EAPCET: ఎప్‌సెట్ కౌన్సెలింగ్‌లో అభ్యర్థుల అప్‌సెట్!
ABN, Publish Date - Jul 04 , 2025 | 03:51 AM
ఇంజనీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రక్రియలో ఏర్పడిన అవాంతరాలతో ఎప్‌సెట్ అభ్యర్థులు అప్‌సెట్ అవుతున్నారు. సర్వర్ సమస్యలతో సతమతమవుతున్నారు.
సర్వర్ డౌన్.. నిలిచిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్
సాంకేతిక విద్యాశాఖ తీరుపై ఆగ్రహం
హైదరాబాద్ సిటీ, జూలై 3 (ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రక్రియలో ఏర్పడిన అవాంతరాలతో ఎప్‌సెట్ అభ్యర్థులు అప్‌సెట్ అవుతున్నారు. సర్వర్ సమస్యలతో సతమతమవుతున్నారు. రెండ్రోజులుగా సర్వర్ డౌన్ కావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 36 హెల్ప్‌లైన్ కేంద్రాల్లో ధ్రువపత్రాల పరిశీలన నిలిచిపోయింది. సుమారు గంటన్నర నుంచి రెండుగంటల పాటు సర్వర్ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో స్లాట్ బుక్ చేసుకుని కౌన్సెలింగ్ హాల్‌లోకి వెళ్లిన అభ్యర్థులు ఎంతకీ బయటకు రాలేదు. వారికోసం బయట వేచి ఉన్న తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ఈలోగా తరువాతి స్లాట్లను బుక్ చేసుకున్న అభ్యర్థులు పెద్దసంఖ్యలో హెల్ప్‌లైన్ కేంద్రాల వద్దకు రావడంతో రద్దీ ఏర్పడింది. మెయిన్ సర్వర్‌లో సమస్యలు తలెత్తినందున, తమ చేతుల్లో ఏమీ లేదని హెల్ప్‌లైన్ కేంద్రాల సిబ్బంది నిస్సహాయతను వ్యక్తం చేశారు.
సర్వర్ డౌన్‌తో వెరిఫికేషన్ ప్రక్రియ రెండుగంటల పాటు ఆలస్యం కావడంతో దూర ప్రాంతాల నుంచి సాయంత్రం వేళల్లో హెల్ప్‌లైన్ కేంద్రాలకు వచ్చిన అభ్యర్థులు తిరిగి ఇళ్లకు వెళ్లేందుకు రాత్రివేళ సరైన రవాణా సౌకర్యాలు లేక ఇక్కట్ల పాలయ్యారు. ప్రాసెసింగ్ ఫీజుల పేరిట కోట్ల రూపాయలు వసూలు చేస్తున్న సాంకేతిక విద్యాశాఖ అధికారులు సర్వర్ మెయింటెనె న్స్‌పై దృష్టి సారించకపోవడాన్ని అభ్యర్థుల తల్లిదండ్రులు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. కాగా, కౌన్సెలింగ్ ప్రక్రియను నిర్వహిస్తున్న క్యాంప్ ఆఫీసర్ శ్రీనివా్‌సను వివరణ కోరేందుకు ‘ఆంధ్రజ్యోతి’ ఫోన్ ద్వారా ప్రయత్నించగా, ఆయన అందుబాటులోకి రాలేదు.
Updated Date - Jul 04 , 2025 | 03:51 AM