Telangana HSRP: హై సెక్యూరిటీ ప్లేట్లపై తెలంగాణ యూ టర్న్ తీసుకుందా?
ABN, Publish Date - May 31 , 2025 | 11:07 AM
Telangana HSRP: తెలంగాణలో పాత వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు అమలు చేయాల్సిందే అంటూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో పాటు సెప్టెంబర్ వరకు తుది గడువు విధించి.. అక్టోబర్ నుంచి ఈ నిబంధనలు అమలు చేయాలని నిర్ణయించింది.
హైదరాబాద్, మే 31: 2019, ఏప్రిల్ 1వ తేదీకి ముందు రిజిస్ట్రేషన్ అయిన పాత వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ (High Security Registration Plate) అమర్చడం తప్పని సరి అంటూ ఇటీవల తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందు కోసం గడువును కూడా విధించింది. సెప్టెంబర్ 30 లోపు పాత వాహనాలకు హెచ్‌ఎస్‌ఆర్‌పీ అమర్చాల్సిందిగా నోటిఫికేషన్‌లో పేర్కొంది. అయితే సెప్టెంబర్ 30 లోపు ఇది అమలు జరగడం సాధ్యమేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ల నిబంధనలు 2019 , ఏప్రిల్ 1 నుంచి వాహనాలకు అమలు అవుతూనే ఉన్నాయి. ఇప్పటికే దేశంలో అనేక రాష్ట్రాల్లో ఈ నిబంధనలు అమలవుతుండగా.. తెలంగాణలో మాత్రం ఈ నిబంధనలు అమలులోకి రాలేదు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పాత వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు అమలు చేయాల్సిందే అంటూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో పాటు సెప్టెంబర్ వరకు తుది గడువు విధించి.. అక్టోబర్ నుంచి ఈ నిబంధనలు అమలు చేయాలని నిర్ణయించింది కూడా. అయితే చివరి నిమిషంలో తన నిర్ణయాన్ని నిలిపివేసింది సర్కార్.
హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్ల అమలు కోసం సియామ్ అనే వెబ్‌సైట్‌లో వాహనదారులు వివరాలు నమోదు చేసుకోవాల్సిందిగా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సియామ్ దేశంలో వాహనాలు, వాహన ఇంజిన్ల తయారీ కంపెనీలకు ప్రాతినిధ్యం వహిస్తోంది. అయితే ఈ వెబ్‌సైట్‌లో సాంకేతికలోపం తలెత్తడంతో ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ల కోసం బుకింగ్ చేసుకునేందుకు మరో కొత్త విధానాన్ని తీసుకురావాలని సర్కార్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో సెప్టెంబర్ వరకు విధించిన గడువుపై కూడా త్వరలోనే మరో నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కాగా.. నకిలీ నెంబర్ ప్లేట్లతో తిరుగుతూ నేరాలకు పాల్పడుతున్న వారికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం హెచ్‌ఎస్‌ఆర్‌పీని అమలు చేయాలని నిర్ణయించింది. పాత వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ అమర్చడం ద్వారా నేరాలను అరికట్టవచ్చనే ఉద్దేశంతో ఈ నిబంధనను తీసుకొచ్చింది సర్కార్. రాష్ట్రంలో పాత నెంబర్లతో తిరుగుతున్న వాహనాలు భారీగా ఉన్నాయి. వీటిలో అత్యధికంగా ద్విచక్రవాహనాలు ఉండగా.. కార్లు, ఆటోలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక రాష్ట్రంలో 70.92 లక్షల పాతవాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు అమర్చాలి ఉందని ఇప్పటికే రవాణాశాఖ గుర్తించింది. 2013 డిసెంబరు నాటికి 67,72,400 వాహనాలు, 2014 జనవరి, 2019 మార్చి 31 వరకు మరో 3,20,500 వాహనాలు రిజిస్టర్ అయి ఉన్నట్లు గుర్తించింది. ఈ వాహనాలకు హైసెక్యూటిరీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు అమలు చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ సియామ్ వెబ్‌సైట్‌లో సాంకేతికలోపం కారణంగా చివరి నిమిషంలో ఈ నిర్ణయాన్ని నిలిపివేసింది. ఇక త్వరలోనే హెచ్‌ఎస్‌ఆర్‌పీ కోసం బుకింగ్ చేసుకునే విధానంతో పాటు.. తుది గడువును కూడా ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి
రెండో రోజుకు సిట్ కస్టడీ విచారణ.. నిందితులు ఏం చెప్పనున్నారో
విజయవాడలో యోగాంధ్ర.. పాల్గొన్న రైతులు
Read Latest Telangana News And Telugu News
Updated Date - May 31 , 2025 | 11:22 AM