కర్రెగుట్ట కూడా.. నక్సల్బరీ అంత చరిత్రాత్మకమే
ABN, Publish Date - May 23 , 2025 | 06:06 AM
దాదాపు ఐదు దశాబ్దాల క్రితం 1967 మేలో నక్సల్బరీలో జన్మించిన నక్సలైట్ ఉద్యమం ఎంత చరిత్రాత్మకమో.. కర్రెగుట్టలో జరిగిన నక్సల్స్ నిర్మూలన ఉద్యమం కూడా అంతే చరిత్రాత్మకం
5 దశాబ్దాల ఉద్యమం ఇప్పుడు ఆవశ్యకతను కోల్పోయింది
తెలంగాణ కేడర్ ఐపీఎస్ అధికారి సుదీప్ లఖ్తాకియా వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, మే 22 (ఆంధ్రజ్యోతి): దాదాపు ఐదు దశాబ్దాల క్రితం 1967 మేలో నక్సల్బరీలో జన్మించిన నక్సలైట్ ఉద్యమం ఎంత చరిత్రాత్మకమో.. కర్రెగుట్టలో జరిగిన నక్సల్స్ నిర్మూలన ఉద్యమం కూడా అంతే చరిత్రాత్మకం, కవితాత్మకంగా భావిస్తానని తెలంగాణ కేడర్ ఐపీఎస్ అధికారి, జాతీయ భద్రతా గార్డు(ఎన్‌ఎ్‌సజీ) బ్లాక్ కమాండో దళం మాజీ డైరెక్టర్ జనరల్ సుదీప్ లఖ్తాకియా అన్నారు. నక్సల్స్ ఏరివేతలో ఎంతో అనుభవం ఉన్న ఆయన.. ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో పనిచేశారు. నక్సల్స్ నిర్మూలనకు ప్రత్యేకంగా ఏర్పర్చిన గ్రే హౌండ్స్‌కు సారథ్యం వహించారు. సీఆర్‌పీఎస్ ప్రత్యేక డీజీగా బాధ్యతలు నిర్వర్తించారు. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శితో పాటు అనేక మంది నక్సల్స్ మరణించడం ఐదు దశాబ్దాల ఉద్యమానికి తీవ్ర విఘాతమని ఆయన పేర్కొన్నారు. సమకాలీన ప్రపంచంలో ఆధునిక భారతంలో పూర్తిగా ఆవశ్యకత కోల్పోయిన ఒక సిద్దాంతానికి మృత్యుఘంటికలు ధ్వనిస్తున్నాయని తెలిపారు.
ప్రస్తుత పరిస్థితుల్లో అధికారం తుపాకి గొట్టం ద్వారా రాదని.. పరిజ్ఞానం, టెక్నాలజీ మాత్రమే మన ప్రజలు, సమూహాల తలరాతల్ని నిర్ణయించగలదని లఖ్తాకియా అభిప్రాయపడ్డారు. ఈ ఐదు దశాబ్దాల హింసాత్మక మార్గంలో ఎందరో అమాయక ప్రజలు తమ జీవితాల్ని కోల్పోవడం విషాదకరమని ఆవేదన వెలిబుచ్చారు. కాగా.. మొదట్లో మావోయిజాన్ని ఎదుర్కోవడంలో వ్యూహపరమైన తప్పిదాలు కొన్ని జరిగాయని లఖ్తాకియా అన్నారు. నక్సల్స్ ఉద్యమ రూపాన్ని అర్థం చేసుకోవడంలో, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఐక్యతలో, ఇంటెలిజెన్స్ సేకరణలో ఈ తప్పిదాలు జరిగాయని పేర్కొన్నారు. మావోయిస్టు ఉద్యమ రహస్య స్వభావాన్ని అర్థం చేసుకోవడంలో కూడా ఆలస్యం జరిగిందని.. రహస్యం వల్లనే ఆ సంస్థ ఉనికిలో కొనసాగిందని ఆయన అన్నారు. అందులో వ్యక్తులు ఎన్నో అలియాస్ పేర్లతో పనిచేస్తారని.. వారిని గుర్తించడానికి ప్రత్యేక ఇంటలిజెన్స్ ఆపరేషన్ అవసరమని.. గతంలో ఈ ఆపరేషనల్ ఇంటెలిజెన్స్ వల్లనే గ్రేహౌం డ్స్ విజయాలు సాధించిందని ఆయన చెప్పారు.
Updated Date - May 23 , 2025 | 06:06 AM