Hyderabad: ఇలా అయితే ఎలా బతికేది.. ఎక్కువ సంపాదన అద్దెకే..
ABN, Publish Date - Jul 31 , 2025 | 01:51 PM
ఎక్కడెక్కడి నుంచో నగరానికి వలస వచ్చి హైటెక్ సిటీలోని ఐటీ కంపెనీల్లో సెక్యూరిటీ గార్డులు, హౌస్‌కీపింగ్ వంటి పనులు చేసుకుంటూ వేలాది కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. రహేజా మైండ్‌స్పేస్ పార్క్, ఫీనిక్స్ సెజ్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి వేవ్‌రాక్ ఇలా ఐటీ కారిడార్ అన్ని ప్రాంతాల్లోనూ సాఫ్ట్‌వేర్ కంపెనీలు పెద్ద ఎత్తున ఉన్నాయి.
- ఐటీ కారిడార్ పరిసర కాలనీల్లో పేదలపై అద్దెల భారం
- సింగిల్ బెడ్‌రూం ఇల్లు కావాలన్నా రూ.10వేల పైమాటే
- ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్న ప్రజలు
హైదరాబాద్: ఎక్కడెక్కడి నుంచో నగరానికి వలస వచ్చి హైటెక్ సిటీలోని ఐటీ కంపెనీల్లో సెక్యూరిటీ గార్డులు, హౌస్‌కీపింగ్ వంటి పనులు చేసుకుంటూ వేలాది కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. రహేజా మైండ్‌స్పేస్ పార్క్, ఫీనిక్స్ సెజ్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి వేవ్‌రాక్(Gachibowli WaveRock) ఇలా ఐటీ కారిడార్ అన్ని ప్రాంతాల్లోనూ సాఫ్ట్‌వేర్ కంపెనీలు పెద్ద ఎత్తున ఉన్నాయి.
ఐటీ నిపుణులతో పాటు చిన్నచిన్న ఉద్యోగాలకు కూడా ఈ ఐటీ కారిడార్ నెలవు కావడంతో పరిసర ప్రాంతాలలో ఇళ్లకు డిమాండ్ భారీగా పెరిగింది. వృత్తి నైపుణ్యం(స్కిల్డ్ జాబ్స్) కలవారికి జీతాలు ఎక్కువ కాబట్టి ఇంటి అద్దెలు పెద్ద సమస్య కాదు. కానీ చిరుద్యోగులకు మాత్రం ఒక్క గది అద్దెకు తీసుకోవాలన్నా రూ.4 వేల వరకు చెల్లించాల్సి వస్తుంది. సింగిల్ బెడ్‌రూం పోర్షన్ అద్దెకు తీసుకుంటే హైటెక్ సిటీ పరిసర ప్రాంతాలలో రూ.10 వేల నుంచి 14 వేల వరకు అద్దె చెల్లించాల్సి వస్తుంది.
అవసరమే అవకాశంగా..
మినీ టోక్యో నగరాన్ని తలపిస్తున్న పర్వత్ నగర్, తులసీ నగర్, జనప్రియ నగర్, వివేకానంద నగర్, అల్లాపూర్‌లోని పలు కాలనీలలో చిన్న చిన్న ప్లాట్లలోనే బహుళ అంతస్తుల భవనాలు వెలిశాయి. అగ్గిపెట్టెల్లాంటి గదులు నిర్మించి భారీ స్థాయిలో అద్దెలు వసూలు చేస్తున్నారు. జనాభా ఎక్కువ కావడంతో డ్రైనేజీ సమస్యలు, నీటి కొరత కాస్త ఎక్కువగానే ఉంటాయి. అయినా కార్యాలయాలకు దగ్గరగా ఉండొచ్చని భావించే వారి అవసరాలను ఇళ్ల యజమానులు క్యాష్ చేసుకుంటున్నారు.
సర్కారు డబుల్ బెడ్రూం ఇళ్లంటూ ఏర్పాట్లు చేసినా అవి అందరి అవసరాలు తీర్చే స్థాయిలో లేకపోవడంతో పేదలకు ఇబ్బందులు తప్పడం లేదు. దిగ్గజ కంపెనీలకు రాయితీలు ఇచ్చినట్లుగానే ఉపాధి కోసం ఇక్కడికి వచ్చే వారికి ఆవాస ప్రణాళిక ఉంటే బాగుంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకోసం కనీసం సింగల్ రూం క్వార్టర్స్ ఏర్పాటు చేసి సబ్సిడీ అద్దెలతో చిరుద్యోగులకు ఇస్తే ఉపయోగకరంగా ఉంటుందని ఈ ప్రాంతాల్లో నివసించే ప్రజలు అంటున్నారు.
క్వార్టర్స్ ఏర్పాటు చేయాలి
ఓ ప్రైవేట్ కంపెనీలో సెక్యూరిటీ గార్డ్‌గా పని చేస్తున్నాను. వరంగల్ జిల్లా పర్వతగిరికి చెందిన వాళ్లం. కుటుంబం కాస్త పెద్దది కావడంతో మాకు డబుల్ బెడ్‌రూం ఇల్లు అవసరం. కానీ సింగిల్ బెడ్‌రూం ఇంటికే సగం జీతం చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఒక ప్రణాళిక రచించి క్వార్టర్స్ ఏర్పాటు చేస్తే మాలాంటి ఎంతో మంది చిరుద్యోగులకు సౌకర్యంగా ఉంటుంది.
- వీరన్న, సెక్యూరిటీ గార్డు, హైటెక్ సిటీ
రాయితీలతో అద్దె ఇళ్లు ఇవ్వాలి
ఇక్కడ అద్దెలు చాలా ఎక్కువ. సొంత ఊరిలో ఇల్లు ఉన్నా పిల్లల చదువుల కోసం ఇక్కడ ఉండాల్సి వస్తోంది. ఇంతింత అద్దెలు కడుతూ జీవనం సాగించాలంటే భారంగా ఉంది. ప్రభుత్వం పెద్ద కంపెనీలకు రాయితీలు ఇచ్చినట్టే చిరుద్యోగులకు రాయితీలతో అద్దె ఇళ్లు సమకూర్చితే బాగుంటుంది.
- జీవన్, కార్పెంటర్, పర్వత్‌నగర్
ఈ వార్తలు కూడా చదవండి..
తగ్గిన ధరలకు బ్రేక్.. మళ్లీ లక్షదాటేసిన పసిడి ధరలు
ఉపాధి హామీ ఫీల్డ్‌అసిస్టెంట్లకు సమాన వేతనం
Read Latest Telangana News and National News
Updated Date - Jul 31 , 2025 | 01:51 PM