Hyderabad: ఆర్థిక సత్తా.. సాంకేతిక సామర్థ్యం ఉంటేనే!
ABN, Publish Date - Jul 12 , 2025 | 05:08 AM
హైబ్రిడ్ యాన్యుటీమోడల్(హ్యామ్)లో నిర్మించే రహదారులు, ఇతర నిర్మాణాల కాంట్రాక్టులను చిన్న సంస్థలు దక్కించుకోవాలంటే కుదరదు. ఆర్థికంగా సత్తా, సాంకేతిక సామర్థ్యం ఉండాల్సిందే.
హ్యామ్ రోడ్ల కాంట్రాక్టు నిబంధనల్లో మార్పు
కీలక సవరణలు చేసిన కేంద్ర ప్రభుత్వం
హైదరాబాద్, జూలై 11 (ఆంధ్రజ్యోతి): హైబ్రిడ్ యాన్యుటీమోడల్(హ్యామ్)లో నిర్మించే రహదారులు, ఇతర నిర్మాణాల కాంట్రాక్టులను చిన్న సంస్థలు దక్కించుకోవాలంటే కుదరదు. ఆర్థికంగా సత్తా, సాంకేతిక సామర్థ్యం ఉండాల్సిందే. కాంట్రాక్టు సంస్థలకు ఉండాల్సిన ఆర్థిక, సాంకేతిక అర్హతల్లో కేంద్రం కీలక మార్పులు చేసింది. ఈ మార్పులు తక్షణమే అమల్లోకి వస్తాయి. అర్హతల మార్పుపై కేంద్రం అన్ని రాష్ట్రాలకు గురువారం లేఖలు రాసింది. హైవేలు, సొరంగాలు, ప్రధాన వంతెనలు, రోడ్ ఓవర్ వంతెనలు, స్వతంత్ర ప్రత్యేక ప్రాజెక్టులు, హైవేల మార్పులు, కోర్ సెక్టార్‌లలో ఉన్న నిబంధనల్లో మార్పులు తెచ్చారు. రాష్ట్రంలో రోడ్లు, భవనాల శాఖ, పంచాయతీరాజ్ శాఖల పరిధిలో కలిపి 28 వేల కిలోమీటర్ల రోడ్లను హైబ్రిడ్ యాన్యుటీ మోడల్‌లో అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్‌హెచ్‌ఏఐ, ఇండియన్ రోడ్ కాంగ్రె్‌స(ఐఆర్‌సీ) నిబంధనల మేరకు ఈ రోడ్లను నిర్మిస్తారు.
అంచనా వేసిన ప్రాజెక్టు ఖర్చులో కాంట్రాక్టరుకు గతంలో 15ు ఆర్థిక సామర్థ్యం ఉన్నా సరిపోయేది. దాన్ని 20 శాతానికి పెంచారు. ఒకటి కన్నా ఎక్కువ కంపెనీలు కలిపి పని చేస్తే ప్రతీ కంపెనీకి ప్రాజెక్టు వ్యయంలో 7.5 శాతం మేర గడచిన ఆర్థిక సంవత్సరంలో నికర విలువ ఉండాలని గతంలో షరతు పెట్టారు. దాన్ని ఇప్పుడు పది శాతానికి పెంచారు. గతంలో ఏదైనా మేజర్ బ్రిడ్జి, ఆర్వోబీ, ఫ్లైఓవర్/టన్నెల్ ప్రాజెక్టులను ఒకటి కన్నా ఎక్కువ కంపెనీలు కలిసి నిర్మిస్తే అందులో ఒక కంపెనీకి కనీసం పదేళ్ల అనుభవం ఉండాలని నిబంధన ఉంది. దాన్ని ఏడేళ్లకు తగ్గించారు. వంతెనలు, ఫ్లైఓవర్లు, సొరంగాలు నిర్మించాల్సినవి ఒకటి 60 మీటర్లకు మించి ఉంటే, లేదా అన్నీ కలిపి 100 మీటర్లకు మించి ఉన్నా దానికి సమానమైన పని చేసిన అనుభవం ఉండాలని నిబంధన పెట్టారు. గత అనుభవాన్ని పరిగణనలోకి తీసుకోవడానికి పాత ప్రాజెక్టు 90ు పూర్తయి ఉండాలని స్పష్టం చేశారు.
Updated Date - Jul 12 , 2025 | 05:08 AM