Road Accident: ఓఆర్‌ఆర్‌పై ఘోర ప్రమాదం
ABN, Publish Date - May 11 , 2025 | 05:07 AM
పెద్ద అంబర్‌పేట్ ఔటర్ రింగురోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు కారులో సజీవదహనమయ్యారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో వ్యక్తి మృతి చెందాడు.
ఆగి ఉన్న బొలెరో వాహనాన్ని ఢీకొట్టిన కారు
మంటలు చెలరేగి కారులో ఇద్దరు వ్యక్తుల సజీవదహనం
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరి మృతి
పెద్ద అంబర్‌పేట్ ఔటర్ జంక్షన్ సమీపంలో ఘటన
అబ్దుల్లాపూర్‌మెట్, మే 10 (ఆంధ్రజ్యోతి): పెద్ద అంబర్‌పేట్ ఔటర్ రింగురోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు కారులో సజీవదహనమయ్యారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో వ్యక్తి మృతి చెందాడు. శుక్రవారం అర్ధరాత్రి పెద్ద అంబర్‌పేట్ ఔటర్ జంక్షన్ గండిచెరువు రోడ్డు బ్రిడ్జి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. తాడ్‌బన్ బహదూర్‌పుర హెచ్‌బీ కాలనీకి చెందిన వ్యాపారి రితేశ్‌కుమార్ అగర్వాల్ కుమారుడు దీపేశ్‌కుమార్ (23) శుక్రవారం రాత్రి 11 గంటలకు స్నేహితులను కలిసి వస్తానని ఇంట్లో చెప్పి టాటా కార్వ్ కారు తీసుకుని బయటకు వెళ్లాడు. వీటీసీ విజయనగర్ కాలనీకి చెందిన సంచయ్(22), మూసాపేట్‌కు చెందిన ప్రియాన్షు మిట్టల్(23)తో కలిసి కారులో బయలుదేరారు. వీరు ఓఆర్‌ఆర్ మీదుగా శంషాబాద్ నుంచి ఘట్‌కేసర్ వైపునకు వస్తూ.. అర్ధరాత్రి 2 గంటలకు పెద్ద అంబర్‌పేట్ ఔటర్ జంక్షన్ సమీపంలోని గండిచెరువు రోడ్డు బ్రిడ్జి వరకు చేరుకున్నారు.
ఆ సమయంలో ఓ బొలెరో వాహనం ఓఆర్‌ఆర్‌పై రోడ్డు పక్కన ఆగి ఉంది. దీపేశ్ దీనిని గమనించకపోవడంతో అతడు నడుపుతున్న కారు.. బొలెరో వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో బొలెరో 100 మీటర్ల దూరం వరకు ముందుకు దూసుకెళ్లింది. ఆ వెంటనే కారులో నుంచి మంటలు చెలరేగి రెండు వాహనాలకు అంటుకున్నాయి. కారు ముందు సీట్లో కూర్చున్న దీపేశ్, సంచయ్ అందులో ఇరుక్కుపోవడంతో మంటల్లో సజీవదహనమయ్యారు. మంటల్లో కారు తగులబడుతుండడాన్ని గమనించిన వాహనదారులు కారు వెనుక సీట్లో ఉన్న ప్రియాన్షును బయటకు లాగి.. ఎల్‌బీనగర్‌లోని కామినేని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతడు మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించినట్లు పోలీసులు తెలిపారు. కాగా, మంటల్లో రెండు వాహనాలు పూర్తిగా కాలిపోయాయి. అయితే ఈ ప్రమాద ఘటనకు ముందు అక్కడ ఓ పండ్ల వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టినట్లు, దీంతో ఆ వాహనదారుకు సహాయం చేసేందుకు బొలెరో డ్రైవర్ వాహనాన్ని పక్కన ఆపి వెళ్లినట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - May 11 , 2025 | 05:07 AM