Harish Rao: అజ్ఞానిలా రేవంత్‌రెడ్డి మాటలు
ABN, Publish Date - May 15 , 2025 | 03:23 AM
సీఎం రేవంత్ అజ్ఞానిలా మాట్లాడారని మాజీ మంత్రి హరీశ్ ఆరోపించారు. రాజకీయ నాయకుల సూచనలు పాటిస్తే ఊచలు లెక్కపెడతారని ఇంజినీర్లను హెచ్చరించడం ఏంటని నిలదీశారు.
అధికారులను ఉరితీయాలని నివేదికలు చెబుతాయా?
ఏ జ్ఞానంతో కాళేశ్వరం కూలిందంటున్నారు?: హరీశ్
హైదరాబాద్, మే 14 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్ అజ్ఞానిలా మాట్లాడారని మాజీ మంత్రి హరీశ్ ఆరోపించారు. రాజకీయ నాయకుల సూచనలు పాటిస్తే ఊచలు లెక్కపెడతారని ఇంజినీర్లను హెచ్చరించడం ఏంటని నిలదీశారు. కొత్తగా ఉద్యోగంలో చేరుతున్నవారిలో ఉత్సాహం నింపాల్సిందిపోయి హెచ్చరికలతో భయబ్రాంతులకు గురిచేయడం ముఖ్యమంత్రికి తగదన్నారు. రేవంత్ రోజురోజుకూ సీఎం పదవికి ఉన్న గౌరవాన్ని దిగజార్చుతున్నారని మండిపడ్డారు. అధికారులను ఉరితీయాలని విజిలెన్స్, ఎన్డీఎ్‌సఏ నివేదికలు చెబుతాయా? ఇది ప్రజాస్వామ్యమా? రేవంత్ రాచరిక రాజ్యమా? అని బుధవారం ఎక్స్‌లో హరీశ్ ప్రశ్నించారు.
ఇంత అజ్ఞానం ఉన్న వ్యక్తి సోమాలియా నుంచి అమెరికా వరకు ఎక్కడా కనిపించరని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందించినట్లు అసెంబ్లీ సాక్షిగా విడుదల చేసిన శ్వేతపత్రంలోనే ప్రకటించారని.. మళ్లీ ఇప్పుడు 50 వేల ఎకరాలకు కూడా నీళ్లివ్వలేదంటూ గోబెల్స్ ప్రచారం చేస్తున్నారన్నారు. రాజకీయాలు మాట్లాడడం తప్ప, కుప్పకూలిన ఎస్‌ఎల్‌బీసీ భవితవ్యం గురించి ఒక్కమాట కూడా ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు. బీఆర్‌ఎస్ హయాంలో రూ.3900 కోట్లతో 12 కిలోమీటర్ల సొరంగం పనులు పూర్తి చేసింది వాస్తవం కాదా? ముఖ్యమంత్రి దీనిపై చర్చకు సిద్ధమా? అని హరీశ్ సవాల్ విసిరారు.
Updated Date - May 15 , 2025 | 03:23 AM