Harish Rao: అర్హులైన వారికి పథకాలు ఎగ్గొడుతున్నట్లేనా?
ABN, Publish Date - Jan 21 , 2025 | 04:49 PM
Harish Rao: ‘‘మీరు ఎంతో ఆడంబరంగా నిర్వహిస్తున్న గ్రామ సభల సాక్షిగా మీ ప్రభుత్వంపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత తేటతెల్లమైంది. ఊరూరా తిరగబడుతున్న జనం, ఎక్కడిక్కడ నిలదీస్తున్న ప్రజానీకాన్ని చూస్తే మీ ఏడాది పాలన పెద్ద ఫెయిల్యూర్ అని అర్థమవుతున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశాల్లో, మంత్రులందరూ పక్క రాష్ట్రాల్లో బిజీగా ఉంటే ప్రజలను ఎవరు పట్టించుకోవాలె’’ అని హరీష్‌రావు నిలదీశారు.
హైదరాబాద్, జనవరి 21: తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామసభల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. లబ్దిదారుల జాబితాలో అర్హుల పేర్లు గల్లంతయ్యాయంటూ పలు ప్రాంతాల్లో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ క్రమంలో గ్రామసభలో జరుగుతున్న గందరగోళ పరిస్థితులపై మాజీ మంత్రి హరీష్‌రావు (Former Minister Harish Rao) స్పందిస్తూ.. ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ సర్కార్ చేస్తుంది ప్రజాపాలన కాదని.. ముమ్మాటికీ ప్రజా వ్యతిరేక పాలన అని అన్నారు. ‘‘మీ సోకాల్డ్ ప్రజాపాలన పట్ల ప్రజలు ఎంత ఆగ్రహంతో ఉన్నారో ఇప్పటికైనా అర్థమైందా? మీరు ఎంతో ఆడంబరంగా నిర్వహిస్తున్న గ్రామ సభల సాక్షిగా మీ ప్రభుత్వంపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత తేటతెల్లమైంది. ఊరూరా తిరగబడుతున్న జనం, ఎక్కడిక్కడ నిలదీస్తున్న ప్రజానీకాన్ని చూస్తే మీ ఏడాది పాలన పెద్ద ఫెయిల్యూర్ అని అర్థమవుతున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) విదేశాల్లో, మంత్రులందరూ పక్క రాష్ట్రాల్లో బిజీగా ఉంటే ప్రజలను ఎవరు పట్టించుకోవాలె’’ అని నిలదీశారు.
ఇందిరమ్మ రాజ్యంలో పోలీసు పహారా నడుమ గ్రామ సభలు నిర్వహించాల్సిన దుస్థితి రావడం దారుణమన్నారు. పథకాల లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రభుత్వం ఒకవైపు గ్రామ సభలు నిర్వహిస్తుంటే, మరోవైపు కార్యకర్తలకే పథకాలు ఇస్తామని అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు చెప్పడం సిగ్గుచేటన్నారు. అలాంటప్పుడు గ్రామ సభలు తూతూ మంత్రంగా నిర్వహిస్తున్నట్లేనా అని అడిగారు. అర్హులైన వారికి పథకాలు ఎగ్గొడుతున్నట్లేనా అని ప్రశ్నించారు. ఎన్నికల ముందు హామీలిస్తం, అధికారంలోకి వచ్చాక ఎగ్గొడుతం అన్నట్లుగా వ్యవహరిస్తే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. రుణమాఫీ, రైతు భరోసా, పంట బోనస్, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు.. అర్హులైన అందరికి ఇస్తామని చెప్పి ఇప్పుడు భారీ కోతలు విధిస్తే ప్రజలు తిరగబడకుండా ఏం చేస్తారన్నారు. కాంగ్రెస్ నాయకుల పాపం, అధికారులకు శాపంగా మారిందని.. సమాధానం చెప్పలేని పరిస్థితి ఏర్పడిందన్నారు.
Kaleshwaram Commission: గంటన్నర పాటు రామకృష్ణారావును ప్రశ్నించిన కాళేశ్వరం కమిషన్
‘‘మీరు నిర్వహిస్తున్న గ్రామ సభలు దగా.. ఆరు గ్యారెంటీలు అమలు దగా..రుణమాఫీ చేయడం దగా..పంట బోనస్ ఇవ్వడం దగా.. రైతు భరోసా.. అమలు దగా.. రేషన్ కార్డుల జారీ దగా.. ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక దగా.. ఏడాది కాలంలో మీరు చేసిన దగాను ప్రజలు అర్థం చేసుకున్నరు. మీరు చేసిన మోసాన్ని, నయవంచనను తెలుసుకున్నరు. ప్రశ్నించే ప్రతిపక్షాలపై అక్రమ కేసులు బనాయిస్తరు. అరెస్టులు చేసి నోళ్లు మూయిస్తరు. నేడు యావత్ తెలంగాణ ఏకమై మీ దుర్మార్గ పాలనను నిలదీస్తున్నది. అడుగడుగునా ప్రశ్నిస్తున్నది. మరి ఇప్పుడు వారిపై ఎన్ని కేసులు పెడతరు. ఎంత మందిని అరెస్టులు చేస్తరు. మీ రాక్షస పాలనలో విసిగి, వేసారి పోయిన తెలంగాణ ప్రజలు ఉప్పెనగా ఉద్యమించక ముందే కళ్లు తెరవండి. ప్రతిపక్షాల మీద బురదజల్లడం మాని పరిపాలన మీద దృష్టి సారించండి. ఎన్నికల హామీలో చెప్పినట్లుగా అర్హులందరికీ ప్రభుత్వ పథకాలను అందజేయాలని ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం’’ అంటూ హరీష్‌రావు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Congress Vs BRS: మాగంటిని అడ్డుకున్న కాంగ్రెస్ కార్పొరేటర్లు.. ఉద్రిక్తత
Read Latest Telangana News And Telugu News
Updated Date - Jan 21 , 2025 | 04:55 PM