Hyderabad: హైడ్రాకు ఫిర్యాదులపై రంగంలోకి రంగనాథ్
ABN, Publish Date - Jan 09 , 2025 | 05:29 AM
ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులపై హైడ్రా రంగంలోకి దిగింది. కమిషనర్ రంగనాథ్ క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు.
బుధవారం హైదరాబాద్ శివార్లలో పలు చెరువుల పరిశీలన
పోచారం మున్సిపాలిటీలో వివాదాస్పద లే అవుట్ల సందర్శన
తుర్కయాంజల్ చెరువు ఎఫ్‌టీఎల్‌ను నిర్ధారిస్తామని వెల్లడి
హైదరాబాద్ సిటీ/హయత్‌నగర్, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులపై హైడ్రా రంగంలోకి దిగింది. కమిషనర్ రంగనాథ్ క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. బుధవారం హైదరాబాద్ శివార్లలోని పలు ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన నిర్వహించిన ఆయన తుర్కయాంజల్, రాయన్, జీలవర్కన్ చెరువులను సందర్శించారు. అనంతరం పోచారం మున్సిపాలిటీ పరిధిలోని దివ్యానగర్ లే అవుట్, సుప్రభాత్ టౌన్‌షి్‌ప, ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సాయి ప్రియ కాలనీల్లో పర్యటించారు. గేటెడ్ కమ్యూనిటీల పేరుతో ఆయా కాలనీల్లో రోడ్లపై గేట్లు ఏర్పాటు చేయడంతో రాకపోకలకు ఇబ్బంది అవుతోందన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఆయా కాలనీల వాసులతో మాట్లాడారు. రోడ్లపై ఏర్పాటు చేసిన గేట్లను తెరిపించారు.
నల్లమల్లారెడ్డి అభివృద్ధి చేసిన దివ్యానగర్ లేఅవుట్ నుంచి వెళ్లేందుకు రోడ్డు మార్గం ఇవ్వకపోవడంపై రంగనాథ్ స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. తూములు మూసి.. అలుగు ఎత్తు పెంచడంతో తమ ఇళ్లు, పంట పొలాలు నీట మునుగుతున్నాయన్న స్థానికుల ఫిర్యాదుల నేపథ్యంలో బుధవారం రంగనాథ్ తుర్కయాంజల్ చెరువును రెవెన్యూ, సాగునీటి పారుదల శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. దీనిపై వ్యవసాయశాఖ, రెవెన్యూ విభాగాల వద్ద ఉన్న వివరాలు పరిశీలిస్తామని, ఇంజనీరింగ్ నిపుణులతో అధ్యయనం చేయుస్తామని రంగనాథ్ చెప్పారు. నేషనల్ రిమోట్ సెన్సింట్ సెంటర్ చిత్రాలు, గ్రామాల మ్యాప్‌లను సరి చూసి రెండు, మూడు నెలల్లో చెరువు వాస్తవ ఎఫ్‌టీఎల్ ఎంతన్నది నిర్ధారిస్తామని పేర్కొన్నారు.
ప్రజావాణిలో హైడ్రాకు 83 ఫిర్యాదులు
నగరంలో కొన్ని చెరువులు మాయమైతే.. మరి కొన్ని చెరువుల ఎఫ్‌టీఎల్ పరిధి పెరిగినట్టు ఫిర్యాదులు వస్తున్నాయని రంగనాథ్ తెలిపారు. అమీన్‌పూర్, నల్లగండ్ల చెరువులపై కూడా ఇలాంటి ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. దశాబ్దాల క్రితం తాము ఇక్కడ ఇంటి స్థలాలు కొన్నామని, గతంలో ఎప్పుడూ నీళ్లు రాలేదని, కొంత కాలంగా ముంపునకు గురవుతోందని తర్కయాంజల్‌లోని ఆదిత్యనగర్ నివాసితులు పేర్కొన్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, శాస్త్రీయంగా చెరువు వాస్తవ విస్తీర్ణాన్ని నిర్ధారిస్తామని రంగనాథ్ తెలిపారు. పెద్దఅంబర్‌పేట్ మున్సిపాలిటీ రాయన్ చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌ను కూడా రంగనాథ్ పరిశీలించారు. ఈ నెల 6వ తేదీన ప్రారంభించిన ప్రజావాణిలో వివిధ ప్రాంతాల్లోని చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాలకు సంబంధించి 83 ఫిర్యాదులు వచ్చాయి. ఆక్రమణల తీరు, తీవ్రతను బట్టి కమిషనర్ స్వయంగా పరిశీలిస్తుండగా.. కొన్ని ఫిర్యాదులను ఏరియాల వారీగా వివిధ విభాగాలతో కూడిన అధికారుల బృందం సందర్శిస్తోంది.
Updated Date - Jan 09 , 2025 | 05:29 AM