Rural Roads: రహదారులకు మహర్దశ
ABN, Publish Date - Jun 06 , 2025 | 03:16 AM
గ్రామీణ రహదారులపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. గత కొన్నేళ్లుగా రహదారుల నిర్వహణకు నిధులు కేటాయించకపోవడంతో ప్రస్తుతం రహదారుల పరిస్థితి అధ్వాన్నంగా ఉన్న సంగతి తెలిసిందే.
రూ.33,194 కోట్ల వ్యయంతో 13,137 కి.మీ. మేర రోడ్ల నిర్మాణానికి క్యాబినెట్ ఆమోదం
గ్రామాల నుంచి మండల కేంద్రాలకు బీటీ రోడ్డు
మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు డబుల్ రోడ్డు
అక్కణ్నుంచీ రాజధాని నగరానికి 4 వరసల రోడ్డు
హైదరాబాద్, జూన్ 5(ఆంధ్రజ్యోతి): గ్రామీణ రహదారులపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. గత కొన్నేళ్లుగా రహదారుల నిర్వహణకు నిధులు కేటాయించకపోవడంతో ప్రస్తుతం రహదారుల పరిస్థితి అధ్వాన్నంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. సమస్య తీవ్రంగా ఉన్న చోట్ల మరమ్మతులు, కొత్త రహదారుల నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని గురువారం నిర్వహించిన మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. హైబ్రీడ్ యున్యుటీ మోడల్ (హ్యామ్)లో వీటిని చేపట్టనున్నారు. 40 శాతం ప్రభుత్వ, 60ు ప్రైవేటు భాగస్వామ్యంతో వీటిని రానున్న రెండున్నరేళ్లల్లో పూర్తి చేయనున్నారు. పెట్టుబడులు పెట్టిన ప్రైవేటు సంస్థలకు నిర్వహణ వ్యవధి 15 సంవత్సరాలుగా ఖరారు చేశారు.
ప్రతి గ్రామం నుంచి మండల కేంద్రానికి బీటీ రోడ్డు, అలాగే ప్రతి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్లతో అనుసంధానం, జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్‌కు నాలుగు లేన్ల రహదారులు చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు. మొదటి దశలో హ్యామ్ పద్ధతిలో మొత్తం రూ.33,194 కోట్ల వ్యయంతో 13,137 కిలోమీటర్ల మేర రోడ్లు నిర్మించాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. రూ.16,414 కోట్లతో 5,190 కిలోమీటర్ల మేర ఆర్ అండ్ బీ రోడ్లు.. రూ.16,780 కోట్లతో 7,947 కిలోమీటర్ల మేర పంచాయతీరాజ్ పరిధిలో రహదారులు నిర్మించనున్నారు. వీటి పనులు వెంటనే ప్రారంభించి 2027 చివరికల్లా పూర్తిచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 15సంవత్సరాల పాటు ఈ రహదారుల నిర్వహణ (గుంతలు పూడ్చడం, లైటింగ్‌ఏర్పాటు, ప్రమాద సంకేతాల ఏర్పాటులాంటి) పనులు ప్రైవేటు సంస్థ చేపట్టాల్సి ఉంటుంది. ఈ నిర్ణయంతో.. ప్రజలకు రహదారుల సమస్య నుంచి ఉపశమనం కలుగుతుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి.
Read Latest Telangana News and National News
Updated Date - Jun 06 , 2025 | 03:16 AM