Banakacherla Project: బనకచర్లకు బ్రేక్!
ABN, Publish Date - Jul 01 , 2025 | 04:36 AM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుకు తాత్కాలికంగా బ్రేక్ పడింది! దీనికి పర్యావరణ అనుమతి కోసం..
ప్రాజెక్టు పర్యావరణ అనుమతికి విధి విధానాలు జారీ చేయలేం
అంతర్రాష్ట్ర అంశాలు ఇమిడి ఉన్నందున టీవోఆర్ నిర్ణయించలేం
గోదావరి ట్రైబ్యునల్ నిబంధనల ఉల్లంఘనపై ఫిర్యాదులొచ్చాయి
వరద జలాల లభ్యతపై సమగ్రంగా అంచనా వేయాల్సి ఉంటుంది
ఇందుకు సీడబ్ల్యూసీని సంప్రదించండి.. ఆమోదం తర్వాతే రండి
ఏపీ సర్కారుకు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖకు చెందిన
నిపుణుల మదింపు కమిటీ స్పష్టీకరణ.. ప్రతిపాదన వెనక్కి
ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి ఇవ్వరాదంటూ కేంద్రానికి
గతంలో సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ లేఖలు, వినతిపత్రం
న్యూఢిల్లీ, హైదరాబాద్, జూన్ 30 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుకు తాత్కాలికంగా బ్రేక్ పడింది! దీనికి పర్యావరణ అనుమతి కోసం అవసరమైన విధివిధానాలు (టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్) జారీ చే సేందుకు కేంద్ర అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖకు చెందిన నిపుణుల మదింపు కమిటీ (ఈఏసీ) నిరాకరించింది. ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలా!? వద్దా!? అనే విషయమై కేంద్ర జల సంఘమే (సీడబ్ల్యూసీ) తుది నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. అంతర్రాష్ట్ర అంశాలు ఇమిడి ఉన్నందున ప్రాజెక్టు అంచనాకు టీవోఆర్ (టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్) నిర్ణయించలేమని చెబుతూ ప్రతిపాదనను వెనక్కి పంపింది. బనకచర్ల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి తీసుకోవడానికి వీలుగా టీవోఆర్ జారీ చేయాలని కోరుతూ జూన్ 5న ఏపీ దరఖాస్తు పెట్టుకోగా.. దీనిపై జూన్ 17న ఈఏసీ (రివర్ వ్యాలీ, హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్) చైర్మన్ జి.జె.చక్రపాణి అధ్యక్షతన సమావేశం జరిగింది. దీనిపై విస్తృతంగా చర్చించిన అనంతరం ఈ ప్రాజెక్టుకు టీవోఆర్‌ను జారీ చేయలేమని నిర్ణయిస్తూ సోమవారం సమావేశపు మినిట్స్‌ను విడుదల చేసింది.
పోలవరం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇప్పటికే లభించినా.. ఒడిసా, ఛత్తీ్‌సగఢ్ రాష్ట్రాల్లో ముంపునకు సంబంధించిన అంశాలతో అది న్యాయ పరిధిలో ఉందని, గోదావరి నదీ జలాల వివాదాల ట్రైబ్యునల్ నిబంధనలను బనకచర్ల ప్రాజెక్టు ఉల్లంఘించవచ్చంటూ తమకు ఈ మెయిల్ ద్వారా పలు ఫిర్యాదులు వచ్చాయని, ఈ నేపథ్యంలో వరద జలాల లభ్యతకు సంబంధించి సీడబ్ల్యూసీతో సంప్రదించి సమగ్రంగా అంచనా వేయవలసి ఉంటుందని ఈఏసీ అభిప్రాయపడింది. అంతర్రాష్ట్ర అంశాలను పరిశీలించేందుకు, అవసరమైన అనుమతులు మంజూరు చేసేందుకు కేంద్ర జల సంఘాన్ని సంప్రదించాలని, సీడబ్ల్యూసీ ఆమోదం తర్వాతే పర్యావరణ అంచనా కోసం టీవోఆర్‌ను రూపొందించే విషయంలో తమను సంప్రదించాలని నిపుణుల కమిటీ ఆంధ్రప్రదేశ్ సర్కారుకు సూచించింది. నిజానికి, కరువు పీడిత రాయలసీమ ప్రాంతానికి సాగు, తాగునీటిని అందించడానికి వీలుగా ఏపీ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టును ప్రతిపాదించిన విషయం తెలిసిందే. పోలవరం ప్రాజెక్టు కుడి కాల్వకు సమాంతరంగా మరో కాల్వను తవ్వి.. 90-120 రోజుల్లో 200 టీఎంసీల నీటిని తరలించడం ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. ఈ కాల్వ ద్వారా తొలుత నీటిని పోలవరం నుంచి కాల్వ ద్వారా ప్రకాశం బ్యారేజీకి తీసుకొస్తారు. అక్కడి నుంచి నాగార్జున సాగర్ కుడి కాల్వ మీదుగా పల్నాడు జిల్లాలో 173 టీఎంసీలతో నిర్మించతలపెట్టిన బొల్లాపల్లి రిజర్వాయర్‌కు తీసుకెళతారు.
అక్కడి నుంచి బనకచర్ల క్రాస్ రెగ్యులేటరీకి తరలించాలనేది ప్రాజెక్టు ప్రతిపాదన. రూ.81,900 కోట్లతో నిర్మించనున్న ఈ ప్రాజెక్టు ద్వారా 3 లక్షల హెక్టార్ల కొత్త ఆయకట్టుకు నీరు అందించడం, 9.14 లక్షల హెక్టార్ల ఆయకట్టును స్థిరీకరించడం, 80 లక్షల మందికి తాగునీటితోపాటు 20 టీఎంసీలను పారిశ్రామిక అవసరాలకు అందించాలని ప్రతిపాదించారు. అయితే, బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణలో అధికార, విపక్షాల మధ్య యుద్ధమే జరిగింది. దాంతో, ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీనికి పర్యావరణ అనుమతికి ఉద్దేశించిన టీవోఆర్‌ను జారీ చేయరాదని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, నీటిపారుదల శాఖ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కేంద్ర అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌కు లేఖ రాశారు. ఢిల్లీకి వెళ్లి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌ను కలిసి కూడా లేఖ ఇచ్చారు. కేంద్ర పర్యావరణ శాఖకు పలు విజ్ఙప్తులు చేశారు. ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తెలంగాణ గత కొన్ని రోజులుగా అనేక రూపాల్లో పోరాటం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే, ఈఏసీ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. గోదావరి బేసిన్‌లోని వరద జలాలను అదే రాష్ట్రంలోని కరువు పీడిత బేసిన్లకు తరలించడానికి ఈ ప్రాజెక్టును ప్రతిపాదించారని, కానీ, నీటి లభ్యతపై అంతర్రాష్ట్ర అభ్యంతరాలు ఉండటంతో కేంద్ర జలవనరుల సంఘం (సీడబ్ల్యూసీ) నుంచి తగిన అనుమతులు తీసుకోవాలని ఈఏసీ స్పష్టం చేసింది.
Updated Date - Jul 01 , 2025 | 04:36 AM