Harish Rao: కన్నెపల్లి నుంచి నీళ్లివ్వండి మేడిగడ్డ పిల్లర్లు కుంగాయన్న సాకు వద్దు
ABN, Publish Date - Jul 07 , 2025 | 02:17 AM
మేడిగడ్డ బ్యారేజీలో రెండు పిల్లర్లు కుంగినాయన్న సాకుతో కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తాన్ని పడావు పెట్టారు. కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు తీసుకునే అవకాశం ఉంది.
రాష్ట్ర రైతాంగానికి నీళ్లిచ్చి ఆదుకోవాలి
లేదంటే కేసీఆర్ ఆధ్వర్యంలో నీటి మోటార్లను నడిపిస్తాం
అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు బాగానే ఉన్నాయని ఉత్తమ్ చెప్పారు
నీళ్ల విలువ తెలియని పాలకుల వల్లే ఇబ్బందులు: హరీశ్ రావు
హైదరాబాద్, జూలై 6(ఆంధ్రజ్యోతి): ‘‘మేడిగడ్డ బ్యారేజీలో రెండు పిల్లర్లు కుంగినాయన్న సాకుతో కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తాన్ని పడావు పెట్టారు. కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు తీసుకునే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఇంజనీర్లే చెప్తున్నారు. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని మోటర్లు ఆన్ చేయకుండా రైతులను గోస పెడుతోంది. ఇప్పటికైనా స్పందించి తక్షణమే కన్నెపల్లి, కల్వకుర్తి పంపులను ఆన్ చేసి రైతులకు నీళ్లు ఇవ్వాలి. లేకపోతే కేసీఆర్ నాయకత్వంలో లక్షలాది మంది రైతులందరం కలిసి మోటర్లు ఆన్ చేస్తాం’’ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు హెచ్చరించారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 36 రోజుల క్రితమే శ్రీశైలానికి వరద మొదలవ్వగా.. ఇప్పటికీ కల్వకుర్తి మోటార్లను నడపడం లేదని మండిపడ్డారు. కళ్లముందు నీళ్లు పోతుం టే పట్టించుకోని ప్రభుత్వం తీరు నేరపూరితంగా ఉందన్నారు. పదే పదే తాను పాలమూరు బిడ్డను అని చెప్పుకునే ముఖ్యమంత్రి, అక్కడి రైతుల కడుపు కొడుతున్నారని మండిపడ్డారు. గత ఏడాది ఆ ప్రాంత రైతులకు క్రాప్ హాలిడే ప్రకటించి ఆంధ్రలో మూడో పంటకు నీళ్లు వదిలారని, ఈసారీ ఆంధ్రకు నీళ్లొదిలే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత కృష్ణా జల్లాలో అతి తక్కువ నీళ్లు వాడుతున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వమేనని, చంద్రబాబుతో రేవంత్‌కు ఉన్న చీకటి ఒప్పందం ఏంటో చె ప్పాలని డిమాండ్ చేశారు. నీళ్ల విలువ తెలిసిన నాయకుడు ముఖ్యమంత్రిగా ఉంటే ఆ నీళ్లను మలుపుకొనే ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటారని చెప్పారు. కానీ నీళ్ల విలువ తెలియని నాయకులు మన పాలకులుగా ఉండటం వల్ల రైతాంగం తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నదని దుయ్యబట్టారు. గతంలో కోదండరాం అడిగిన ప్రశ్నకు, అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ సమాధానమిస్తూ.. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు బాగానే ఉన్నాయని చెప్పారని గుర్తుచేశారు. మరి ఆ బ్యారేజీల్లోకి నీరు ఎత్తిపోసి రైతులకు అందించడానికి ప్రభుత్వానికున్న ఇబ్బందులేంటని ప్రశ్నించారు. రోజు కు రెండు టీఎంసీల నీళ్లను కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి తెచ్చుకునే అవకాశం ఉందని, ఈరోజు కాళేశ్వ రం మోటర్లు ప్రారంభించినా.. 15జిల్లాలకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు బీఆర్‌ఎ్‌సపై బురద జల్లడంలోనే పోటీపడుతున్నారని, రైతులకు సాగునీటిని అందించాలన్న అంశంపై దృష్టి పెట్టడం లేదని ఆయన విమర్శించారు.
Updated Date - Jul 07 , 2025 | 02:17 AM