ఉద్యోగాలు ఇప్పిస్తానని రూ.17 లక్షలు వసూలు
ABN, Publish Date - Jun 13 , 2025 | 04:14 AM
చదివింది ఏడో తరగతి.. కానీ తాను నీటి పారుదలశాఖ మేనేజర్‌నని చెప్పుకున్నాడు ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా ధర్మవరం వాసి మాదిన్నె కృష్ణ అలియాస్ వేణుగోపాల్‌రెడ్డి.
నిందితుడు ఏపీలోని అనంతపురం జిల్లా వాసి అరెస్టు.. రూ.8 లక్షల నగదు స్వాధీనం
దేవరకొండ, జూన్ 12 (ఆంధ్రజ్యోతి): చదివింది ఏడో తరగతి.. కానీ తాను నీటి పారుదలశాఖ మేనేజర్‌నని చెప్పుకున్నాడు ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా ధర్మవరం వాసి మాదిన్నె కృష్ణ అలియాస్ వేణుగోపాల్‌రెడ్డి. 2021లో నల్లగొండ జిల్లా దేవరకొండకు వచ్చిన మాదిన్నె కృష్ణ.. స్థానిక బీఎన్‌ఆర్ కాలనీలో ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. తాను డిండి ప్రాజెక్టు మేనేజర్‌నని, ఉద్యోగాలిప్పిస్తానని అదే కాలనీ వాసులు మూడావత్ స్వాతి, షేక్ తబ్రేజ్‌లను నమ్మించి రూ.17 లక్షలు వసూలు చేశాడు. మూడేళ్లయినా ఉద్యోగం రాకపోవడంతో బాధితులు అనుమానంతో ప్రశ్నించడంతో ఇటీవలే ఇంటికి తాళం వేసి పరారయ్యాడు.
మోసపోయామని గ్రహించిన బాధితులు గత మార్చి ఒకటో తేదీన దేవరకొండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సీఐ నర్సింహులు ఆధ్వర్యంలో గాలింపు చేపట్టిన దేవరకొండ పోలీసులు.. అనంతపురంలో నిందితుడ్ని అరెస్టు చేసి, అతడి వద్ద రూ.8 లక్షలు రికవరీ చేసినట్లు ఏసీపీ మౌనిక గురువారం మీడియాకు చెప్పారు. పరారైన మాదిన్నె కృష్ణ భార్యది ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం. కొద్ది రోజులు అక్కడే నివాసం ఉన్న కృష్ణ కుటుంబం.. చిట్టీలు నిర్వహించి ఖాతాదారులకు నగదు చెల్లించలేదన్న ఆరోపణలున్నాయి. అనంతపురం, కొణిజర్లలోనూ ఉద్యోగాలిప్పిస్తానని నమ్మించి పలువురి నుంచి నగదు వసూలు చేసిన కృష్ణపై చీటింగ్ కేసు నమోదైందని ఏసీపీ మౌనిక తెలిపారు.
Updated Date - Jun 13 , 2025 | 04:14 AM