CM Revanth Reddy: ఐదు కీలక ప్రాజెక్టులకు నిధులివ్వండి
ABN, Publish Date - Feb 27 , 2025 | 03:55 AM
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని, ఐదు కీలక ప్రాజెక్టులకు నిధులివ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. కేసీఆర్ హయాంలో హైదరాబాద్‌లో మెట్రో విస్తరణ స్తంభించిపోయిందని, ఈ ప్రాజెక్టు ముందుకు సాగడానికి తోడ్పడాలని విన్నవించారు.
మెట్రో రైల్ ఫేజ్-2కు అనుమతివ్వండి.. ఆర్‌ఆర్‌ఆర్ దక్షిణ భాగాన్ని మంజూరు చేయండి
దానికి సమాంతర రైల్వే లైన్ అవసరం.. మూసీ ప్రాజెక్టు, డ్రైపోర్టుకు సహకరించాలి
సెమీకండక్టర్ మిషన్‌ను ఏర్పాటు చేయాలి.. ప్రధాని మోదీకి సీఎం రేవంత్ విజ్ఞప్తులు
వీటిని సాధిస్తే కిషన్ రెడ్డికి పౌరసన్మానం చేసి గండపెండేరం తొడుగుతానన్న రేవంత్
ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధానికి వివరించానన్న ముఖ్యమంత్రి
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని, ఐదు కీలక ప్రాజెక్టులకు నిధులివ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. కేసీఆర్ హయాంలో హైదరాబాద్‌లో మెట్రో విస్తరణ స్తంభించిపోయిందని, ఈ ప్రాజెక్టు ముందుకు సాగడానికి తోడ్పడాలని విన్నవించారు. దీనితోపాటు రీజినల్ రింగ్ రోడ్(ఆర్‌ఆర్‌ఆర్) దక్షిణ భాగాన్ని మంజూరు చేయాలని, ఆర్‌ఆర్‌ఆర్‌కు సమాంతరంగా రైల్వే లైన్‌కు అనుమతించాలని, డ్రైపోర్టు నుంచి ఏపీలోని బందర్ పోర్టుకు గ్రీన్‌ఫీల్డ్ హైవేను నిర్మించాలని, మూసీ రివర్ ఫ్రంట్ డెవల్‌పమెంట్ ప్రాజెక్టుకు భారీ నిధులు మంజూరు చేయాలని, సెమీకండక్టర్ మిషన్ ప్రాజెక్టుక అనుమతించాలని ఆయన అభ్యర్థించారు. బుధవారం ఢిల్లీలో ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయి.. వివిధ అభివృద్ధి అంశాలపై చర్చించారు. ఢిల్లీ టూర్‌లో ముఖ్యమంత్రి వెంట రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సీఎంవో అధికారి శేషాద్రి ఉన్నారు. కాగా అధికారిక సమావేశం అనంతరం మోదీతో సీఎం రేవంత్ రెడ్డి ఏకాంతంగా కొద్దిసేపు రాజకీయాలను చర్చించినట్లు సమాచారం. మోదీని కలిసిన తర్వాత రేవంత్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ రూపురేఖల్ని మార్చి సర్వతోముఖాభివృద్ధికి దారితీసే ఐదు ముఖ్యమైన ప్రాజెక్టుల గురించి ప్రధానమంత్రికి వివరించానని, ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు.
