Hyderabad: ఫైటరాబాద్!
ABN, Publish Date - Jun 06 , 2025 | 04:35 AM
దేశ రక్షణలో అత్యంత ముఖ్యమైన పాత్ర పోషించే యుద్ధ విమానాల తయారీలో హైదరాబాద్ కీలక హబ్‌గా మారుతోంది. ఒక్క యుద్ధ విమానాలే కాదు.. డ్రోన్ల నుంచి క్షిపణులు, ఉపగ్రహాల దాకా తయారుచేసే 20కి పైగా ఏరోస్పేస్ కంపెనీలు మన రాజధాని నగరంలో ఉన్నాయి..
యుద్ధవిమానాల తయారీలో కీలకంగా హైదరాబాద్
తేజస్ ఎంకే1ఏ సెంట్రల్ ఫ్యూస్‌లాజ్ తయారీ ఇక్కడే
రాఫెల్ ఫ్యూస్‌లాజ్ తయారీ యూనిట్ భాగ్యనగరంలోనే
ఐదో తరం స్టెల్త్ యుద్ధ విమానం ఆమ్కా అభివృద్ధిలో హైదరాబాద్ కంపెనీ వెమ్ టెక్నాలజీస్ కీలకపాత్ర
ఎస్92 హెలికాప్టర్ల క్యాబిన్లు తయారవుతున్నదీ ఇక్కడే..
హైదరాబాద్, జూన్ 5: దేశ రక్షణలో అత్యంత ముఖ్యమైన పాత్ర పోషించే యుద్ధ విమానాల తయారీలో హైదరాబాద్ కీలక హబ్‌గా మారుతోంది. ఒక్క యుద్ధ విమానాలే కాదు.. డ్రోన్ల నుంచి క్షిపణులు, ఉపగ్రహాల దాకా తయారుచేసే 20కి పైగా ఏరోస్పేస్ కంపెనీలు మన రాజధాని నగరంలో ఉన్నాయి!! తాజాగా రాఫెల్ యుద్ధవిమానాల ఫ్యూస్‌లాజ్ (విమానం ప్రధాన/మధ్య భాగం) తయారీకి సంబంధించి దసో ఏవియేషన్‌తో ఒప్పందం కుదుర్చుకున్న టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్.. ఆ తయా రీ యూనిట్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనుండడంతో భాగ్యనగర కీర్తికిరీటంలో మరో కలికితురాయి చేరినట్టయింది. రక్షణ రంగంలో స్వా వలంబన (ఆత్మనిర్భర్ భారత్) దిశగా ఇప్పటికే హైదరాబాద్‌కు చెందిన వెమ్ టెక్నాలజీస్ సంస్థ.. ‘తేజస్ ఎంకే1ఏ’ యుద్ధవిమానాల సెంట్రల్ ఫ్యూస్‌లాజ్‌ను ఇక్కడ అసెంబుల్ చేసి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్)కు అందజేసిన సంగతి తెలిసిందే. దేశీ పరిజ్ఞానంతో రూపొందిస్తున్న ఐదో తరం స్టెల్త్ యుద్ధవిమా నం ఆమ్కా (అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్) అభివృద్ధిలో సైతం వెమ్ టెక్నాలజీస్ కీలకపాత్ర పోషిస్తోంది. ఆ విమానం ‘ఎండ్-టు-ఎండ్ మాడ్యూల్స్’ తయారీలో, ఎయిర్‌క్రాఫ్ట్ అసెంబ్లింగ్‌లో పాలుపంచుకుంటోంది.
యుద్ధవిమానాల ఫ్యూస్‌లాజ్‌ల తయారీ మాత్రమే కాక.. ఫైటర్ జెట్లకు అవసరమైన జనరేటర్లు, రక్షణ శాఖ హెలికాప్టర్లు, యుద్ధవిమానాల్లోని ఆన్-బోర్డ్ సిస్టమ్స్ తయారీలోనూ వెమ్ టెక్నాలజీస్ కీలకపాత్ర పోషిస్తోంది. ఇక.. హైదరాబాద్‌లోని ‘టాటా, లాక్‌హీడ్ మార్టిన్ ఏరోస్ట్రక్చర్స్ లిమిటెడ్ (టీఎల్‌ఎంఏఎల్)’లో ఎఫ్21 ఫైటర్ జెట్ వింగ్స్ తయారీకి టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్, లాక్‌హీడ్ మార్టిన్ సంస్థలు 2023 మేలో ఒప్పం దం కుదుర్చుకున్నాయి. ఇదే టీఎల్‌ఎంఏఎల్.. సీ-130జే రవాణా విమానాల ఎంపెన్నేజ్ అ సెంబ్లీ్‌సను (విమానంలో తోకభాగంలో ఉండే రడ్డర్, ఎలివేటర్స్, వర్టికల్, హారిజాంటల్ స్టెబిలైజర్లు- ఇవన్నీ కలిసి చుక్కానిలా పనిచేస్తా యి) ప్రపంచం మొత్తానికీ సరఫరా చేస్తోంది. హైదరాబాద్‌లోని టీఎల్‌ఎంఏఎల్‌లో ఇప్పటిదాకా 220కిపైగా ఎంపెన్నేజ్ అసెంబ్లీ యూని ట్లు తయారయ్యాయి. ఇక.. ప్రపంచంలోనే అతిపెద్ద ఏరోస్పేస్ కంపెనీ, అమెరికాకు చెందిన బోయింగ్‌తో కలిసి టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ‘టాటా బోయింగ్ ఏరోస్పేస్ లిమిటెడ్ (టీబీఏఎల్)’.. ఏహెచ్-64 అపాచీఅటాక్ హె లికాప్టర్ల ఫ్యూస్‌లాజ్‌ను తయారుచేస్తోంది. టీ బీఏఎల్ ఇప్పటికే 300కు పైగాఅపాచీ హెలికాప్టర్ల ఫ్యూస్‌లాజ్‌ను సరఫరా చేయడం విశేషం.
