Heavy Rains: నేడు, రేపు భారీ వర్షాలు..
ABN, Publish Date - Jul 17 , 2025 | 05:27 AM
తెలంగాణలోని పలు జిల్లాల్లో గురు, శుక్రవారాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్
హైదరాబాద్, మహబూబ్‌నగర్, నాగార్జునసాగర్, జూలై 16 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలోని పలు జిల్లాల్లో గురు, శుక్రవారాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసినట్లు పేర్కొంది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, జనగాం, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భదాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
ప్రాజెక్టులకు కొనసాగుతున్న వరద
శ్రీశైలం, నాగర్జునసాగర్ ప్రాజెక్టులకు వరద నిలకడగా కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు వద్ద 48,143 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతుండగా విద్యుదుత్పత్తి, పోతిరెడ్డిపాడు, ఎంజీకేఎల్‌ఐ ద్వారా 89,938 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా ప్రస్తుతం 197.46 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఆల్మట్టి, నారాయణపూర్ నుంచి దిగువకు నీటి విడుదలను అధికారులు పెంచారు. జూరాల వద్ద 20 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతుండగా 41 వేల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ పరివాహకంలో వరద పెరుగుతుండటంతో దిగువ ప్రాజెక్టులను ఇన్‌ఫ్లోలు పెరిగే అవకాశం ఉంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద ఇన్‌ఫ్లో 65,900 క్యూసెక్కులు కాగా నీటిమట్టం 558.70 అడుగులకు చేరింది.ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 312.0450 టీఎంసీలు కాగా బుధవారం నాటికి 229.3671 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నాగార్జునసాగర్ ఎడమకాల్వకు ఈ నెల 18న నీరు విడుదల చేస్తామని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తెలిపారు. మూసీ ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల ఆయకట్టులోని 30 వేల ఎకరాలకు ఈ నెల 18 నుంచి నీటిని విడుదల చేయనున్నట్లు ప్రాజెక్టు డీఈ చంద్రశేఖర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
ఇవి కూడా చదవండి
కాళేశ్వరం అవినీతి ఇంజినీర్లకు ఇక చుక్కలే..ఈడీ విచారణకు సిద్ధం..
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jul 18 , 2025 | 08:08 AM