High Court: ‘మూసీ’లో భూమి కోల్పోయిన వ్యక్తికి 3 నెలల్లో ప్లాట్ ఇవ్వకపోతే జైలే!
ABN, Publish Date - Jun 19 , 2025 | 04:01 AM
గతంలో తాము ఇచ్చిన ఆదేశాలను మూడు నెలల్లో అమలు చేయకపోతే రెండు వారాల జైలు శిక్ష అనుభవించడంతో పాటు రూ.వెయ్యి జరిమానా చెల్లించాల్సి ఉంటుందని హైకోర్టు అప్పటి హెచ్‌ఎండీఏ కమిషనర్, ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్‌ను హెచ్చరించింది.
ఐఏఎస్ అర్వింద్ కుమార్‌కు హైకోర్టు హెచ్చరిక
గతంలో తాము ఇచ్చిన ఆదేశాలను మూడు నెలల్లో అమలు చేయకపోతే రెండు వారాల జైలు శిక్ష అనుభవించడంతో పాటు రూ.వెయ్యి జరిమానా చెల్లించాల్సి ఉంటుందని హైకోర్టు అప్పటి హెచ్‌ఎండీఏ కమిషనర్, ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్‌ను హెచ్చరించింది. మూసీ నది అభివృద్ధి పథకంలో భాగంగా భూములు కోల్పోయిన వారికి అభివృద్ధి చేసిన ప్లాట్లు కేటాయిస్తామని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. కానీ భూమి కోల్పోయిన తనకు ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయలేదంటూ రాంరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై పిటిషనర్‌కు హామీ ఇచ్చిన విధంగా అభివృద్ధి చేసిన ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయాలని హైకోర్టు ఆదేశించింది. అయితే ఈ ఆదేశాలు అమలు కాకపోవడంతో పిటిషనర్ కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు. వాదనలు విన్న జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం.. ప్లాట్‌కు సంబంధించిన హక్కు పత్రాలను మూడు నెలల్లో ఇవ్వకపోతే అర్వింద్‌కుమార్ జైలుకు వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించింది.
Updated Date - Jun 19 , 2025 | 04:01 AM