Kishan Reddy: మీకు.. కేసీఆర్‌కు తేడా ఏంటి?
ABN, Publish Date - Mar 17 , 2025 | 04:09 AM
అప్పులు చేయడం, అవినీతికి పాల్పడటం, అసభ్యంగా మాట్లాడటంలో మాజీ సీఎం కేసీఆర్ కంటే ఏమీ తక్కువ తినలేదన్నట్లుగా సీఎం రేవంత్ వ్యవహరిస్తున్నారని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మండిపడ్డారు.
అప్పులు, అసభ్య పదజాలంలో ఎవరు తక్కువ
హామీల అమలెప్పుడో బడ్జెట్ సమావేశాల్లో చెప్పండి
సీఎం రేవంత్‌కు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సవాళ్లు
హైదరాబాద్, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): అప్పులు చేయడం, అవినీతికి పాల్పడటం, అసభ్యంగా మాట్లాడటంలో మాజీ సీఎం కేసీఆర్ కంటే ఏమీ తక్కువ తినలేదన్నట్లుగా సీఎం రేవంత్ వ్యవహరిస్తున్నారని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ప్రజాపాలన అంటే అప్పుల పాలననా..? అని నిలదీశారు. కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీ కట్టలేకపోతున్నానని అంటూనే.. 15 నెలల్లో రూ.లక్షా 52వేల కోట్ల అప్పు చేశారంటే కేసీఆర్‌కు, మీకు ఉన్న తేడా ఏంటి..? అని రేవంత్‌ను ప్రశ్నించారు. ‘‘మీరు సీఎం అయ్యాక తెలంగాణకు ఏం ఒరిగింది..? ఏం మార్పు వచ్చింది..? ఇసుక వ్యాపారంలోనా..? లిక్కర్ దోపిడీలోనా..? బెల్ట్‌షాపులు పెంచడంలోనా..? భూముల అమ్మకాల్లోనా..? అప్పులు చేయడంలోనా..? అహంకారపూరిత మాటల్లోనా..?’’ అంటూ విరుచుకుపడ్డారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. గ్యారెంటీలు, హామీలపై బడ్జెట్ సమావేశాల్లో స్పష్టత ఇవ్వాలని.. వాటిని ఎప్పటిలోగా అమలు చేస్తారో, కార్యాచరణ ఏంటో చెప్పాలని రేవంత్‌ను డిమాండ్ చేశారు.
మాజీ సీఎం కేసీఆర్ పుణ్యమా అని శాసనసభలో భాష మారిందని విమర్శించారు. కేసీఆర్ భాషను రేవంత్ కొనసాగిస్తూ, డొక్క చీరుస్తా, తొక్కి పడేస్తా, అంతు చూస్తా అంటూ కొత్త భాషకు తెరలేపారని అన్నారు. జాతీయ విద్యా విధానం, లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనపై కాంగ్రెస్, డీఏంకేలు దివాళాకోరుతనంతో వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. ఆర్‌బీఐ కరెన్సీ తమిళనాడులో చెల్లుబాటు అవుతుందా..? లేదా..? రాహుల్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తమిళనాడులో ప్రధాని మోదీని, హిందీ భాషను బూచిగా చూపించి కాంగ్రెస్, డీఎంకేలు ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. తమిళనాడు లిక్కర్ స్కాంలో డీఎంకే నాయకుల పాత్ర ఉందని కిషన్‌రెడ్డి ఆరోపించారు. డీఎంకే పాలన, స్టాలిన్ కుటుంబ అవినీతి, దోపిడీ, నియంతృత్వ ధోరణిపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత నుంచి తప్పించుకోవడానికి రాజకీయ నాటకాలు ఆడేందుకు సిద్ధమయ్యారని విమర్శించారు. ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలపై పార్టీలో చర్చిస్తామని కిషన్‌రెడ్డి చెప్పారు.
కాంగ్రెస్‌వి ముస్లిం బుజ్జగింపు రాజకీయాలు
న్యూఢిల్లీ, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): కర్ణాటకలో ముస్లింలకు ప్రభుత్వ టెండర్లలో 4శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించడం రాజ్యాంగ విరుద్ధమని కిషన్‌రెడ్డి విమర్శించారు. ఇది కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలకు ఉదాహరణ అని తెలిపారు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీల ఉద్యోగాలు.. హక్కులను కర్ణాటక ప్రభుత్వం కాలరాస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ తదుపరి లక్ష్యం తెలంగాణ కావచ్చని అనుమానం వ్యక్తం చేశారు.
Updated Date - Mar 17 , 2025 | 04:09 AM