ఆరోగ్య శ్రీ ఎం-ప్యానెల్‌మెంట్‌పై ప్రైవేటు ఆస్పత్రుల నుంచి ఫిర్యాదుల్లేవు
ABN, Publish Date - Jul 03 , 2025 | 05:13 AM
పైసలిస్తేనే ఆరోగ్యశ్రీ ఎం-ప్యానెల్‌మెంట్‌కు అనుమతిస్తున్నట్లు ఏ ఒక్క ప్రైవేటు ఆస్పత్రి నుంచి తమకు ఫిర్యాదు రాలేదని ఆరోగ్య శ్రీ ట్రస్టు సీఈఓ ఉదయ్‌కుమార్ తెలిపారు.
పూర్తి పారదర్శకతతోనే అనుమతి
‘‘ఆంధ్రజ్యోతి’’ కథనంపై సీఇవో వివరణ
హైదరాబాద్, జూలై 2 (ఆంధ్రజ్యోతి): పైసలిస్తేనే ఆరోగ్యశ్రీ ఎం-ప్యానెల్‌మెంట్‌కు అనుమతిస్తున్నట్లు ఏ ఒక్క ప్రైవేటు ఆస్పత్రి నుంచి తమకు ఫిర్యాదు రాలేదని ఆరోగ్య శ్రీ ట్రస్టు సీఈఓ ఉదయ్‌కుమార్ తెలిపారు. ఆరోగ్య శ్రీ పథకానికి ప్రైవేటు ఆస్పత్రుల ఎం-ప్యానల్‌మెంట్ ప్రక్రియ పూర్తి పారదర్శకతతో చేపడుతున్నామన్నారు. ‘ఆరోగ్య శ్రీ అనుసంధానం-పైసలిస్తే పరిపూర్ణం’ అనే శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన వార్తా కథనంపై బుధవారం ఆయన వివరణ ఇచ్చారు. 2023 డిసెంబర్ 9 నుంచి ఇప్పటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 97 ప్రైవేటు ఆస్పత్రులను ఆరోగ్యశ్రీలో ఎం-ప్యానెల్ చేశామన్నారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ఆన్‌లైన్‌లోనే ఆస్పత్రుల నుంచి దరఖాస్తులు స్వీకరించామని ఉదయ్ కుమార్ తెలిపారు.
దారిద్య్ర రేఖకు దిగువనున్న వారికి నగదు రహిత వైద్యం మరింత మందికి అందుబాటులోకి తేవడానికి ‘ఆరోగ్య శ్రీ-ఎం-ప్యానెల్’ ఆస్పత్రుల సంఖ్యను పెంచడంతోపాటు కఠిన నిబంధనలనూ సరళతరం చేశామని వివరించారు. ఎం-ప్యానెల్‌మెంట్ అండ్ డిసిప్లినరీ కమిటీని తొలగించలేదని స్పష్టం చేసిన ఉదయ్ కుమార్.. ప్రైవేటు ఆస్పత్రుల ఎం-ప్యానెల్ విషయమై పూర్తిగా సమీక్షించి, సిఫారసులు చేయడంలో ఈడీసీ కీలక పాత్ర పోషిస్తున్నదన్నారు. ఎం-ప్యానెల్ పర్యవేక్షణ అధికారికి ఆ బాధ్యతలు అప్పగించి ఏడాది కూడా దాటలేదని ఆయన తెలిపారు.
Updated Date - Jul 03 , 2025 | 05:13 AM