MP Raghunandan: జూన్ 2న కవిత కొత్త పార్టీ ప్రకటన
ABN, Publish Date - May 27 , 2025 | 03:52 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తన తండ్రి కేసీఆర్‌కు రాసిన లేఖపై తెలంగాణ రాజకీయాల్లో చర్చ వాడి వేడిగా సాగుతోంది. తాజాగా బీజేపీ ఎంపీ రఘునందర్ రావు మరోసారి స్పందించారు.
హైదరాబాద్, మే 27: తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌కు ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాసిన లేఖ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనమైంది. ఈ లేఖపై ఇప్పటికే అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ నేతలు తమదైన శైలిలో వ్యంగ్య బాణాలు సంధిస్తున్నారు. అలాంటి వేళ మెదక్ ఎంపీ , బీజేపీ నేత రఘునందన్ రావు మరోసారి స్పందించారు. మంగళవారం హైదరాబాద్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. తండ్రి, కుమార్తెల మధ్య మధ్యవర్తులెందుకు? అని ఆయన సూటిగా ప్రశ్నించారు.
జూన్ 2వ తేదీన కవిత కొత్త పార్టీ రాబోతోందని ఆయన జోస్యం చెప్పారు. అనంతరం తెలంగాణలో కవిత పాదయాత్ర చేస్తారని ప్రకటించారు. కవిత గెలిచినప్పుడు కేసీఆర్ దేవుడయ్యారని.. మరి ఇప్పుడు దెయ్యం ఎలా అయ్యారంటూ ఎంపీ రఘునందన్ సందేహం వ్యక్తం చేశారు. దెయ్యాల మధ్య పదేళ్ల రాజకీయం ఎందుకు? చేసినట్లు అంటూ కవితకు ఈ సందర్భంగా బీజేపీ రఘునందన్ చురకలంటించారు.
ఏప్రిల్ 27వ తేదీన బీఆర్ఎస్ రజతోత్సవ సభ వరంగల్‌లో నిర్వహించారు. ఈ సభకు పార్టీ నేతలతోపాటు కార్యకర్తలంతా భారీగా తరలి వచ్చారు. అనంతరం ఈ సభలో తన తండ్రి కేసీఆర్ ప్రసంగంతోపాటు కొన్ని అంశాలతో కూడిన లేఖను ఆయనకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రాశారు. అయితే ఈ లేఖ ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ లేఖను లక్ష్యంగా చేసుకుని బీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్, బీజేపీ అగ్రనేతలు తమదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ తర్వాత కేసీఆర్‌తో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ వరుసగా సమావేశమవుతున్నారు.
మరోవైపు.. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా మేడిగడ్డ రిజర్వాయర్ నిర్మాణంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ను రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ ఎదుట హాజరుకావాలంటూ కేసీఆర్‌తోపాటు హరీష్ రావు, ఈటల రాజందర్‌లకు నోటీసులు జారీ అయ్యాయి. జూన్ 5వ తేదీన కమిషన్ ఎదుట హాజరుకావాలంటూ బీఆర్ఎస్ చీఫ్‌కు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ జారీ చేసిన ఆదేశాల్లో స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఈ టాపిక్ డైవర్షన్ కోసమే ఈ లెటర్ పాలిటిక్స్ అనే ఓ చర్చ సైతం రాష్ట్రంలో కొనసాగుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
మాజీ ఎమ్మెల్యే ఆర్కేపై సీఐడీ కేసు నమోదు
కొడాలి నాని ఆరోగ్యం.. కుటుంబ సభ్యుల్లో ఆందోళన
For Telangana News and Telugu News
Updated Date - May 27 , 2025 | 04:50 PM