Former Vaira MLA: వైరా మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్ హఠాన్మరణం
ABN, Publish Date - May 28 , 2025 | 04:56 AM
వైరా మాజీ ఎమ్మెల్యే బాణోతు మదన్‌లాల్ గుండెపోటుతో మంగళవారం హఠాన్మరణం పాలయ్యారు. ఇటీవల ఆసుపత్రిలో చేరిన ఆయన తీరాజు తీవ్ర అస్వస్థతకు గురై తుదిశ్వాస విడిచారు.
గుండెపోటుతో కన్నుమూత
వైరా, మే 27 (ఆంధ్రజ్యోతి): ఖమ్మం జిల్లా వైరా మాజీ ఎమ్మెల్యే బాణోతు మదన్‌లాల్ (62) మంగళవారం ఉదయం హఠాన్మరణం పాలయ్యారు. హైదరాబాద్‌లో నివసిస్తున్న మదన్‌లాల్‌కు ఈ నెల 23న తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఏఐజీ ఆస్పత్రిలో చేర్చారు. సోమవారం వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యు లు.. 2 రోజుల అబ్జర్వేషన్ తర్వాత డిశ్చార్జీ చేస్తామని చెప్పారు. మంగళవారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురైన మదన్‌లాల్ గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన మృతదేహాన్ని ఖమ్మం తరలించారు. 2014-18 మధ్య వైరా ఎమ్మెల్యేగా పనిచేసిన మదన్‌లాల్‌కు భార్య మంజుల, కుమారుడు మృగేందర్ లాల్, కూతురు మనీషా లక్ష్మి ఉన్నారు. కొడుకు మృగేందర్ లాల్, కోడలు శ్వేత ఐఎఎస్ అధికారులుగా తమిళనాడులోని కోయంబత్తూర్‌లో పని చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలోని రఘునాథపాలెం మండలం ఈర్లపూడిలో 1963 మే మూడో తేదీన జన్మించిన మదన్‌లాల్.. 1983 నుంచి 85 వరకూ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసి రాజీనామా చేశారు. 1995లో ఎంపీటీసీగా గెలుపొందినా. కొద్ది కాలానికే రాజీనామా చేసి ఈర్లపూడి సర్పంచ్‌గా 1996-2001, 2006- 2011 వరకూ కొనసాగారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014లో సీపీఎం మద్దతుతో వైసీపీ అభ్యర్థిగా విజయం సాధించి.. తదనంతర పరిణామాల్లో బీఆర్‌ఎ్‌సలో చేరారు. 2018, 2023 ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.
ముఖ్యమంత్రి సంతాపం
బానోత్ మదన్ లాల్ మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థించారు. మం త్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కేంద్ర మాజీ మంత్రి- ఎంపీ రేణుకా చౌదరి, తదితరులు సంతాపం తెలిపారు.
Updated Date - May 28 , 2025 | 04:58 AM