Chemical Laced Alcohol: కల్లు కాదది.. గరళమే
ABN, Publish Date - Jul 10 , 2025 | 04:49 AM
చెట్టు నుంచి తీసిన కల్లు యథాతథంగా తాగితే కొంతమందికి కిక్కు రాదు. దీంతో.. బాగా మత్తు రావడానికి కల్లు కాంపౌండ్ల నిర్వాహకులు క్లోరల్ హైడ్రేట్, అల్ర్పాజోలం, డైజీపాం వంటి రసాయనాలను కలుపుతున్నారు.
క్లోరల్ హైడ్రేట్, అల్ర్పాజోలం, డైజీపాం కలిపిన కల్లుతో తీవ్ర హాని
నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం, కంటి చూపు పోయే ప్రమాదం
ఊపిరితిత్తులు, కిడ్నీ, గుండె వంటి కీలక అవయవాలకు చేటు
వెంటనే చికిత్స అందించకపోతే చనిపోయే ముప్పు: వైద్యులు
హైదరాబాద్ సిటీ, జూలై 9 (ఆంధ్రజ్యోతి): చెట్టు నుంచి తీసిన కల్లు యథాతథంగా తాగితే కొంతమందికి కిక్కు రాదు. దీంతో.. బాగా మత్తు రావడానికి కల్లు కాంపౌండ్ల నిర్వాహకులు క్లోరల్ హైడ్రేట్, అల్ర్పాజోలం, డైజీపాం వంటి రసాయనాలను కలుపుతున్నారు. వాటిని కలిపిన కల్లు విషంతో సమానమేనని.. దాన్ని తాగిన వెంటనే.. ఆయా రసాయనాలు తాగినవారిఆరోగ్యంపై క్షణాల్లో ప్రభావం చూపించడం మొదలవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నరాలు, మెదడు, కిడ్నీ, ఊపిరితిత్తులు, కాలేయం, గుండె వంటి కీలక అవయవాల పనితీరును అవి దెబ్బతీస్తాయని.. కల్తీ కల్లు మోతాదు ఎక్కువైతే బాధితులు కోమాలోకి వెళ్లే ప్రమాదం కూడా ఉంటుందని.. వెంటనే చికిత్స అందించకపోతే వారి ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందని చెబుతున్నారు.
కంటి చూపు మసకతో మొదలై కోమా వరకు ..
ప్రమాదకరమైన రసాయనాలు కలిపిన కల్తీ కల్లు తొలుత కంటి చూపుపై ప్రభావం చూపుతుంది. చూపు మసకగా మారుతుంది. కల్తీ కల్లు తాగినవారిలో ఇది మొదటి లక్షణంగా గమనించాలి. ఎక్కువ మోతాదులో మిథైల్ ఆల్కహాల్ రక్తంలో కలవడంతో.. వారి మెదడుపై ప్రభావం పడుతుంది. ఈ దశలో ఫిట్స్ రావడం, మానసిక స్థితి కోల్పోవడం, పిచ్చిగా వ్యవహరించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. సమయం గడిచే కొద్దీ సమస్య తీవ్రత పెరిగి కోమాలోకి జారుకుంటారు. కల్తీ కల్లులో ఉన్న రసాయనాలు కిడ్నీలను దెబ్బతీస్తాయి. దీంతో డయాలసిస్ చేయాల్సి ఉంటుంది. ఒక్కసారి కోమాలోకి వెళితే వారిని సాధారణ స్థితికి తీసుకురావడం క్లిష్టంగా మారుతుంది. మిథైల్ ఆల్కహాల్ వల్ల అయోమయ స్థితికి చేరుకుంటారు. కడుపులో యాసిడ్ నిల్వలు పెరగడం వల్ల శ్వాస వేగం పెరిగి గుండె కొట్టుకోవడంలో మార్పులు వస్తాయి. లక్షణాలను గుర్తించి బాధితులను ఎంత త్వరగాఆస్పత్రికి తరలిస్తే అంత మంచిది.
- డాక్టర్ దుష్యంత్ జాస్తి, సీనియర్ న్యూరాలజిస్ట్, స్టార్ ఆసుపత్రి
ఊపిరితిత్తులపై ప్రభావం
క్లోరల్ హైడ్రేట్, అల్ర్పాజోలం, డైజీపాం వంటి సైకోయాక్టివ్ ముందులతో ఆరోగ్యంపై చెడు ప్రభావం ఉంటుంది. వీటిని వినియోగించడానికి అనుమతులు లేవు. ఎక్కువ మోతాదులో కల్తీ కల్లు తగ్గిన వారు వెంటనే అపస్మారక స్థితికి చేరుకుంటారు. కడుపులో ఆమ్లస్థాయిలు పెరిగి జీర్ణ వ్యవస్థలో మార్పులు చోటు చేసుకుంటాయి. కడుపులో గ్యాస్ పెరిగి వాంతులు అవుతాయి. వాంతులు అయ్యే సమయంలో బాధితులు స్పృహలో లేకపోవడంతో వాంతి ఊపిరితిత్తుల్లోకి వెళ్లే అవకాశముంది. కల్తీ కల్లు తాగి కోమాలోకి వెళితే వెంటనే వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించాలి.
- డాక్టర్ రోహన్ రెడ్డి, గ్యాస్ట్రో ఎంటరాలజస్ట్ , కిమ్స్ సన్‌షైన్ ఆసుపత్రి
ఇవి కూడా చదవండి..
వాట్సాప్‌లో రెండు కొత్త ఫీచర్స్.. వీటి స్పెషల్ ఏంటంటే..
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jul 10 , 2025 | 04:49 AM