Sridhar Babu: హైదరాబాద్ అభివృద్ధిలో ‘హెచ్-సిటీ’ కీలకం!
ABN, Publish Date - Jun 27 , 2025 | 03:46 AM
హైదరాబాద్ నగరాభివృద్ధిలో ‘హెచ్-సిటీ’ ప్రాజెక్ట్ కీలకమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చెప్పారు. హైదరాబాద్‌ను దేశంలోని ఇతర నగరాలకు రోల్ మోడల్‌గా నిలపాలన్నదే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యమని తెలిపారు.
బడ్జెట్‌లో 10వేల కోట్లు కేటాయించాం
ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్‌బాబు
రూ.45 కోట్లతో రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన
జూలై 10న క్యాబినెట్ భేటీ
చందానగర్, జూన్ 26 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ నగరాభివృద్ధిలో ‘హెచ్-సిటీ’ ప్రాజెక్ట్ కీలకమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చెప్పారు. హైదరాబాద్‌ను దేశంలోని ఇతర నగరాలకు రోల్ మోడల్‌గా నిలపాలన్నదే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యమని తెలిపారు. అందుకు అనుగుణంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. ‘హైదరాబాద్ ఇన్నోవేటివ్ అండ్ ఇన్‌ఫర్మేటివ్ (హెచ్-సిటీ)’ ప్రాజెక్టులో భాగంగా రూ.45 కోట్లతో ఎన్‌హెచ్-65లో చందానగర్ నుంచి అమీన్‌పూర్ వరకు చేపట్టబోయే రోడ్డు విస్తరణ పనులకు గురువారం ఆయన ఎమ్మెల్యే అరెకపూడి గాంధీతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు మాట్లాడుతూ హైదరాబాద్ అభివృద్ధికి బడ్జెట్‌లో రూ.10 వేల కోట్లకు పైగా నిధులు కేటాయించామని చెప్పారు. హైదరాబాద్‌ను ట్రాఫిక్ రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేస్తున్నామని చెప్పారు.
ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు రూ.7032 కోట్లతో ఫ్లై ఓవర్లు, అండర్‌పా్‌సలు, రోడ్ల విస్తరణ వంటి మౌలిక సదుపాయాల కల్పనకే హెచ్-సిటీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టామని తెలిపారు. ట్రాఫిక్ రద్దీని క్రమబద్ధీకరించడం, ప్రయాణ సమయాన్ని తగ్గించడం, రహదారి నెట్‌వర్క్‌ను మెరుగుపరచడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యాలని వివరించారు. ఇప్పటికే ఆర్టీసీ ఆధ్వర్యంలో 1000 ఎలక్ట్రిక్ బస్సులను నడిపించేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. వాటికి అదనంగా మరో 800 బస్సులను తీసుకురావాలని సీఎం రేవంత్‌రెడ్డి సంకల్పించారని, ఇందుకు కేంద్రం సైతం సహకరిస్తామని తెలిపిందని శ్రీధర్‌బాబు అన్నారు. నగరంలోని ట్రాఫిక్ సిగ్నళ్లను ఏఐతో అనుసంధానం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పాదచారుల భద్రతకు పెద్ద పీట వేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ అభివృద్ధిని నలువైపులకూ విస్తరిస్తామన్నారు. తమ ప్రభుత్వంపై కొందరు పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ‘‘మా లక్ష్యం, ధ్యేయం అభివృద్ధే. ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించి, సహకరించండి’’ అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఇవి కూడా చదవండి:
ఐటీ ఉద్యోగి ఆత్మహత్య కేసులో కీలక విషయాలు..
అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన..
జలహారతి కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం..
For More AP News and Telugu News
Updated Date - Jun 27 , 2025 | 03:46 AM