన యాప్‌ను మంత్రి పొంగులేటి ఆవిష్కరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కోర్టును ఆశ్రయించిన మహిళ.. సీజేఐ ఆసక్తికర వ్యాఖ్యలు
ధన్‌ఖఢ్ రాజీనామా వెనుక నితీష్‌ను తప్పించే కుట్ర.. ఆర్జేడీ ఆరోపణ
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jul 23 , 2025 | 05:02 AM