Hyderabad: దావోస్‌లో బాబు, రేవంత్
ABN, Publish Date - Jan 21 , 2025 | 03:36 AM
స్విట్జర్లాండ్‌లోని దావో్‌సలో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం జ్యూరిక్ విమానాశ్రయంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడును కలుసుకున్నారు.
జ్యూరిక్ ఎయిర్‌పోర్టులో కలిసిన తెలుగు రాష్ట్రాల సీఎంలు
అక్కడే కొద్దిసేపు భేటీ.. పలు అంశాలపై ఇరువురి చర్చ
ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సు ప్రారంభం
తొలిరోజు ఘనంగా గ్రాండ్ ఇండియా పెవిలియన్
హైదరాబాద్, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): స్విట్జర్లాండ్‌లోని దావో్‌సలో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం జ్యూరిక్ విమానాశ్రయంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడును కలుసుకున్నారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, ఉన్నతాధికారులతో కలిసి గత నాలుగు రోజులుగా సింగపూర్‌లో పర్యటించిన సీఎం రేవంత్.. అక్కడి నుంచి దావోస్ సమావేశాల కోసం బయలుదేరి సోమవారం జ్యూరిక్ విమానాశ్రయానికి చేరుకున్నారు. మరోవైపు ఇవే సమావేశాల్లో పాల్గొనేందుకు వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు కూడా అదే సమయంలో జ్యూరిక్ విమానాశ్రయానికి చేరుకోవడంతో.. ఇద్దరు సీఎంలు అక్కడే కొద్దిసేపు భేటీ అయ్యారు.
వీరితోపాటు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు, తెలంగాణ మంత్రి శ్రీధర్‌బాబు, ఏపీ మంత్రి నారా లోకేశ్ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి, పెట్టుబడులకు సంబంధించిన అంశాలపై ఇరువురు సీఎంల మధ్య చర్చ జరిగిందని తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం సోమవారం రాత్రి ‘ఎక్స్’లో పేర్కొంది. కాగా, ఈ నెల 24 వరకు జరగనున్న ఈ సమావేశాల్లో వివిధ దేశాల నుంచి పెద్దసంఖ్యలో ప్రభుత్వ అధినేతలు, పారిశ్రామిక దిగ్గజాలు పాల్గొంటున్నారు. తొలిరోజు గ్రాండ్ ఇండియా పెవిలియన్ ఘనంగా ప్రారంభమైంది. సీఎం రేవంత్‌తోపాటు కేంద్ర మంత్రి జయంత్ చౌదరి, రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అధికారులు పాల్గొన్నారు.
Updated Date - Jan 21 , 2025 | 03:36 AM