High Court: నాగారం భూములపై సింగిల్ జడ్జి వద్దే తేల్చుకోండి
ABN, Publish Date - May 01 , 2025 | 03:52 AM
నాగారంలో పలువురు ఐఏఎ్‌సలు, ఐపీఎస్ లు కొనుగోలు చేసిన భూములను నిషేధిత జాబితాలో పెట్టాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి హైకోర్టు డివిజన్ బెంచ్ నిరాకరించింది.
మధ్యంతర ఉత్తర్వుల ఎత్తివేతకు వెకేట్ స్టే పిటిషన్ దాఖలు చేసుకోవచ్చు
పలువురు ఐపీఎ్‌సల అప్పీళ్లపై హైకోర్టు డివిజన్ బెంచ్ స్పష్టం
హైదరాబాద్, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి): నాగారంలో పలువురు ఐఏఎ్‌సలు, ఐపీఎస్ లు కొనుగోలు చేసిన భూములను నిషేధిత జాబితాలో పెట్టాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి హైకోర్టు డివిజన్ బెంచ్ నిరాకరించింది. సదరు వ్యవహారాన్ని సింగిల్ జడ్జి వద్దే తేల్చుకోవాలని.. ఉత్తర్వులు ఎత్తేయాలంటూ సింగిల్ జడ్జి వద్ద వెకేట్ స్టే పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్‌పాల్, జస్టిస్ రేణుక ధర్మాసనం తెలిపింది. ఏపీ, తెలంగాణకు చెందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు రంగారెడ్డి జిల్లా నాగారంలోని ప్రభుత్వ భూముల రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి.. వాటిని అక్రమంగా బదిలీ చేసుకున్నారంటూ బిర్ల మల్లేశ్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. దీంతో జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం.. నాగారంలోని 180, 182, 194, 195 సర్వే నంబర్లలోని భూముల విషయంలో అన్ని రకాల లావాదేవీలపై స్టే విధించడంతోపాటు నిషేధిత జాబితాలో చేర్చాలని ఏప్రిల్ 24న మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ తాజాగా పలువురు ఐపీఎ్‌సలు, వారి కుటుంబ సభ్యులు, ప్రభుత్వ ఉద్యోగులు హైకోర్టు డివిజన్ బెంచ్‌లో అప్పీల్ పిటిషన్లు వేశారు. అవి భూదాన్ భూములు కాదని.. చట్టబద్ధంగా కొనుగోలు చేశామని.. సింగిల్ జడ్జి ఉత్తర్వులను కొట్టేయాలని పేర్కొన్నారు. పిటిషన్ వేసిన వారిలో మహేశ్ మురళీధర్ భగవత్, సౌమ్యామిశ్రా, స్వాతి లక్రా, రవిగుప్తా, తరుణ్‌జోషి, రేణుగోయెల్, బీకే రాహుల్ హెగ్డే, రాహుల్ బుసిరెడ్డి, వీరన్నగారి గౌతమ్‌రెడ్డి, రేఖా షరాఫ్ తదితరులున్నారు.
ఉన్నతాధికారులు కబ్జాదారులనేలా ప్రచారం..
కోర్టులో పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు ఎస్.నిరంజన్‌రెడ్డి, దేశాయి ప్రకాశ్‌రెడ్డి తదితరులు వాదనలు వినిపించారు. ‘మేం సేల్‌డీడ్ ద్వారా చట్టబద్ధంగా భూములను కొన్నాం. సర్వే నంబర్లు 180, 182లో ఉన్న భూములకు 194, 195 సర్వే నంబర్లలోని భూములకు సంబంధం లేదు. మావి భూదాన్ భూములు కావు. సింగిల్ జడ్జి మా వాదన వినకుండా.. ముందస్తు నోటీసులివ్వకుండా చాలా కఠినమైన ఆదేశాలిచ్చారు. పిటిషనర్ విజ్ఞప్తుల పరిధి కంటే మించి సింగిల్ జడ్జి ఆదేశాలు జారీ చేశారు. మేం ఉన్నత స్థానాల్లో ఉన్నందున అధికార దుర్వినియోగం చేస్తామని సింగిల్ జడ్జి ముందే ఊహించడం సరికాదు. భూవివాదాలు సివిల్ కోర్టులో తేల్చుకోవాలి.. ఈ వ్యవహారంపై రిట్ పిటిషన్ విచారణార్హమే కాదు’ అని పేర్కొన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. సింగిల్ జడ్జి ఇచ్చినవి మధ్యంతర ఉత్తర్వులు మాత్రమేనని.. అవి తుది ఉత్తర్వులు కావని పేర్కొంది. అప్పీలుదారులు సింగిల్ జడ్జి వద్ద కౌంటర్లు దాఖలు చేసి మధ్యంతర ఉత్తర్వుల ఎత్తివేతకు వెకేట్ స్టే పిటిషన్లు వేసుకోవచ్చని చెబుతూ అప్పీల్ పిటిషన్లను ముగించింది. కాగా, నాగారంలోని 194,195 సర్వే నంబర్లలో ఉన్నవి భూదాన్ భూములు కాదని.. అవి బైరాన్ (ప్రభుత్వ) భూములని మొదటి పిటిషనర్ బిర్ల మల్లేశ్ తరఫు సీనియర్ న్యాయవాది రవిచందర్ కోర్టుకు తెలిపారు. ధర్మాసనం అడిగిన ఓ ప్రశ్నకు బదులిస్తూ.. అవి భూదాన్ భూములని పొరపాటున నమోదైందని.. ఆ మేరకు ఉత్తర్వులు సవరించాలని సింగిల్ జడ్జి వద్ద అప్లికేషన్ దాఖలు చేసినట్లు పేర్కొన్నారు.
Also Read:
BR Ambedkar: అంబేడ్కర్, అఖిలేష్ చెరిసగం ఫోటో .. విమర్శలు గుప్పించిన బీజేపీ
Fish Viral Video: ప్రయత్నాలు ఎప్పుడూ వృథా కావు.. ఈ చేప ఏం చేసిందో చూస్తే..
Haunted Tours: ఆశ్చర్యం కాదు..దెయ్యాల రాష్ట్రాల గురించి తెలుసా మీకు..
Updated Date - May 01 , 2025 | 03:52 AM