ఇక్కడ తయారవుతున్నాయిగానీ..
తేజస్ ఎంకే1ఏ యుద్ధవిమానాలకు అవసరమైన సెంట్రల్ ఫ్యూస్‌లాజ్‌ను ఇక్కడ తయారుచేసి బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌కు అందిస్తున్నా.. విదేశీ ఇంజన్లు రాకపోవడంతో వాటి ఉత్పత్తి ఆలస్యమవుతోంది. ఈ విమానాలకు కావాల్సిన 99 ఎఫ్404 ఇంజన్ల కోసం హాల్ 2021లోనే జీఈ సంస్థకు ఆర్డర్ ఇచ్చింది. ఒప్పందం ప్రకారం ఏటా కొన్ని ఇంజన్లు సరఫరా చేయాల్సిన జీఈ.. ఈ ఏడాది ఫిబ్రవరి దాకా ఒక్క ఇంజన్‌ను కూడా పంపలేదు. ఎట్టకేలకు మార్చిలో ఒక్క ఇంజన్‌ను మాత్రం పంపింది. దీనివల్లే తేజస్ ఎంకే1ఏ విమానాల తయారీ నత్తనడకన సాగుతోంది. అలాగే.. మన రక్షణ శాఖ ఆర్మీ కోసం ఆరు అపాచీ హెలికాప్టర్ల కొనుగోలుకు బోయింగ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇక్కడి నుంచి అపాచీ ఫ్యూస్‌లాజ్‌లు సమయానికి సరఫరా అవుతున్నా.. ఆ సంస్థ మాత్రం మనకు ఇప్పటిదాకా వాటిని సరఫరా చేయకపోవడం గమనార్హం.
మెరైన్ వన్ క్యాబిన్ కూడా ఇక్కడే!
అమెరికా అధ్యక్షుడు వాడే హెలికాప్టర్‌ను మెరైన్ వన్ అంటారు. ఆ హెలికాప్టర్ ‘సికోర్‌స్కీ ఎస్92’ రకానికి చెందినది. ఆ తరహా హెలికాప్టర్ల క్యాబిన్లను తయారుచేసేది ఎవరో తెలుసా? హైదరాబాద్‌లోని ‘టాటా సికోర్‌స్కీ ఏరోస్పేస్ లిమిటెడ్’. 2009లో టాటా, సికోర్‌స్కీ సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు.. 2013 నుంచి ఎస్-92 హెలికాప్టర్ల క్యాబిన్లను హైదరాబాద్‌లో తయారుచేస్తున్నారు. క్యాబిన్ల అసెంబ్లింగ్ మాత్రమే కాదు.. అందుకు అవసరమయ్యే 5000 ప్రెసిషన్ విడిభాగాలను సైతం ఇక్కడే తయారుచేస్తున్నారు. అనంతరం ఈ క్యాబిన్లను అమెరికాకు పంపిస్తారు. అక్కడ ఫైనల్ అసెంబ్లింగ్ పూర్తిచేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కస్టమర్లకు వాటిని సరఫరా చేస్తారు. హైదరాబాద్‌లో ఉన్న టీఎ్‌సఏఎల్‌కు నెలకు నాలుగు ఎస్92 క్యాబిన్లను తయారుచేసే సామర్థ్యం ఉంది. సికోర్‌స్కీ సంస్థ అంతర్జాతీయ సరఫరా చైన్‌లో ఈ యూనిట్ అత్యంత కీలకపాత్ర పోషిస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి.
Read Latest Telangana News and National News
Updated Date - Jun 06 , 2025 | 04:35 AM