ఈ ప్రాజెక్టులను మంజూరు చేయించడంతోపాటు భారీ ఎత్తున నిధులు కేటాయించేలా కేంద్ర క్యాబినెట్ మంత్రి కిషన్ రెడ్డి, సహాయమంత్రి బండి సంజయ్ తోడ్పడాలని అభ్యర్థించారు. ఈ ప్రాజెక్టులను ఆమోదింపచేస్తే ఆ ఘనత కిషన్ రెడ్డికే దక్కుతుందని, తాను ఆయనకు పౌర సన్మానం చేసి గండపెండేరం తొడుగుతానని రేవంత్ చెప్పారు. హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-2కు వెంటనే అనుమతులు ఇవ్వాలని ప్రధానిని కోరానని తెలిపారు. గత ప్రభుత్వం పదేళ్లుగా హైదరాబాద్ నగరంలో మెట్రో విస్తరణపై దృష్టి సారించలేదని మోదీ దృష్టికి తీసుకెళ్లానన్నారు. ఫేజ్-2 కింద రూ.24,269 కోట్ల అంచనా వ్యయంతో 76.4 కి.మీ పొడవైన అయిదు మెట్రో కారిడార్లను ప్రతిపాదించామని వివరించారు. ఆర్‌ఆర్‌ఆర్ దక్షిణ భాగాన్ని వెంటనే మంజూరు చేయాలని ప్రధానిని కోరినట్లు తెలిపారు. సముద్ర మార్గం లేని తెలంగాణకు వస్తువుల ఎగుమతులు, దిగుమతులు సులువుగా చేసేందుకు ఆర్‌ఆర్‌ఆర్ సమీపంలో డ్రైపోర్టు అవసరమని చెప్పారు. ఆ డ్రెపోర్టు నుంచి ఏపీలోని బందరు పోర్టు వరకు గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు అవసరమని, ఆ రోడ్డును ఆనుకొని రైలు మార్గం మంజూరు చేస్తే సరుకుల రవాణా ఖర్చు తగ్గడంతోపాటు పారిశ్రామిక ఎగుమతి అవసరాలకు డ్రైపోర్టు కీలకంగా నిలుస్తుందని తెలిపారు. దీనివల్ల తెలంగాణలో కొత్త ఉద్యోగావకాశాలు పెరుగుతాయని చెప్పారు. హైదరాబాద్ నగరం మధ్యలో 55 కిమీ పొడవునా ప్రవహిస్తున్న మూసీ పునరుజ్జీవనానికి సహకరించాలని విజ్ఞప్తి చేశానన్నారు. ఈ ప్రాజెక్టుకు రూ.20 వేల కోట్ల ఆర్థిక సహాయం చేయాలని కోరినట్లు తెలిపారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు 222.7 ఎకరాల రక్షణ భూముల బదిలీకి సహకరించాలని విజ్ఞప్తి చేశానన్నారు. సెమీ కండక్టర్ల పరిశ్రమ ఏర్పాటుకు అనువైన పరిస్థితులు తెలంగాణలో ఉన్నందున ఇండియా సెమీ కండక్టర్ మిషన్ ప్రాజెక్టును రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు అనమతించాలనీ ప్రధానిని కోరినట్ల రేవంత్ తెలిపారు.
29 ఐపీఎస్ పోస్టులు మంజూరు చేయాలి
విభజన తర్వాత తెలంగాణకు 61 ఐపీఎస్ క్యాడర్ పోస్టులు వచ్చాయని, 2015లో రివ్యూ తర్వాత మరో 15 పోస్టులు అదనంగా వచ్చాయని ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇప్పుడున్న అవసరాలకు ఈ అధికారుల సంఖ్య సరిపోవడం లేదన్నారు. సైబర్ నేరాలు, డ్రగ్స్ కేసులు పెరగడం, రాష్ట్రంలో పెరిగిన పట్టణాలు, ఇతర అవసరాల దృష్ట్యా తెలంగాణకు అదనంగా 29 ఐపీఎస్ పోస్టులు మంజూరు చేయాలని కోరినట్లు పేర్కొన్నారు. ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధానికి వివరించానని తెలిపారు. నదుల పునరుజ్జీవం అవసరమని మోదీ చెప్పారని, మూసీ పునరుద్ధరణ మంచి నిర్ణయమని అభినందించారని రేవంత్ తెలిపారు.
