Rains Alert: హైదరాబాద్‌లో మళ్లీ వర్షం.. పలు చోట్ల ట్రాఫిక్ జామ్
ABN, Publish Date - Apr 18 , 2025 | 06:33 PM
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Rains Alert: తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మధ్యాహ్నం వరకు తీవ్ర ఎండ ఉండగా సాయంత్రం కల్లా పూర్తిగా మారిపోయింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం మొదలైంది. సిద్దిపేట జిల్లా, కామారెడ్డి జిల్లా, ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్, వరంగల్ జిల్లాలో కుండపోత వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాలలో ధాన్యం తడిసి ముద్దాయింది. వరి, మామిడి నేలకొరిగాయి.
కామారెడ్డి జిల్లా ఇస్రోజవాడి గ్రామంలో పిడుగుపాటుతో 40 గొర్రెలు మృతి చెందాయి. సుమారు 5 లక్షల వరకు ఆస్తి నష్టం కలిగింది. అటు సిద్ధిపేట జిల్లా చేర్యాల మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలోనూ పిడుగుపడి గుడిసె కనకయ్యకు చెందిన రెండు పాడి గేదెలు మృతి చెందాయి. ఇలా భారీ వర్షం రైతుల్లో తీవ్ర దుఃఖాన్ని మిగిల్చింది. ఈ మేరకు తెలంగాణలోని కొన్ని జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
హైదరాబాద్‌లోనూ పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. భారీ వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. మ్యాన్ హోల్స్ పొంగిపొర్లుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఐటీ కారిడార్‌లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. సోమాజిగూడ, పంజాగుట్ట, అమీర్‌పేట్ , ఖైరతాబాద్‌లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Updated Date - Apr 18 , 2025 | 07:15 PM