Bhatti Vikramarka: కుటీర పరిశ్రమలను పోత్సహిస్తాం
ABN, Publish Date - Jun 26 , 2025 | 04:02 AM
కుటీర పరిశ్రమలను తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు.
బీసీ వృత్తి కళాకారుల ప్రదర్శనలో డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్/ ఖైరతాబాద్, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): కుటీర పరిశ్రమలను తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌లతో కలిసి ఆయన బుధవారం హైదరాబాద్‌లో బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన బీసీ చేతి వృత్తి కళాకారుల ఉత్పత్తుల ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ వాసులు.. గ్రామాల్లో చేతి వృత్తులను నమ్ముకుని జీవనం సాగిస్తున్న కుల వృత్తుల వారిని ఆదుకోవాలని సూచించారు.
సమాజానికి చేతి వృత్తి కళాకారుల ఉత్పత్తులు పెద్ద ఎత్తున ఉపయోగ పడతాయన్నారు. ప్రదర్శనలో ఏర్పాటు చేసిన పర్యావరణ హితమైన వస్తువులతో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఆయన చెప్పారు. బీసీ వర్గాల కార్పొరేషన్లపై ప్రత్యేక దృష్టి సారించడంతోపాటు నిధులు కేటాయిస్తుందని తెలిపారు. మంత్రి పొన్నం మాట్లాడుతూ.. ఆషాడ మాస బోనాలకు కావాల్సిన వస్తువులు ప్రదర్శనలో అందుబాటులో ఉన్నాయన్నారు. 29 వరకూ సాగే ప్రదర్శనలో మట్టి కుండలు, మేదరి బుట్టలు, గృహోపకరణాలు, గాజులు, పూసలు, పోచంపల్లి, గద్వాల, నారాయణపేట చేనేత ఉత్పత్తుల స్టాళ్లు ఏర్పాటు చేశారు.
Updated Date - Jun 26 , 2025 | 04:02 AM