Godavari Floods: ఈ సారీ గోదారి సముద్రం పాలేనా
ABN, Publish Date - May 14 , 2025 | 03:52 AM
ఈసారి గోదావరి వరదలు మేడిగడ్డను మళ్లీ ముంచే అవకాశముందా అనే సందేహం వేగంగా వినిపిస్తోంది. ఎన్‌డీఎస్‌ఏ నివేదిక వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్డ మరమ్మతులకు ముందడుగు వేయకపోవడం విమర్శలకు దారితీస్తోంది.
ఎన్‌డీఎస్ఏ నివేదిక అందినా మేడిగడ్డకు మరమ్మతులు ప్రారంభించని సర్కారు
అన్నారం, సుందిళ్లలో నీటి నిల్వ ఇబ్బందే
మరో 2 నెలల్లో ప్రాజెక్టులకు వరదలు
తుమ్మిడిహెట్టిని కడతామని మ్యానిఫెస్టోలో ప్రకటించిన కాంగ్రెస్
17 నెలలైనా ఒక్క అడుగు పడని వైనం
హైదరాబాద్, మే 13 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాణహిత-చేవెళ్ల ఎత్తిపోతల పథకంలో తుమ్మిడిహెట్టి బ్యారేజీని నిర్మిస్తుందా? కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజీని జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ(ఎన్‌డీఎ్‌సఏ) నివేదిక ప్రకారం పునరుద్ధరిస్తుందా? మరమ్మతులు చేసి, మళ్లీ వినియోగంలోకి తెస్తుందా? అనేది అంతుచిక్కని ప్రశ్న గా మారింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 17 నెలలు గడుస్తున్నా తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణ దిశగా ఒక్క అడుగు కూడా పడలేదు. ఇక, కాళేశ్వరంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై ఎన్‌డీఎ్‌సఏ నివేదిక వచ్చిన తర్వాత తదుపరి అడుగులు వేయాలని భావించారు. తగిన పరిశోధనలు చేసి, పునరుద్ధరణ/మరమ్మతులకు కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ) ఆమోదం తీసుకొని, పనులు చేపట్టాలని ఎన్‌డీఎ్‌సఏ సిఫారసు చేసింది. 2 నెలల్లో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులకు వరదలు వస్తే నవంబరు దాకా మరమ్మత్తుకు అవకాశం ఉండదు. ఈ సీజన్‌లో కూడా కాళేశ్వరంలోని కీలక బ్యారేజీలు నిరుపయోగంగా మిగిలే ప్రమాదం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రూ.లక్ష కోట్లకు పైగా వెచ్చించగా.. అందులో లింక్-1లో ఉన్న సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీలు, పంప్‌హౌస్‌లు తప్ప మిగిలిన బ్యారేజీలు, పంప్‌హౌస్‌లు బాగానే ఉన్నాయి. వీటిని ప్రభావవంతంగా వాడుకోవాలంటే ప్రత్యామ్నాయంగా తుమ్మిడిహెట్టిపై దృష్టి పెట్టాల్సిందేనని నిపుణులు సూచిస్తున్నారు.
ఇదే సరైన సమయం
కాళేశ్వరం పథకంలో అదనపు టీఎంసీకి సంబంధించి సవరణ డీపీఆర్‌ను సమగ్ర వివరాలతో మళ్లీ సమర్పించాలని సీడబ్ల్యూసీ ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. దీన్ని అవకాశంగా తీసుకొని కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో తుమ్మిడిహెట్టి బ్యారేజీని కొత్తగా చేర్చి సమగ్ర డీపీఆర్‌ను సమర్పించడానికి ప్రభుత్వానికి వీలు దొరికినా నిర్ణయం తీసుకోక పోవటం విమర్శలకు కారణమవుతోంది.
మరమ్మతులకు ఏడాదైనా పడుతుంది
మేడిగడ్డకు మరమ్మతులు/పునరుద్ధరణ పనుల కుఏడాదిపైగా సమయం కావాల్సిందే. ఈ బ్యారేజీ లో ఏడో బ్లాకు కుంగిన ప్రభావం 6, 8 బ్లాకులపై కూడా పడినట్లు గుర్తించిన నీటిపారుదల శాఖ నిపుణులు.. వాటి 32 పిల్లర్లు కొత్తగా కడితేనే బ్యారేజీ పూరిగా అందుబాటులోకి వస్తుందని చెప్తున్నారు. దీనికి దాదాపు ఏడాది పట్టనుంది. ఆ లోపు మేడిగడ్డ ఎగువన రబ్బర్‌డ్యామ్/ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తే కన్నెపల్లి(మేడిగడ్డ) పంప్‌హౌస్ నుంచి అన్నారం, సిరిపురం(అన్నారం) పంప్‌హౌస్ నుంచి సుందిళ్ల బ్యారేజీలోకి నీటిని పంపింగ్ చేయవచ్చు.
కాళేశ్వరంలో ఏటా ఏదో ఒక సమస్య
మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాకు కుంగిపోగా ఒక గేటును ఇప్పటికే కత్తిరించి తొలగించారు. దీంతో ఇక్కడ నీటి నిల్వకు అవకాశం లేదు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు పాక్షిక మరమ్మతులతో నీటి నిల్వకు వీలుంది. అయితే, ఈ రెండు బ్యారేజీలతో పోల్చితే మేడిగడ్డకు భారీగా వరద వస్తుంది. అన్నారం, సుందిళ్లలు ప్రధాన గోదావరిపై ఉండగా... ప్రాణహిత కలిసిన తర్వాత మేడిగడ్డ ఉంది. దీనికి ఏటా 20 లక్షల క్యూసెక్కులకు పైగా వరద దీనికి వస్తోంది. కాగా, కాళేశ్వరం ప్రాజెక్టులో ఏటా ఏదో సమస్య ఏర్పడుతోంది. 2022 జూలైలో కన్నెపల్లి(మేడిగడ్డ), సిరిపురం(అన్నారం) పంప్‌హౌ్‌సలు నీట మునిగాయి. కన్నెపల్లి పంప్‌హౌస్ పూర్తిగా ధ్వంసమైంది. ఆ తర్వాత 2023 అక్టోబరులో మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాకు కుంగింది. ఆ బ్యారేజీలో నీటి నిల్వ ఏ మాత్రం సురక్షితం కాదని ఎన్‌డీఎ్‌సఏ తేల్చడంతో బ్యారేజీని పూర్తిగా ఖాళీ చేసేశారు. ఆ వెనువెంటనే అన్నారం, సుందిళ్లలో భారీగా సీపేజీలు బయటపడ్డాయి.
Updated Date - May 14 , 2025 | 03:53 AM