ఇచ్చంపల్లి కోసం మరో పాదయాత్రకు సిద్ధం
ABN, Publish Date - Jun 26 , 2025 | 04:47 AM
రాష్ట్ర ప్రజలకు ఎంతో ఉపయోగకరమైన ఇచ్చంపల్లి ప్రాజెక్టు కోసం మరో పాదయాత్ర చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని మాజీ గవర్నర్, కేంద్ర మా జీ మంత్రి చెన్నమనేని విద్యాసాగర్‌రావు తెలిపారు.
ఆ ప్రాజెక్టుతో రాష్ట్ర ప్రజలకు ఎంతో ఉపయోగం
మాజీ గవర్నర్, కేంద్ర మాజీ మంత్రి విద్యాసాగర్‌రావు
ఎమర్జెన్సీ చీకటి నిర్ణయం, ప్రజలపాలిట శాపమని వ్యాఖ్య
కరీంనగర్, జూన్ 25 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రాష్ట్ర ప్రజలకు ఎంతో ఉపయోగకరమైన ఇచ్చంపల్లి ప్రాజెక్టు కోసం మరో పాదయాత్ర చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని మాజీ గవర్నర్, కేంద్ర మా జీ మంత్రి చెన్నమనేని విద్యాసాగర్‌రావు తెలిపారు. కరీంనగర్ నుంచే ఏదైనా మొదలవుతుందని, ఇక ముందు ఏ ఉద్యమం మొదలుపెట్టినా ముందుండి నడిపిస్తానని ప్రకటించారు. కరీంనగర్‌లో బుధవారం నిర్వహించిన ఎమర్జెన్సీ వ్యతిరేక దినం సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన విద్యాసాగర్‌రావు ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో ఇచ్చంపల్లి ప్రాజెక్టు కోసం పాదయాత్ర చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. గోదావరిపై ఇచ్చంపల్లి ప్రాజెక్టు నిర్మిస్తే రాష్ట్ర ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. కాగా, అధికారాన్ని కాపాడుకునేందుకు ఇందిరా గాంధీ 1975, జూన్ 25న దేశంలో ఎమర్జెన్సీ విధించారని, అది ప్రజాస్వామ్యానికి సంకెళ్లు వేసి చీకటి అధ్యాయానికి తెరలేపిన రోజు అని అన్నారు. ఎమర్జెన్సీ అనే చీకటి నిర్ణయం 21 నెలల పాటు దేశ ప్రజల పాలిట శాపమైందన్నారు.
ఎన్నికల్లో ఇందిరాగాంధీపై ఓడిన రాజ్‌నారాయణ 1975లో అలహాబాద్ కోర్టులో కేసు దాఖలు చేయగా.. ఆరేళ్ల పాటు ఇందిరాగాంధీపై ఎన్నికల్లో పాల్గొనకుండా న్యాయస్థానం నిషేదం విధించిందని తెలిపారు. ఆ తీర్పును జీర్ణించుకోలేక ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించారన్నారు. దీంతో ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కులన్నీ రద్దయ్యాయని, డిఫెన్స్ ఆఫ్ ఇండియా రూల్స్, మెయింటెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ (మీసా) వంటి చట్టాలతో ఎంతటి వారినైనా కటకటాల్లోకి నెట్టారని తెలిపారు. లక్షలాది మందికి కుటుంబ నియంత్ర ఆపరేషన్లు చేయించారన్నారు. అత్యాచారాలకు ఎమర్జెన్సీ కేరాఫ్ అడ్ర్‌సగా మారిందని తెలిపారు. రాజ్యాంగాన్ని తన స్వార్థం కోసం ఇంధిరాగాంధీ వాడుకున్నారన్నారు. ఎన్నో సవరణలుచేసి లౌకికవాదాన్ని రాజ్యాంగంలో చేర్చారన్నారు. ఎవరూ ఊహించని విధంగా ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందని, సెప్టెంబరు 17న విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభు త్వం అధికారికంగా నిర్వహించాలని విద్యాసాగర్ రా వు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, నాయకులు బాస సత్యనారాయణరావు, సునీల్‌రావు, డి శంకర్ పాల్గొన్నారు.
Updated Date - Jun 26 , 2025 | 04:47 AM