పెండింగ్ అంశాలను ప్రస్తావించి.. రేవంత్‌ను ఆశ్చర్యపరిచిన మోదీ
తెలంగాణ అభివృద్ధికి ఐదు కీలక అంశాలతో ముఖ్యమంత్రి వినతిపత్రం సమర్పించిన వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ.. తెలంగాణలో పెండింగ్ అంశాలపై రేవంత్‌కు నోట్ సమర్పించి ఆశ్చర్యపరిచారు. ఆయా అంశాలపై అధికారులతో చర్చించి సత్వరం చర్యలు తీసుకుంటానని ఈ సందర్భంగా రేవంత్ ప్రధానితో చెప్పారు. ప్రధాని.. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చిన అంశాలివి..
పీఎంఏవై(గ్రామీణ)ను అమలు చేయడం లేదు
2016-17లో తెలంగాణకు పీఎంఏవై కింద 70,674 ఇళ్లను మంజూరు చేసినప్పటికీ రాష్ట్రం అమలు చేయకపోగా కేంద్ర వాటా మొత్తాన్ని తిప్పిపంపింది. 2024లో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసేందుకు అనుమతించాలని కోరినప్పటికీ 2018 ఆవాస్ సర్వే జరపనందువల్ల అర్హులైన కుటంబాలను గుర్తించలేదు. ఆవాస్-2024 మొబైల్ అప్లికేషన్ ఉపయోగించి అర్హులైన గ్రామీణ కుటుంబాలను గుర్తించేందుకు 2025 మార్చి 31 వరకు ఇంటింటి సర్వే పూర్తి చేయాల్సి ఉంటుంది.
మెగా ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయి
వామపక్ష తీవ్రవాద ప్రాంతాల్లో రెండవ దశలో భాగంగా మొబైల్ కనెక్టివిటీ, కొన్ని గ్రామాల్లో 4జీ మొబైల్ కవరేజి ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతోపాటు రూ.32,797 కోట్లతో చేపట్టిన రిలయన్స్ జియో 4జీ, 5జీ విస్తరణ ప్రాజెక్టుకు అనుమతులు, అటవీ క్లియరెన్స్‌లు పెండింగ్‌లో ఉన్నాయి. రూ.18,189.53 కోట్లతో చేపట్టిన జె.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల, రాజీవ్ భీమా ఎత్తిపోతల పథకం, శ్రీరామసాగర్ ప్రాజెక్టు రెండవ దశ పనుల కోసం భూసేకరణ, న్యాయ వివాదాలు తదితర అంశాలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పెండింగ్‌లో ఉన్నాయి. ముందుగా వీటిని పరిష్కరించుకోవాలి. బీబీనగర్‌లోని ఎయిమ్స్‌కు సంబంధించి.. రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంస్థలకు విద్యుత్ కనెక్షన్లు, నీటి సరఫరాకు సంబంధించి రూ.1365.95 కోట్ల మేరకు నిధులు విడుదల చేయాల్సి ఉన్నది. శంషాబాద్‌లో ప్రభుత్వ భూమిని కేటాయించకపోవడం వల్ల 100 పడకల ఈఎ్‌సఐ ఆస్పత్రి నిర్మాణం పెండింగ్‌లో ఉండిపోయింది. అదేవిధంగా భూసేకరణ, అటవీ అనుమతులు లేకపోవం వల్ల మనోహరాబాద్ - కొత్తపల్లి కొత్త రైల్వే లైన్, కాజీపేట - విజయవాడ మూడో లైన్ విద్యుద్దీకరణ పెండింగ్‌లో పడింది. ఇందుకు రూ.3113.48 కోట్లు ఖర్చు పెట్టేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నది.
Read Also : టన్నెల్‌లో తాజా పరిస్థితి ఇది.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమన్నారంటే..
ఇదెక్కడి వింత రైలు.. రోడ్డు మీద నడస్తున్న ఈ విచిత్రాన్ని చూస్తే షాకవ్వాల్సిందే..
తమిళనాడు సీఎంకు అమిత్ షా కౌంటర్.. 5 లక్షల కోట్లు ఇచ్చామని వెల్లడి
Updated Date - Feb 27 , 2025 | 03:55 AM