Tupran: బతికున్నప్పుడు పట్టించుకోలే.. చనిపోతే వచ్చారా?
ABN, Publish Date - Jun 29 , 2025 | 04:52 AM
బతికున్నప్పుడు తండ్రిని పట్టించుకోని పిల్లలు.. ఆయన చనిపోయాక అంత్యక్రియలకు రావడంతో గ్రామస్థులు అడ్డుకున్నారు. ఆ వృద్ధుడి మృతదేహం దరిదాపుల్లోకి కూడా వారిని వెళ్లనీయలేదు.
మృతుడి నలుగురు పిల్లలపై గ్రామస్థుల కన్నెర్ర
మృతదేహం దగ్గరకు వెళ్లనీయకుండా అడ్డగింత
అందరూ తలో చేయి వేసి అంత్యక్రియలు పూర్తి
మెదక్ జిల్లా వట్టూరు గ్రామంలో ఘటన
తూప్రాన్, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): బతికున్నప్పుడు తండ్రిని పట్టించుకోని పిల్లలు.. ఆయన చనిపోయాక అంత్యక్రియలకు రావడంతో గ్రామస్థులు అడ్డుకున్నారు. ఆ వృద్ధుడి మృతదేహం దరిదాపుల్లోకి కూడా వారిని వెళ్లనీయలేదు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం వట్టూరు గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన బింగి దేవయ్య (75), నర్సమ్మ దంపతులకు యాదగిరి, శ్రీనివాస్ కుమారులు.. ధనమ్మ, సంతోష, రమేశ్వరీ కూతుళ్లు ఉన్నారు. ఐదుగురు పిల్లలకూ దేవయ్య దంపతులు పెళ్లిళ్లు చేశారు. కూతుళ్లు అత్తగారి ఇళ్లలో ఉంటే.. కుమారులు బతుకుదెరువు కోసం ఊరు విడిచి దూరంగా వెళ్లిపోయారు. చిన్న కుమారుడు శ్రీనివాస్ వృద్ధ దంపతుల బాగోగులు చూసేవాడు. ఏడేళ్ల క్రితం దేవయ్య భార్య నర్సమ్మ, మూడేళ్ల క్రితం కొడుకు శ్రీనివాస్ చనిపోయారు.
అప్పటి నుంచి ఇంట్లో ఒంటరిగా ఉంటున్న దేవయ్యను కొడుకు యాదగిరి గానీ.. కూతుళ్లు గానీ ఎన్నడూ పట్టించుకోలేదు. నెల క్రితం దేవయ్య ఇంట్లో జారిపడి గాయపడ్డాడు. పక్కింటి వాళ్లు గుర్తించి గ్రామస్థుల సాయంతో కొడుకు, బిడ్డలకు ఫోన్ చేసి సమాచారమిచ్చినా వారు రాలేదు. పోలీసులతో ఫోన్ చేయించినా స్పందించలేదు. గ్రామస్థులే దేవయ్యను ఆస్పత్రిలో చేర్పించి వైద్యం చేయించారు. శుక్రవారం రాత్రి దేవయ్య మృతిచెందాడు. శనివారం అంత్యక్రియలు నిర్వహించేందుకు నలుగురు సంతానం ఊరొచ్చారు. దేవయ్య బతికున్నప్పుడు ఎన్నడూ పట్టించుకోలేదంటూ వారిని మృతదేహం వద్దకు గ్రామస్థులు రానివ్వలేదు. ‘‘పెద్దాయన చచ్చాక వచ్చారా?’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్థులే అంత్యక్రియల కోసం తలో చేయి వేశారు. దేవయ్య బాగోగులు చేసుకున్న శ్రీనివాస్ చిన్న కుమారుడు.. అంటే ఆయన మనుమడితో దహన సంస్కారాలు చేయించారు.
Updated Date - Jun 29 , 2025 | 04:52 AM